breaking news
generics
-
జనరిక్స్‌కు గుడ్‌బై.. స్పెషాలిటీ డ్రగ్స్‌కు వెల్కమ్
భారత ఔషధ పరిశ్రమలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు తక్కువ ధరల జనరిక్ మందులతో ప్రపంచమార్కెట్లో ఆధిపత్యం చాటిన భారత ఫార్మా కంపెనీలు ఇప్పుడు అధిక విలువ కలిగిన స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మందులు, ఇతర బ్రాండెడ్ వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరల పోటీ, మార్జిన్ల తగ్గుదలతో కంపెనీలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఫార్మా సంస్థలైన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, సిప్లా, లుపిన్ కంపెనీ ప్రతినిధుల వ్యాఖ్యలు ఫార్మా రంగంలో వస్తున్న ఈ మార్పును తెలియజేస్తున్నాయి. సంప్రదాయ జనరిక్స్ బదులుగా లాభాలు అందించే ప్రత్యేక ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, వినూత్న చికిత్సలపై కంపెనీలు దృష్టి పెట్టాయి. ఈ మార్పులో సన్ ఫార్మా ఇతర కంపెనీలకన్నా ముందంజలో ఉంది. కంపెనీ గ్లోబల్ ఇన్నొవేటివ్ మెడిసిన్స్ వ్యాపారం 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో 22 శాతానికిపైగా స్పెషాలిటీ మందుల నుంచి వస్తోంది. రుమేనియా, బ్రెజిల్, చైనా మార్కెట్లలో ఇలుమ్యా వంటి వినూత్న ఔషధాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ కూడా బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్, ఇంకా అనేక విభిన్న ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. ఉత్పత్తి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక వార్షిక ఆదాయాన్ని రెడ్డీస్ నమోదు చేసింది. ప్రాథమిక వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీఎఫ్ఓ ఎం.వి. నరసింహం తెలిపారు. మరోవైపు సిప్లా తన ఆఫ్రికా వ్యాపారం, శ్వాసకోశ చికిత్సలు, బ్రాండెడ్ ప్రి్రస్కిప్షన్ ఔషధాల ద్వారా బలమైన వృద్ధిని సాధిస్తోంది. కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్ వ్యాపారం 400 మిలియన్ డాలర్లకు పైగా నమోదు చేసింది. బయోసిమిలర్స్‌ను భవిష్యత్తులో భారీ అవకాశాలున్న విభాగంగా కంపెనీ భావిస్తోంది. లుపిన్ కూడా అమెరికా వెలుపల మార్కెట్లు, బ్రెజిల్ వంటి దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కంపెనీ బ్రెజిల్ వ్యాపారం స్థానిక కరెన్సీలో 113 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 60కి పైగా ఇంజెక్టబుల్స్, శ్వాసకోశ ఉత్పత్తుల అభివృద్ధి పనులు కొనసాగుతుండగా వచ్చే ఏడాదిలోగా అమెరికా మార్కెట్లో తొలి బయో సిమిలర్ ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాలో మార్పులు ఇలా కొనసాగుతుండగా దేశీయ ఔషధ మార్కెట్ కూడా బలపడుతోంది. ఈక్విరస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం 2026 మే నాటికి భారత ఫార్మా మార్కెట్ 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 3.2 శాతం నేరుగా జరిగిన అమ్మకాల నుంచే రావడం గమనార్హం. ఇది నిజమైన వినియోగ డిమాండ్‌ను సూచిస్తోందని ఈక్విరస్ తెలిపింది. భారత ఫార్మారంగం జనరిక్స్ తయారీ కేంద్రం అనే గుర్తింపును దాటి పరిశోధన ఆధారిత అధిక విలువ కలిగిన ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఎదిగే దిశగా ప్రయాణంప్రారంభించింది. వచ్చే రోజుల్లో స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, కొత్త మార్కెట్లే భారత ఫార్మా వృద్ధికి ప్రధాన ఇంధనంగా మారనున్నాయి. స్పెషాలిటీ మందులు అంటే? సాధారణ జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు మందులు అన్ని మెడికల్ షాపుల్లో సులభంగా లభిస్తాయి. వీటి తయారీ కూడా సులభం, అలా కాకుండా క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మలి్టపుల్ స్లెరోసిస్, సోరియాసిస్, హెపటైటిస్, హెచ్ఐవీ వంటి క్లిష్టమైన దీర్ఘకాలిక వ్యాధుల కోసం తయారుచేసే అత్యాధునిక అధిక ధర ఔషధాలు. వీటి తయారీ, పరిశోధనకి చాలా ఖర్చు అవుతుంది. ఇవి ప్రత్యేక ఆసుపత్రులు, ఫార్మసీల ద్వారానే లభిస్తాయి. సాధారణ మందులతో పోలిస్తే ధరలు ఎక్కువ. చాలావరకు ఇంజెక్షన్, ఇన్ఫ్యూషన్ రూపంలో ఇస్తారు. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఈ మందుల అమ్మకాలపై లాభాల మార్జిన్ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. జనరిక్స్ మార్కెట్లో పోటీ పెరగడంతో ఫార్మా కంపెనీలకు స్పెషాలిటీ డ్రగ్స్ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులుగా మారుతున్నాయి. పేటెంట్ ఆధారిత ఉత్పత్తులు కావడంతో పోటీ కూడా తక్కువగా ఉంటుంది.– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
రెడ్డీస్ చేతికి వొకార్డ్ జనరిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్.. ఇదే రంగంలోని వొకార్డ్‌కు చెందిన కొన్ని విభాగాల బ్రాండెడ్ జనరిక్స్ దేశీ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ బుధవారం వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్‌తో పాటు నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్టీవుల బిజినెస్‌ను సైతం చేజిక్కించుకోనుంది. డీల్ విలువ రూ.1,850 కోట్లు. డీల్ ద్వారా వొకార్డ్‌కు చెందిన 62 బ్రాండ్లు డాక్టర్ రెడ్డీస్ పరంకానున్నాయి. శ్వాసకోస, కేంద్ర నాడీ మండల, చర్మ, జీర్ణకోశ, నొప్పుల విభాగాలకు చెందిన పలు బ్రాండ్లను రెడ్డీస్ సొంతం చేసుకోనుంది. వొకార్డ్‌కు చెందిన అమ్మకాలు, మార్కెటింగ్ టీమ్‌లతో పాటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డిలో గల తయారీ ప్లాంటు సైతం డాక్టర్ రెడ్డీస్‌కు దక్కుతుంది. స్లంప్‌సేల్ ప్రాతిపదికన ఈ డీల్ కుదుర్చుకున్నట్లు రెడ్డీస్ వెల్లడించింది. భారత మార్కెట్ తమకు ముఖ్యమని, వొకార్డ్ వ్యాపారాల కొనుగోలుతో ఇక్కడ మరింత విస్తరించేందుకు మార్గం సుగమం అయిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. తాజా కొనుగోలుతో అధిక వృద్ధికి ఆస్కారమున్న విభాగాలలో కంపెనీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయని వివరించారు. -
భారత ఫార్మా కంపెనీ చేతికి యూరప్ సంస్థ
♦ ఆక్టావిస్ జనరిక్స్ వ్యాపారాన్ని కొంటున్న ఇంటాస్ ఫార్మా ♦ డీల్ విలువ రూ.5,100కోట్లు ముంబై: భారత అతి పెద్ద అన్‌లిస్టెడ్ ఫార్మా కంపెనీ.. ఇంటాస్ ఫార్మా, యూరప్‌లోని ఆక్టావిస్ కంపెనీ జనరిక్స్ వ్యాపారాన్ని రూ.5,100 కోట్ల(60 కోట్ల పౌండ్ల)కు కొనుగోలు చేయనున్నది. అంతా నగదులోనే ఈ యూకే కంపెనీని ఇంటాస్ ఫార్మా కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటాస్ ఫార్మా పూర్తి అనుబంధ సంస్థ, అకార్డ్ హెల్త్‌కేర్ ఈ వ్యాపారాన్ని చేజిక్కించుకోనున్నది. ఒక యూరప్ ఫార్మా కంపెనీని ఒక భారత కంపెనీ ఈ స్థాయి అత్యధిక ధరకు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. బ్రెగ్జిట్ అనంతరం ఇంగ్లాండ్‌కు వచ్చిన అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా ఇదే. బ్యాంక్‌ల నుంచి రుణం ఆక్టావిస్ జనరిక్స్ వ్యాపారాన్ని చేజిక్కించుకోవడంతో అహ్మదాబాద్‌కు చెందిన ఇంటాస్ ఫార్మా యూకే, ఐర్లాండ్ జనరిక్స్ మార్కెట్లలో అగ్రశ్రేణి కంపెనీగా అవతరిస్తుందని ఇంటాస్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ, బినిస్ చద్గర్ చెప్పారు. ఈ డీల్‌కు అవసరమున్న నిధులను ప్రస్తుతమున్న ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించే ఆప్షన్ ఉందని పేర్కొన్నారు. కానీ, తమ కంపెనీలో మరింత వాటాకు పీఈ ఇన్వెస్టర్లకు ఇచ్చే యోచన లేదని, అందుకే బ్యాంక్‌ల కన్షార్షియమ్ నుంచి తీసుకుంటున్నామని చెప్పారు. ఈ వ్యాపారం కొనుగోలుకు కావలసిన నిధులను ఐదేళ్ల రుణంగా బ్యాంక్‌ల కన్సార్షియమ్ అకార్డ్ హెల్త్‌కేర్‌కు ఇవ్వనున్నదని వివరించారు. తమది ఎలాంటి రుణభారం లేని కంపెనీ అని వివరించారు. తాము కొనుగోలు చేసే ఈ వ్యాపారం లాభసాటిది అయినందున వంద కోట్ల డాలర్ల రుణం తీసుకున్నా, నాలుగో ఏడాదిలోనే పూర్తిగా రుణాన్ని తీర్చేయగలమన్న ధీమా తమకుందని పేర్కొన్నారు. ఆక్టావిస్ కంపెనీ అత్యున్నత నాణ్యత గల జనరిక్ ఔషధాలను ఫార్మసీలకు, టోకు వర్తకులకు సరఫరా చేస్తోందని తెలిపారు. బర్న్స్స్టేపుల్, నార్త్ డెవన్ల్లో ప్లాంట్లున్నాయని, ఈ ప్లాంట్లు ఇత ర కంపెనీలకు కాంట్రాక్టు సర్వీసులను నిర్వహిస్తున్నాయి. యూరోప్ ఆదాయం రెట్టింపు.. యూకే, ఐర్లాండ్ జనరిక్స్ మార్కెట్లలో ఆక్టావిస్ మొదటి స్థానంలో ఉందని, అందుకే ఈ వ్యాపార కొనుగోలు కోసం తగిన ప్రీమియమ్ చెల్లించామని బినిస్ చద్గర్ పేర్కొన్నారు. ఈ జనరిక్స్ వ్యాపారం కొనుగోలుతో యూరప్ నుంచి తమకు వచ్చే ఆదాయం రెట్టింపై 50 కోట్ల డాలర్లకు పెరుగుతుందని వివరించారు. భారత అగ్రశ్రేణి పది ఫార్మా కంపెనీల్లో ఒకటైన ఇంటాస్ వార్షికాదాయం వంద కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. వీటిల్లో 60 శాతానికి పైగా ఆదాయం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచే వస్తోంది. ఇంటాస్ సంస్థ 70కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే అధికాదాయం యూకే, యూరప్, అమెరికాల నుంచే వస్తోంది. సింగపూర్‌కు చెందిన టిమసెక్, క్రిస్‌క్యాపిటల్ సంస్థలకు ఈ కంపెనీలో వాటాలున్నాయి.


