నీఘా నీడలో ‘కాన్సులేట్’!
సాక్షి, చెన్నై : వరుస ఆందోళనలతో రాష్ర్ట పోలీసు యంత్రాంగం మేల్కొంది. నగరంలోని అమెరికా కాన్సులేట్‌ను నిఘా నీడలోకి తెచ్చారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాలకు ఆంక్షలు విధించారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో ప్రధాన ప్రాంతాల్లో జెమినీ వంతెన ప్రదేశం ఒకటి. ఈ వంతెనకు ఆనుకుని అమెరికా దౌత్య కార్యాలయం ప్రహరీ ఉంటుంది. నిత్యం వందలాది మంది ఆ ప్రహరీ వద్ద వీసాల కోసం బారులు తీరి ఉంటారు. ఈ మార్గంలో ఆ కార్యాలయానికి భద్రత కల్పించడం అన్నది నగర పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాలే. ఓ వైపు మెట్రో రైలు పనులతో ట్రాఫిక్ మళ్లింంచడం వాహన చోదకులకు గందరగోళ పరిస్థితిని సృష్టిస్తోంది. మరో వైపు ఈ కాన్సులేట్‌కు వ్యతిరేకంగా అప్పుడప్పుడు బయలు దేరే నిరసనలు మరింతగా సమస్యల్ని సృష్టిస్తున్నాయి.
ఆందోళనలు: గత ఏడాది సెప్టెంబరులో అమెరికాలో మహ్మద్ ప్రవక్తను అవహేళన చేస్తూ అమెరికాలో ఓ చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ చెన్నైలో ఆగ్రహ జ్వాల రగిలింది. అమెరికా దౌత్య కార్యాలయంపై నిరసనకారులు ప్రతాపాన్ని చూపించారు. ఈ దాడిలో సీసీ కెమెరాలు, అక్కడి అద్దాలు ధ్వంసం కావడం పెను వివాదానికి దారి తీసింది. దీంతో అప్పటి కమిషనర్ త్రిపాఠి పదవి ఊడింది. అప్పటి నుంచి ఆ కాన్సులేట్‌కు గట్టి భద్రతను కల్పించి అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే, గత వారం రోజులుగా ఈ కార్యాలయంవద్ద ఆందోళనలు చోటు చేసుకుంటోన్నాయి. అమెరికాలో భారత రాయబారి దేవయానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నిత్యం నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
నిఘా నీడ: వరుస ఆందోళనలు ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతాయోనన్న బెంగ పోలీసుల్ని వెంటాడుతోంది. దీంతో ఆ కార్యాలయాన్ని నిఘా నీడలోకి తెచ్చారు. ఆ పరిసరాల్లో వాహనాలు పార్కింగ్ చేయకుండా, ఆగకుండా ఆంక్షలు విధించారు. ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు, ఇద్దరు జాయింట్ కమిషనర్లు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, పది మంది సబ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో 50మంది హెడ్ కానిస్టేబుళ్లు, మరో 300 మంది పోలీసుల్ని భద్రతకు నియమించారు. వీరితో పాటుగా ఆ కాన్సులేట్ ప్రైవేట్ సెక్యూరిటీ, ఆయుధ బలగాలు ఇక భద్రతా విధుల్లో నిమగ్నమయ్యాయి. జెమిని వంతెనపై ప్రత్యేకంగా అక్కడక్కడ తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆ వంతెన పరిసరాల్లోని ఫుట్ పాత్లలో ఎవరూ నడవకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.