breaking news
Gastro counseling
-
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమంటున్నారు... సలహా ఇవ్వండి నా వయసు 46 ఏళ్లు. నాకు గత 20 ఏళ్లుగా మద్యం అలవాటు ఉంది. రెండేళ్ల కిందట తీవ్రమైన అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్చారు. లివర్ దెబ్బతిన్నదనీ, తాగడం మానేయమని చెప్పారు. ఇంకా కొనసాగితే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వస్తుందని చెప్పారు. తగ్గించాను గానీ మద్యం పూర్తిగా మానలేకపోయాను. ఇటీవల నీరసంగా ఉండటంతో మళ్లీ ఆసుపలత్రిలో చూపించుకున్నాను. మితిమీరిన మద్యం ప్రభావం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నదనీ, కాలేయ మార్పిడి చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. – పి.ఎన్. నాథ్, కోదాడ కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి సరిచేసుకోవడానికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా తొలిదశలో యథావిధిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో అది చాలారకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. లివర్ సిర్రోసిస్ వంటి కొన్ని వ్యాధుల కారణంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కేసుల్లో కాలేయ క్యాన్సర్ ఒకటి. దీని చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం హఠాత్తుగా కుప్పకూలిపోతుంది. కాలేయ వ్యాధుల చికిత్సకు ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల మందులు, అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దీన్ని మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వీటినే ఏ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటున్నారు. ఏ చైల్డ్ స్థాయిలోనే డాక్టర్ దగ్గరికి రాగలిగితే మందులతో, మంచి అలవాట్ల వంటి జీవనశైలి మార్పులతో చికిత్స చేసి మళ్లీ పూర్తిస్థాయి సాధారణ పరిస్థితికి తేవచ్చు. మొదటి రెండు స్థాయిలు అంటే ఏ, బి దశల్లో చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. అయితే బి, సి స్థాయిలకు చేరుకుంటే వ్యాధి తీవ్రతను, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనా వేసి కాలేయ మార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. కాలేయ మార్పిడిలో రెండు రకాలు వ్యాధిగ్రస్తమై పనిచేయలేని స్థితిలో ఉన్న కాలేయాన్ని తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైన మరో కాలేయాన్ని అమర్చడానికి చేసే సర్జరీనే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) అంటారు. ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) దేహం నుంచి సేకరించిన దాన్ని అవసరమైన వారికి అమర్చడం. బ్రెయిన్‌డెడ్‌కు గురై వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి దేహం నుంచి సేకరించిన దాన్ని అవసరమైన వారికి అమర్చడం మొదటి పద్ధతి. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్ సంస్థలో పేరు నమోదు చేసుకొని తమ వంతు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తమ కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడం ద్వారా రోగి దాన్ని స్వీకరించడం. ఆ తర్వాత రోగి యథావిధిగా తన సాధారణజీవితం గడిపేందుకు అవకాశం దొరుకుతుంది. - డాక్టర్ బాలచంద్రన్ మీనన్, సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెపటాలజీ అండ్ లివర్ డిసీజెస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
పాంక్రియాటైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకూ ముప్పు? నా వయసు 37 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు చాలా నీరసంగా ఉంటోంది. బరువూ తగ్గింది. తరచూ పొత్తి కడుపులో నొప్పి వస్తోంది. దాంతో రక్తపరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు షుగర్ ఉన్నట్లు తేలింది. అందుకే ఈ అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయని అనుకున్నాను. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడదామని వెళ్తే, ఆయన కొన్ని ఇతర పరీక్షలు చేసి, నేను అక్యూట్ పాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్నానని, వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రమాదమని చెప్పారు. నేను అప్పుడప్పుడూ మద్యం కూడా తీసుకుంటూ ఉంటాను. అందుకే ఈ వ్యాధి వచ్చిందా? ఇదేమైనా డేంజరా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – ఎమ్.ఆర్. ప్రసాద్, నిజామాబాద్ పాంక్రియాటైటిస్ అనేది తీవ్రమైన వ్యాధి కాదు. కానీ దీర్ఘకాలం దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. పాంక్రియాస్ (క్లోమ గ్రంథి) చిన్నపేగుకు పక్కనే ఉండి జీర్ణప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్, ఇన్సులిన్, సొమటోస్టాటిన్ అనే హార్మోన్లను రక్తంలోకి విడుదల చేసి దానిని శక్తిగా మారుస్తుంది. డయాబెటిస్ నుంచి కూడా ఈ గ్రంథి కాపాడుతుంది. ఈ రసం ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీన్ని పాంక్రియాటైటిస్ అంటారు. కొన్ని సందర్భాల్లో క్లోమరసంలో ప్రొటీన్ల పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు మితిమీరిన మద్యపానం, జన్యువుల ప్రభావం, జంక్‌ఫుడ్ కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. అయితే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొన్నేళ్ల తర్వాత బయటపడతాయి. మీకు ఈ వ్యాధి చాలాకాలం నుంచి ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువతో పాటు బరువు తగ్గడం లాంటి లక్షణాలతో బాధపడ్డారు. మీరు వెంటనే మద్యం పూర్తిగా మానేయండి. దీనిని మొదటిదశలోనే కనిపెట్టకపోతే వ్యాధి ముదిరి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మీకు రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ లాంటివి చేయాల్సి ఉంటుంది. క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స అందించాలి. లేకపోతే ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ కాస్తా ‘క్రానిక్ పాంక్రియాటైటిస్’గా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి చెడిపోయే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాలలో మందులతో ఈ జబ్బు తగ్గనప్పుడు ఇప్పుడు అందివచ్చిన అత్యాధునిక చికిత్స సదుపాయం ల్యాప్రోస్కోపిక్ సర్జరీ/కీహోల్ సర్జరీ విధానం ద్వారా ఒకవేళ క్లోమగ్రంథి చెడిపోయి ఉంటే దాన్ని తొలగించవచ్చు. ఈ శస్త్రచికిత్స వల్ల రోగి హాస్పిటల్లో ఉండే వ్యవధి తగ్గడంతో త్వరగానే మీరు మీ సాధారణ వృత్తి వ్యాపకాలు కొన సాగించవచ్చు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరమా? మా నాన్నకు 51 ఏళ్లు. చాలా ఏళ్లుగా ఆయనకు మద్యపానం అలవాటు ఉంది. ఈ మధ్య కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతుంటే వైద్య పరీక్షలు చేయించాం. మద్యపానం అలవాటు వల్ల లివర్ బాగా పాడైపోయిందని డాక్టర్ చెప్పారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అవసరముంటుందా? దయచేసి తెలపండి. – డి. సుందర్, భీమవరం మద్యపానం వల్ల శరీరంలో ముందుగా పాడయ్యేది లివరే. ఎప్పుడన్నా ఒకసారి, అదీ చాలా మితంగా తాగితే తాగొచ్చుగానీ అది రోజువారీ అలవాటుగా మారితే మాత్రం లివర్ దెబ్బతింటుందని గుర్తించడం చాలా అవసరం. మీ నాన్న విషయానికి వస్తే ముందుగా ఆయన లివర్ ఏ మేరకు దెబ్బతిన్నదో చూడాలి. కామెర్లు, ట్యూమర్స్ (గడ్డలు), సిర్రోసిస్, హెపటైటిస్ వంటి కారణాలతో లివర్ దెబ్బతింటుంది. లివర్ పూర్తిగా గట్టిపడిపోయి రాయిలా మారిపోయిన స్థితిలో దానిని క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. లివర్ పూర్తిగా నాశనమైపోయి పనిచేయనప్పుడు మాత్రమే లివర్ మార్పిడి సర్జరీ అనివార్యం అవుతుంది. అయితే దానికంటే ముందుగా దెబ్బతిన్న లివర్‌ను కాపాడేందుకు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మద్యపానం వల్ల లివర్ దెబ్బతిన్న కేసులలో ముందుగా ఓ ఆర్నెల్లపాటు ఆ పేషెంట్‌ను మద్యానికి దూరంగా ఉంచి చికిత్స చేయడం ద్వారా లివర్‌ను కాపాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ నాన్న విషయంలో కూడా అది సాధ్యమే. ముందుగా ఆయనచేత వెంటనే మద్యం మాన్పించి దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుకు చూపించి చికిత్స ప్రారంభించండి. పిత్తాశయంలో రాళ్లు... సర్జరీ తప్పదా? నా వయసు 45 ఏళ్లు. నేను ఇటీవలే రొటీన్‌గా చేయించుకున్న వైద్య పరీక్షలలో గాల్‌బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్లు ఉన్నట్లు బయటపడింది. కానీ నాకు కడుపునొప్పి వంటి ఎలాంటి లక్షణాలూ బయటికి కనిపించడం లేదు. ఇప్పుడు రాళ్లను తొలగించడానికి సర్జరీనే ఉత్తమ పరిష్కారం అని డాక్టర్ అంటున్నారు. మీ సలహా ఏమిటి? – డి. రాగిణి, వరంగల్ గాల్‌బ్లాడర్ అనేది లివర్‌కు అనుసంధానమై సంచి మాదిరిగా ఉండే నిర్మాణం. ఇది పైత్యరసాన్ని నిల్వ చేస్తుంది. రకరకాల కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. మీకు కూడా ఏవో కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు వచ్చి ఉండవచ్చు. అయితే మీ విషయం తీసుకుంటే మీకు కడుపులో ఎలాంటి నొప్పిలేదు కాబట్టి వీటిని లక్షణాలు కనిపించని గాల్స్టోన్స్గా చెప్పవచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడిన జబ్బుతో బాధపడే కొందరు పేషెంట్లకు ఉదరం కుడివైపు ఎగువభాగాన తీవ్రమైన నొప్పివస్తుంది. అలాగే కామెర్లు, తీవ్రమైన పాంక్రియాటిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సందర్భాల్లో కీహోల్ సర్జరీ ద్వారా మొత్తం గాల్‌బ్లాడర్‌ను తీసివేయాలని మేము సూచిస్తాం. మీ విషయానికి వస్తే, మీకు కడుపునొప్పి లాంటి లక్షనాలే ఏవీ కనిపించనందున మీకు ఇప్పుడైతే ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు తీవ్రమైన కడుపునొప్పి లేదా కామెర్లు వంటి పరిణామాలకు గురైతే అప్పుడు సర్జరీ కోసం స్పెషలిస్టు డాక్టర్‌ను సంప్రదించవచ్చు. పిత్తాశయంలో రాళ్లకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించని పేషెంట్లలో కేవలం మూడింట ఒక వంతు మందికి మాత్రమే తర్వాతికాలంలో సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉంటుంది. – డాక్టర్ జి. పార్థసారథి, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
బయటి పదార్థాలు తింటే కామెర్లు తప్పదా?
గ్యాస్ట్రో కౌన్సెలింగ్ ఇటీవల కురుస్తున్న వర్షాలను చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా ప్రయాణాలు చేసే వృత్తిలో ఉన్నాను. కలుషితమైన బయటి ఆహారాలు తింటే కామెర్లు వస్తాయని అందరూ అంటున్నారు. ఇది వాస్తవమేనా? నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సుదర్శన్, వరంగల్ కామెర్లు అని చెప్పేది ఒక వ్యాధి కాదు. ఇది కలుషితమైన నీటి వల్ల వచ్చే హెపటైటిస్లలో రకాలైన హెపఐటిస్-ఏ, హెపటైటిస్-ఈ వైరస్లు వచ్చినప్పుడు కనిపించే ఒక లక్షణం మాత్రమే. సాధారణంగా కలుషితమైన నీళ్లలోని ఈ వైరస్ల వల్ల కాలేయం దెబ్బతిని కామెర్లు కనిపిస్తుంటాయి. కామెర్లలో రక్తంలోని బిలురుబిన్ పాళ్లు పెరుగుతాయి. రక్తంలో బిలురుబిన్ పెరిగినప్పుడు దాని రంగు కనుగుడ్లు, చర్మంలోని మ్యూకస్ పొరల్లో పేరుకుపోతుంది. దాంతో అవి పచ్చగా కనిపిస్తాయి. మామూలు పరిస్థితుల్లో వ్యర్థాలను కాలేయం సేకరించి పైత్యరసంతో పాటు కాలేయ వాహిక ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి అది మలంలోకి వెళ్లి బయటకు వెళ్తుంది. మలం పసుపు రంగులో కనిపించడానికి కారణం ఆ వ్యర్థాలే. అయితే కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల బైలురుబిన్, బైలివర్దిన్ అనే పదార్థాలు ఒంట్లోనేరుకుపోతాయన్నమాట. ఇదే పచ్చదనం కళ్లలోనూ కనిపిస్తుందన్నమాట. కామెర్లు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు... కళ్లు పచ్చబడతాయి మూత్రం పసుపు రంగులోకి మారుతుంది మలం బూడిదరంగులో వస్తుంది జ్వరం, ఒళ్లునొప్పులు, ఆకలి తగ్గడం, దురదలు, వాంతులు కనిపిస్తాయి కాలేయానికి జరుగుతున్న నష్టం కనిపించకపోతే కామెర్లు తీవ్రతరమవుతాయి. అప్పుడు పాదాల వాపు, నిద్రపట్టకపోవడం, రక్తపు వాంతులు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సాధారణంగా బయటి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. మీ వృత్తి కారణంగా మీరు ఇంట్లో వండిన పదార్థాలను తినలేరు కాబట్టి ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినేయండి. మీ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగండి. మద్యం అలవాటుకు, పొగతాగే అలవాట్లకు దూరంగా ఉండండి పరిశుభ్రమైన పరిసరాల్లోనే ఉండండి. చెట్ల మందులు, పసర్ల వంటి నాటు మందులు వాడకండి. - డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్