breaking news
French hospital
-
తొలి ముఖమార్పిడి మహిళ మృతి
లిల్ (ఫ్రాన్స్): ప్రపంచంలో మొట్టమొదటిగా శస్త్రచికిత్సతో ముఖ మార్పిడి జరిగిన ఫ్రెంచ్ మహిళ ఇసబెల్ డినోయిర్ సుదీర్ఘ అనారోగ్యం తరువాత ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించినట్లు ఫ్రెంచ్ ఆస్పత్రి మంగళవారం వెల్లడించింది. డినోయిర్ తన ఇంట్లోని కుక్క దాడిలో గాయపడగా ఆమె ముఖం తీవ్రంగా దెబ్బతిన్నది. మెదడు మరణం చెందిన (బ్రెయిన్ డెడ్) దాత ముఖం నుండి కొన్ని భాగాలను తీసుకుని డినోయిర్ ముఖంలో ముక్కు, పెదవులు, గడ్డం తదితరాలను అమర్చారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని ఎమీన్స్ ఆస్పత్రిలో 2005 నవంబర్ 27వ తేదీన నిర్వహించిన ఈ ముఖమార్పిడి శస్త్రచికిత్స ప్రంపంచంలో మొదటిది. అయితే.. ముఖమార్పిడిలో అమర్చిన భాగాలను డినోయిర్ శరీరం తిరస్కరించిందని.. దీనిని నివారించేందుకు ఆమె అప్పటినుండీ వాడిన మందుల వల్ల ఆమెకు రెండు కేన్సర్లు వచ్చాయని లె ఫిగారో పత్రిక తెలిపింది. -
‘షుమాకర్ స్పృహలోనే ఉన్నాడు’
జెనీవా: కోమాలో నుంచి బయటపడిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌ను ఫ్రెంచ్ ఆసుపత్రి నుంచి తరలిస్తున్న సమయంలో స్పృహలోనే ఉన్నాడని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ అంబులెన్స్‌లో స్విట్జర్లాండ్‌లోని లుసానే ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు కళ్లు తెరిచే ఉన్న షుమీ మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయలేదని తెలిపాయి. అయితే కళ్లతోనే సైగలు చేస్తూ తలను అటూ ఇటూ తిప్పినట్లు సమాచారం. షుమాకర్ తరలింపు వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా చేపట్టారు. షుమీ గురించి కనీసం అంబులెన్స్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదు. సహాయక సిబ్బందికి సంబంధించిన మొబైల్స్‌ను తీసేసుకున్నారు.