ఈ రోజులు మాకొద్దు.. ‘చిరు’ బతుకుల్లో చీకట్లు
                  
	కరెంటొస్తే.. మోటారు రిపేరు చేసుకోవాలని మెకానిక్లు..
	 కరెంటొస్తే.. నాలుగు జిరాక్స్లు తీసి
	 ఈపూట కడుపునింపుకోవాలని చిరువ్యాపారులు..
	 కరెంటొస్తే.. గజం బట్ట నేసి ఈపూట కూలి
	 సంపాదించుకోవాలని ఓ నేతన్న..
	 కానీ.. రాదే, కళ్లుకాయలు కాసేలా
	 ఎదురుచూస్తున్నా.. కనికరించదే
	 గంటల తరబడి వేచిచూసినా గంటైనా ఉండదే..
	 కరెంటొస్తే పనుంటది.. పనిచేస్తే కూలొస్తది..
	 కూలొస్తే బుక్కెడు బువ్వొస్తది..
	 కానీ.. కరెంటూ రాదు.. కడుపూ నిండదు..
	 అయినా తప్పని ఎదురుచూపు, ఏ క్షణాన్నయినా రాకపోతుందా..
	 ఒక జిరాక్స్ తీయకపోతామా, గజం బట్ట నేయలేకపోతామా, ఒక్క మోటారన్నా మరమ్మతు చేయలేకపోతామా అన్న ఆశ.
	 మూసుకుపోతున్న కనురెప్పలకు సర్దిచెప్పుకుని,
	 కాలుతున్న కడుపును అదిమిపట్టుకుని ఎదురు చూసి.. చూసి..
	 ఇక భరించడం మా వల్ల కాదు.. కరెంటు రాని..
	 కడుపు నిండని ఈ రోజులు మాకు వద్దంటే వద్దు..
	 అని తెగేసి చెబుతున్నారు ఈ బడుగుజీవులు.
	-ఎలక్షన్ సెల్