breaking news
Four bills
-
4 సవరణ బిల్లులకు సభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్ పదవులను మినహాయిస్తూ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం నుంచి హెచ్ఎండీఏ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్, డైరెక్టర్లు, రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రాంతీయ బోర్డుల డైరెక్టర్లు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి, ఎంబీసీ, మూసీ రివర్ ఫ్రంట్, కార్మిక సంక్షేమ బోర్డు, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్లు, యాదగిరిగుట్ట, వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థలు తదితరాల చైర్మన్లను మినహాయిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆదివారం సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, 1953 (యాక్ట్ 2 ఆఫ్ 1954) సెక్షన్ 10లో పొందుపరిచిన మేరకు.. వివిధ సంస్థల చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే వారు లాభదాయక పదవులు కలిగి ఉన్నందుకు అనర్హత వేసే నిబంధన వర్తించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గతంలో 23 చైర్మన్ పదవులుండగా, తాజాగా ఆ జాబితాలో మరో 29 చైర్మన్ పదవులను అదనంగా కలుపుతూ సవరణ చట్టం చేశారు. ఇంకా జాబితాలోకి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, తెలంగాణ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అ«థారిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, స్పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ షీప్, గోట్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, తెలంగాణ అధికార భాషా సంఘం, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, స్టేట్ హజ్ కమిటీ, తెలంగాణ ఫుడ్ కమిషన్, సెట్విన్, తెలంగాణ సాహిత్య అకాడమీ, టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్స్, తెలంగాణ స్టేట్ యోగాధ్యయన పరిషత్ చైర్మన్ పదవులున్నాయి. ఈ మేరకు ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. మరో మూడు సవరణ బిల్లులకు ఆమోదం... వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ, అభయహస్తం పథకం, మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కో కాంట్రిబ్యూటరీ పింఛను చట్టం రద్దు, తెలంగాణ లోకాయుక్త–2020 సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కేంద్రం ఆదేశించిన మేరకు సీజీఎస్టీ చట్టానికి అవసరమైన సవరణలు చేసుకోవడంలో భాగంగా ఈ చట్ట సవరణ చేపడుతున్నట్టు సీఎం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో తెలిపారు. ఇందులో భాగంగా టీడీఎస్ సమయం పొడిగింపు అధికారం కమిషనర్‌కు ఇవ్వడం, రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపడం, తదితరాలను చేర్చారు. లోకాయుక్త చట్టంలో ఏపీ ఉన్న చోట తెలంగాణగా మార్పు చేస్తూ 2019లో తెలంగాణ చట్టం తీసుకురాగా, గతంలో లోకాయుక్త పదవికి మాజీ చీఫ్ జస్టిస్‌ను నియమించాలని ఉంటే ఆ స్థానంలో రిటైర్డ్ జడ్జిని నియమించుకునేలా చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణను హరీశ్‌రావు ప్రతిపాదించగా సభ ఆమోదించింది. అభయహస్తం కింద 60 ఏళ్లకు పైబడిన వారికి నెలకు రూ.500 చొప్పున పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం ఆసరా వృద్ధాప్య పించన్లను 57 ఏళ్ల వారికి కూడా రూ.2,016కు పెంచి ఇస్తున్నందున గతంలోని అభయహస్తం పథకం రద్దుకు ఈ చట్టసవరణ ప్రతిపాదించిన పీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అదేవిధంగా ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కో కాంట్రిబ్యూటరీ పింఛన్ చట్టం రద్దుకు చట్ట సవరణ ద్వారా ప్రతిపాదించినట్టు తెలియజేశారు. ఈ చట్ట సవరణలకు శాసనసభ ఆమోదం తెలిపింది. -
జీఎస్టీ సహా నాలుగు బిల్లులు
అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ సహా మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు, ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆక్వా అనుమతులు, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు కూడా సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ⇔ భూ విక్రయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు ఇప్పుడున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ. రిజిష్ట్రేషన్ల చట్టం-1908లో మార్పులు తీసుకొచ్చే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం. దీనిప్రకారం ఒకే భూమిని ఇద్దరికి రిజిష్ట్రేషన్ చేయడానికి ఇకపై వీలు పడకుండా చర్యలు తీసుకుని సివిల్ తగాదాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం. ⇔ ఏపీ వ్యాట్ చట్టం 2005ని సవరించి పర్యాటక ప్రాంతాల్లోని త్రీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో వ్యాట్ పన్ను 14.5 % నుంచి ఐదు శాతానికి తగ్గించేందుకు అనుమతి. మొబైల్ ఫోన్లపైనా పన్ను 5 శాతానికి తగ్గింపు. ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం. ⇔ బీసీ కమిషన్ సిఫారసుల మేరకు వెనుకబడిన తరగతుల జాబితాలోని సీరియల్ నెంబర్ 37 గ్రూపులో ఉన్న వడ్డె, వడ్డీలు, వడ్డి, వడ్డెలు అనే పదాలకు పర్యాయపదాలుగా వడ్డెర, వడ్డబోవి, వడ్డియరాజ్, వడ్డెర పదాలను చేర్చడానికి ఆమోదం. -
ఈ సమావేశాల్లోనే మరో నాలుగు బిల్లులు!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వీలైనన్ని ఎక్కువ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. జూలై 19న భారత వైద్యమండలి (సవరణ) బిల్లు-2016, దంతవైద్యుల (సవరణ) బిల్లు-2016లను లోక్‌సభ ఆమోదించింది. ఈ ఉత్సాహంతో, ఇప్పటికే నిర్ణయించిన 16 బిల్లులతోపాటు మరో నాలుగు కొత్త బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. అయితే ఏ నాలుగు బిల్లులను ఈ సమావేశాల్లో కొత్తగా తీసుకొస్తారో ఆయన స్పష్టం చేయలేదు. దేశ శ్రేయస్సు దృష్ట్యా వస్తు, సేవల పన్ను బిల్లుకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు అనంత్ వివరించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లుకు సానుకూలంగా ఉన్నాయనీ, ఏకాభిప్రాయాన్ని సాధించగలమనే విశ్వాసంతో ఉన్నామని అనంత్ తెలిపారు.