breaking news
former cs rammohan rao
-
వందల కోట్లు ఏం చేద్దాం?
-
చిత్తూరులో ముగిసిన సోదాలు
► కీలక పత్రాలు స్వాధీనం ► ముందస్తు సమాచారంతో 50 కేజీల బంగారం తరలింపు ► శేఖర్‌రెడ్డితో వ్యాపార సంబంధాలపై ఆరా చిత్తూరు, సాక్షి: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి సన్నిహితుడు, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభ మరిది డీకే బద్రీనారాయణ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన తనిఖీలు గురువారం తెల్లవారుజాము 2.10 గంటల వరకు కొనసాగాయి. పది మంది అధికారులు 19 గంటల పాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తనిఖీల మధ్యలో ఐటీ అధికారులు వేయింగ్ మెషీన్‌ను తెప్పించుకోవడంతో పెద్ద ఎత్తున బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగినా ఐటీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బంగారు కొనుగోలుపై అధికారులు బద్రీనారాయణను ప్రశ్నించారు. శేఖర్‌రెడ్డితో ఉన్న వ్యాపార లావాదేవీల గురించి ఆరా తీశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలంలోని 70 ఎకరాల మామిడి తోపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సూచన మేరకు టీడీపీ నాయకుడు బద్రీనారాయణ 50 కేజీల బంగారం, వందల కిలోల వెండి సోదాలకు ముందే తరలించారని సమాచారం. రామ్మోహన్‌రావుపై చీటింగ్ కేసు.. మాజీ సీఎస్ రామ్మోహన్ రావుపై చిత్తూరులో కొద్ది రోజుల క్రితం చీటింగ్ కేసు నమోదైంది. తమిళనాడు లో కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని మభ్య పెట్టి భారత్ కన్స్ట్రక్షన్స్ ఎండీ సాయిగణేశ్ నుంచి కోటి రూపాయలు లంచం తీసుకున్నారు. ఎంతకూ కాంట్రాక్ట్ పనులు ఇవ్వక పోగా, అడిగినందుకు సాయి గణేశ్‌ను వేధింపులకు గురిచేశారని తెలుస్తోంది. ఇందుకు చిత్తూరు లోని ఓ క్రైమ్ డీఎస్పీ, సీఐ, ఓ ఎస్సై పూర్తి సహకారం అందించారని సమాచారం. ప్రస్తుతం ఏపీ హైకోర్టు పరిధిలో ఉంది. -
వందల కోట్లు ఏం చేద్దాం?
► అంత డబ్బు ఎలా కాపాడుకోవాలంటూ శేఖర్‌రెడ్డితో ఫోన్లో రామ్మోహన్రావు మంతనాలు ► అప్పటికే శేఖర్‌రెడ్డి సెల్‌ఫోన్‌పై నిఘా ► పక్కా ఆధారాలతో 13 చోట్ల ఐటీ దాడులు ► తమిళనాడు సీఎస్ రామ్మోహన్రావు సస్పెన్షన్.. ► అతని కుమారుడు వివేక్, స్నేహితుని ఇంటిపైనా దాడులు ► ఆరుగురు మంత్రులపై ఐటీ కన్ను.. ఆంధ్రప్రదేశ్ సంబంధాలపై ఆరా ► శేఖర్‌రెడ్డితో పరిచయం ఉన్న వారిపై త్వరలో దాడులకు రంగం సిద్ధం చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు బుధ, గురు వారాల్లో నిర్వహించిన దాడులు దేశవ్యాప్తంగా కలకలం రేపగా, శేఖర్‌రెడ్డితో గంటల కొద్దీ జరిపిన సంభాషణే ఆయన్ను పట్టించినట్లు స్పష్టమైంది. దీంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. చెన్నై అన్నానగర్‌లోని రామ్మోహన్రావు నివాసం, తిరువాన్మియూర్లోని ఆయన కుమారుని ఇల్లు సహా మొత్తం 13 చోట్ల ఐటీ అధికారులు బుధవారం తెల్లవారుజాము 5.30 గంటలకు ప్రారంభించిన దాడులు గురువారం ఉదయం వరకు కొనసాగాయి. రామ్మోహన్రావు పీఏలైన శేఖర్, కుమార్‌లను కూడా ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును శేఖర్‌రెడ్డి కేసుతో కలపాలా.. లేక వేరుగా విచారించాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ దాడుల్లో రామ్మోహన్రావు ఇంటి నుంచి రూ.30 లక్షల కొత్త కరెన్సీ, రూ.5 కోట్ల విలువైన బంగారం, రూ.100 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు వివేక్ ఇంటి నుంచి 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వలసరవాక్కంలో నివసించే వివేక్ స్నేహితుడు, న్యాయవాది అమలనాథన్ ఇంటిపై కూడా గురువారం ఐటీ దాడులు జరిగాయి. ఆరుగురితో కూడిన అధికారుల బృందం సోదాలు చేపట్టింది. వివేక్ స్నేహితుడి ఇంట్లో ఏమి స్వాధీనం చేసుకున్నారో వివరాలు వెల్లడి కాలేదు. డబ్బులెలా కాపాడుకోవాలంటూ దొరికిపోయారు.. అక్రమార్జనను కాపాడుకోవడం కోసం జరిపిన సెల్‌ఫోన్ సంభాషణే రామ్మోహన్‌రావును పట్టించింది. శేఖర్‌రెడ్డి ఆస్తులపై దాడుల అనంతరం బినామీ పెద్దలెవరో తెలపాలని విచారణలో ఐటీ అధికారులు అడగ్గా, విధిలేని పరిస్థితుల్లో రామ్మోహన్రావు పేరు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఇంటిపై కేవలం ఒకరి వాంగ్మూలంతో దాడులు చేసేందుకు వీలుకాదని తొలుత సంశయించారు. మరేదైనా బలమైన ఆధారం కోసం అన్వేషించగా ఇసుక క్వారీల అనుమతిపై భారీ ఎత్తున రాయితీలకు రామ్మోహన్రావు సిఫార్సు చేసినట్లు పర్యావరణ అధికారులు స్పష్టం చేశారు. ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. మరో కోణంలో కూడా ఆధారాల కోసం ఆరా తీశారు. ఇందులో భాగంగా ఇసుక తదితర వ్యాపార లావాదేవీలతో సమకూరిన సొమ్ముపై శేఖర్‌రెడ్డితో గంటల కొద్దీ సాగించిన సంభాషణే రామమోహన్‌రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. జయలలిత మరణించిన మరుసటి రోజున వారిద్దరూ ఫోన్ ద్వారా ‘మన వద్ద ఉన్న కొన్ని వందల కోట్ల రూపాయలను ఎలా కాపాడుకోవాలి’ అంటూ మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి మరణించి రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి.. అంత్యక్రియల ఏర్పాట్లను చూడకుండా, డబ్బును దాచుకోవడం ఎలా అనే కంగారును ప్రదర్శించడం తమను విస్మయానికి గురి చేసిందని ఐటీ శాఖలోని ఒక ఉన్నతాధికారి చెప్పారు. శేఖర్‌రెడ్డి ఫోన్‌పై నిఘా పెట్టి, ఇద్దరి మధ్య సాగిన సంభాషణలను నిర్ధారించుకున్న తర్వాతే దాడులు జరిపామని ఆయన తెలిపారు. ఇసుక క్వారీల ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్ల లావాదేవీలు సాగుతుండగా, తద్వారా వచ్చిన రూ.17 కోట్ల ఆదాయాన్ని శేఖర్‌రెడ్డి నుంచి రామ్మోహన్రావు పొందినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే రామ్మోహన్రావు పేరున స్థిరాస్తులు పెద్దగా లేనట్లు తేలింది. సుమారు రెండు వారాల క్రితమే ఐటీ అధికారులు దాడులకు సిద్ధమైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంలో జాప్యమైంది. ఈ జాప్యం వల్ల రామ్మోహన్‌రావుకు విషయం లీకయింది. దీంతో ఆయన జాగ్రత్త పడ్డట్లు సమాచారం. రెండు వారాల క్రితమే దాడులు జరిపి ఉంటే రామ్మోహన్రావు, బంధువుల ఇళ్ల నుంచి భారీగా ఆస్తులు, నగదు పట్టుబడి ఉండేవని అంటున్నారు. సస్పెన్షన్ వేటు ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. అతన్ని వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించడం ఖాయమని బుధవారం నుంచే ప్రచారం జరుగుతున్న తరుణంలో గురువారం తెల్లారేసరికి ఆయనను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం పన్నీర్ సెల్వం గురువారం మంత్రులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను పోస్టుద్వారా రామ్మోహన్రావు ఇంటికి పంపారు. కాగా, ఐఏఎస్ అధికారుల్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా తీవ్రంగా స్పందించే ఐఏఎస్ సంఘం రామ్మోహన్రావు విషయంలో మౌనం పాటిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకుండా రామ్మోహన్రావు ఒక వీవీఐపీగా కొందరు మంత్రులతో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల నిర్మాణ పనులు ఆయన కనుసన్నల్లోనే సాగాలనే ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇలా సర్వాధికారిగా మారడాన్ని సహించలేని కొందరు అధికారులే ఐటీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీఎస్ చాంబర్లో ఐటీ దాడులను ఐఏఎస్ అధికారులు అవమానకరంగా భావిస్తూనే మరోవైపు సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని దాడులు ఇదిలా ఉండగా త్వరలో రాష్ట్రంలో మరికొన్ని దాడులు జరుపనున్నట్లు ఐటీ అధికారి ఒకరు తెలిపారు. తమిళనాడుతో పాటూ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఎవరెవరితో వ్యాపార లావాదేవీలు జరిపారో విచారిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులతో శేఖర్‌రెడ్డి, రావులకు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నామని ఆయన అన్నారు. దాడుల్లో పట్టుబడిన సొమ్ములో ఈ ఆరుగురు మంత్రులకు వాటా ఉన్నట్లు తెలుసుకున్నామని చెప్పారు. కొందరు పారిశ్రామికవేత్తలు సైతం వీరి మనుషులుగా తేలిందన్నారు. శేఖర్‌రెడ్డితో పరిచయం ఉన్న అందరు వ్యక్తులపై తమకు సందేహాలు ఉన్నాయని, అవసరమైతే అందరి ఇళ్లపై దాడులు చేస్తామని చెప్పారు. శేఖర్‌రెడ్డి, రామ్మోహన్రావులకు కొత్త కరెన్సీని చేరవేసిన బ్యాంకు అధికారుల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.