breaking news
Floating Restaurant
-
నీటిలో తేలియాడే కృత్రిమ దీవి
సాక్షి, న్యూఢిల్లీ : ఒకరు పనికి రాదని పడేసిన చెత్త, మరొకరికి విలువైనదిగా పనికొస్తుందంటే ఇదే! సముద్రపు ఒడ్డున పర్యాటకులు తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఫ్రెంచ్ కంప్యూటర్ ఇంట్రిప్రీనర్ ఎరిక్ బెకర్ ఏరుకున్నారు. వందలు కాదు, వేలు కాదు, అలా ఏడు లక్షల బాటిళ్లను ఏరి వాటితోని నీటి మీద తేలియాడే కృత్రిమ దీవిని నిర్మించారు. ముందుగా దానిపై తాను ఉండేందుకు ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ దీవిని కూడా ఎందుకు వ్యాపారానికి ఉపయోగించుకోకూడదని అనుకున్నారో, ఏమో! ఆ దీవిపై ఒక హోటల్‌ను, ఓ బార్‌ను, రెండు కృత్రిమ స్విమ్మింగ్ పూల్స్‌ను, రాత్రి బసకు రెండు మూడు షెడ్లను నిర్మించి పర్యాటకులకు స్వాగతం పలికారు. అంతే ప్రకతి ప్రేమికులు, పర్యావరన పరిరక్షణ కార్యకర్తలు, ప్లాస్టిట్ వేస్ట్‌ను ఎలా ఉపయోగించారో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు కృత్రిమ దీవికి క్యూలు కట్టారు. ఈ దీవిపై ఒక రోజు గడపడానికి వంద డాలర్లు వసూలు చేస్తున్నారు. ఈ దీవిపై ఆకర్షణీయంగా చెట్లు, పొదలను కూడా పెంచారు. ఈ దీవి వెయ్యి చదరపు మీటర్లు ఉంటుంది. పర్యాటకులు దీనికి పడవపైనే రావాల్సి ఉంటుంది. ఊరికే పగలు చూసి పోవడానికైతే 25 డాలర్లు వసూలు చేస్తారు. రాత్రికి భోజనం, బస చేయాలంటే వంద డాలర్లు వసూలు చేస్తారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని అబిద్జాన్ పట్టణ శివారులో సముద్రం పక్కన నీటి మడుగులో ఈ కృత్రిమ తేలియాడే దీవిని నిర్మించారు. వారానికి వంద మంది పర్యాటకులు వస్తున్నారని, వారితో తనకు అంతో ఇంతో డబ్బు రావడమే కాకుండా, ప్లాస్టిక్ వేస్టేజ్‌ని కొంతైనా సద్వినియోగం చేశానన్న సంతప్తి ఉందని ఆయన ఏఎఫ్‌పీ మీడియాతో వ్యాఖ్యానించారు. -
‘కృష్ణా’నే రాసిచ్చారు..
► భవానీ ద్వీపం సమీపంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు లోకేష్ సన్నిహితుడు ప్రతిపాదన ► నదీ పరిరక్షణ చట్టంకు విరుద్ధంగా అనుమతి ఇవ్వలేమన్న జలవనరుల శాఖ ► వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని స్పష్టీకరణ ► బ్యారేజీ ధ్వంసమైతే భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన ► అవేవీ పట్టని సీఎం చంద్రబాబు, లోకేష్.. ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: అడిగినంత కమీషన్ ఇచ్చేవారుంటే.. ఊరూ, వాడ, భూములను అడ్డదిడ్డంగా కట్టబెట్టేస్తున్న సర్కారు ప్రభువులు.. తాజాగా విజయవాడ సమీపంలో ఏకంగా కృష్ణా నదినే రాసిచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితుడైన సూరపనేని సుభాకర్రావు అనే వ్యాపారికి భవానీద్వీపం సమీపంలోని కృష్ణా నదీ గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ (తేలియాడే ఆహారశాల) ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఛాంపియన్స్ యాచెట్ క్లబ్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) అయిన సూరపనేని సుభాకర్రావు విదేశాల్లో లండన్, దేశంలో గోవా, బెంగుళూరుల్లో వ్యాపారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేశాక ఇతని కళ్లు కృష్ణా నదిపై పడ్డాయి. లోకేశ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో మరపడవలు(బోట్లు) తిప్పుకోవడానికి అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు జల క్రీడలు, జల విహారం, రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. మంత్రి లోకేశ్ దన్నుతో ఇప్పటికే భవానీ ద్వీపంలో కొంత భాగాన్ని, ప్రకాశం బ్యారేజీకి ఎగువన పర్యాటక శాఖకు చెందిన సీతానగరం వద్ద జట్టి(బోట్లు నిలిపే ప్లాట్పామ్)ను కబ్జా చేసిన సుభాకర్రావు.. నదీ గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతివ్వాలని లోకేశ్ సూచనల మేరకు భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ సీఈవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు భవానీ ఐలాండ్ కార్పొరేషన్ సీఈవో జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. నదీ పరిరక్షణ చట్టం–1884, పర్యావరణ చట్టాలను ఎత్తిచూపుతూ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేది లేదని జలవనరుల శాఖ తొలుత తేల్చి చెప్పింది. దాంతో ఈ వ్యవహారాన్ని సుభాకర్రావు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జలవనరుల శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అనుమతి లేకుండానే నదీ గర్భం కబ్జా కృష్ణా నదికి 10 నుంచి 18 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని.. నదీ ప్రవాహానికి అంతరాయం కల్పించేలా నిర్మాణాలు చేపడితే.. వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని జలవనరుల శాఖ అధికారులు లోకేశ్‌కు తెగేసి చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ఒక్కో గేటు బరువు 44 టన్నులుంటుందని.. మరపడవ 70 టన్నులకు పైగా బరువు ఉంటుందని.. వరదలు వస్తే మరపడవల తాకిడికి గేట్లు నిలవలేవని చెప్పారు. వరద ఉద్ధృతికి ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిలబడలేదని.. అది ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడితే బ్యారేజీ ధ్వంసమవుతుందని తేల్చి చెప్పారు. దీని వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తుతుందని.. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లుతుందని వివరించారు. 2009 అక్టోబర్ ఆఖరులో కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓగేరు వద్ద కుడి కరకట్ట తెగి భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని కూడా గుర్తు చేశారు. నదుల్లో వెయ్యి టన్నుల కన్నా అధిక బరువుతో కూడిన పడవలు, నిర్మాణాలు చేపట్టలాంటే జాతీయ అంతర్గత జలరవాణా అనుమతి అవసరమని స్పష్టం చేశారు. కానీ.. ఇవేవీ మంత్రి లోకేశ్ పట్టించుకోకుండా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కూడా లోకేశ్ ప్రతిపాదనను బలపరుస్తూ తమపై ఒత్తిడి తెచ్చారని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ జీవో జారీ చేశారు. జలవనరుల శాఖ అనుమతి ఇచ్చే లోపే ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు వీలుగా నదీ గర్భాన్ని సుభాకర్రావు ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. జలవనరుల శాఖ అనుమతి ఇవ్వకుండానే ప్రకాశం బ్యారేజీ సమీప ప్రాంతంలో ఇప్పటికే మరపడవలను యథేచ్ఛగా తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి చెందిన మరపడవలోనే ఇటీవల సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో నదీ విహారం చేశారు. రెండేళ్లకు అనుమతి.. ఆ తర్వాత పొడిగింపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఒత్తిడి తట్టుకోలేక జలవనరుల శాఖ అధికారులు భవానీద్వీపం సమీపంలోని కృష్ణా నదీ గర్భంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికంగా రెండేళ్లపాటూ అనుమతి ఇవ్వాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌కు ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఓ సారి అనుమతిని రెన్యువల్ (పొడిగింపు) చేసుకునే వెసులుబాటు కల్పించారు. సుభాకర్రావు లండన్‌లో ఇదే రకమైన వ్యాపారం చేసి.. పన్నులు ఎగ్గొట్టడంతో అక్కడి ప్రభుత్వం ఆయన్ను డిఫాల్టర్‌గా ప్రకటించినట్లు పర్యాటక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు. గోవాలోనూ ఇదే రీతిలో సుభాకర్రావు వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలోనూ అదే తరహా వ్యాపారం అంటే.. నదీ గర్భంలో విందులూ వినోదాలకు తెరతీశారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదని జలవనరుల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నా, అధికార దన్నుతో వాటిని తుంగలో తొక్కడం ఖాయమని అధికారవర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
నాలుగు నెలల్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ సేవలు
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటి నీటిలో తేలియాడే హోటల్ (ఫ్లోటింగ్ రెస్టారెంట్) ఏర్పాటుచేసిన ఘనత ముంబైకే దక్కింది. దీన్ని బుధవారం బాంద్రాలో సముద్ర తీరం వద్ద పర్యాటక శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ హోటల్ పర్యాటకులకు ఆగస్టు 15 లేదా సెప్టెంబర్ నుంచి సేవలందించే అవకాశాలున్నాయని భుజబల్ చెప్పారు. సుమారు రూ.102 కోట్లతో నిర్మితమైన ఈ ఆధునిక రెస్టారెంట్ ప్రతీ రోజు ముంబైకి వచ్చే వేలాది దేశ, విదేశ పర్యాటకులకు మరింత ఆకర్షణగా నిలవనుంది. మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎంటీడీసీ) చొరవ తీసుకోవడంవల్ల డబ్ల్యూబీ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, ఎ.బి.హాస్పిటాలిటీ సహకారంతో ఇది కార్యరూపం దాల్చింది. బాంద్రా-వర్లీ సీ లింక్ మార్గంలో మేరి టైం బోర్డు ఏర్పాటుచేసిన జెట్టి (ప్లాట్ఫారం) వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఈ రెస్టారెంట్లోకి వెళ్లేందుకు వీలుంటుంది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రత్యేకతలు మూడంతస్తులున్న ఈ రెస్టారెంట్ అమెరికాలో తయారైంది. 360 డిగ్రీల వరకు బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెనతోపాటు ముంబై అందాలను తిలకించవచ్చు. లగ్జరీ డైనింగ్ ప్ల్లాట్‌తోపాటు స్కైడెక్ ఉంది. 24 గంటలూ ఇందులో టీ, కాఫీతోపాటు ఇతర తినుబండారాలు లభిస్తాయి. వేర్వేరు అంతస్తుల్లో ఉన్న రెస్టారెంట్లలో ఒకేసారి 660 మంది కూర్చుని భోజనం, అల్పాహారాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సముద్రంలో నిలిచి ఉన్నప్పటికీ ఎలాంటి పడవలు, స్టీమర్ల సాయం లేకుండా నేరుగా జెట్టి ద్వారా అందులోకి ప్రవేశించవచ్చు.