breaking news
Five childrens
-
ఆరిన కంటి దీపాలు
చందర్లపాడు/సాక్షి, అమరావతి: మునేరులో సోమవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (11), కర్ల బాలయేసు (12), జట్టి అజయ్ (12), గురజాల అజయ్ చరణ్ (14) సోమవారం ఉదయం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన విషయం విదితమే. వీరంతా గ్రామంలోని మునేరులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు, యానాదులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారుల జాడ కోసం సోమవారం రాత్రి నుంచే మునేరుతోపాటు కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నల్లవాగు వరద మునేరులో కలిసే ప్రదేశంలో ఏర్పడిన గోతిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ బిడ్డలు ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటారని గంపెడాశతో రాత్రి నుంచి ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వారి మృతదేహాలను చూసి భోరున విలపించారు. నందిగామ ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఏటి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించి పిల్లల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతులంతా కూలీ కుటుంబాల వారే మృత్యువాతపడిన పిల్లల తల్లిదండ్రులంతా కూలీలే. కాయకష్టం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. మైల దానయ్య, ఆంథోనీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాకేష్ (11) స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కర్ల గురవయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు బాలయేసు (12)తో పాటు కుమార్తె ఉంది. ఆ బాలుడు స్థానిక పాఠశాలలోనే 7వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి గురవయ్య గతంలో మరణించడంతో ఆ కుటుంబం మగ దిక్కును కోల్పోయింది. ఇక జట్టి సుందరరావు, అరుణలకు ఇద్దరు సంతానం కాగా చిన్నవాడైన అజయ్ (12) 7వ తరగతి చదువుతున్నాడు. అలాగే గురజాల మరియమ్మ భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. ఆమె కుమారుడు అజయ్ చరణ్(14)ను అమ్మమ్మ, తాతయ్య పెంచుకుంటున్నారు. అజయ్చరణ్ 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, మాగులూరి సుబ్బారావు మేరీ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా.. మూడవ కుమారుడైన సన్నీ (12) 7వ తరగతి చదువుతున్నాడు. ఈ చిన్నారులంతా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో వంట కట్టెలు తేవడానికి సైకిళ్లపై వెళ్లి మునేరులో దిగి మృత్యువాత పడ్డారు. ఏటూరులో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ గ్రామానికి ఓ వైపు మునేరు మరోవైపు కృష్ణా నది ఉన్నాయి. 2016 అగస్టు 16న నందిగామ చైతన్య కళాశాలలో చదువుతున్న తోటరావులపాడు, జయంతి, చెరువు కొమ్ముపాలెం, నందిగామకు చెందిన ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో పడి మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఐదుగురు చిన్నారులు మునేరులో దిగి దుర్మరణం పాలయ్యారు. రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్టు కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. బుధవారం ఈ సొమ్మును అందజేయనున్నారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మంత్రి ఆదిమూలపు సంతాపం కాగా, విద్యార్థుల మృతిపై విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సంక్రాతి సెలవులు, కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఇళ్ల వద్ద ఉంటున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. -
‘ఐదుగురు పిల్లల్ని కనండి’
లక్నో : ఉత్తర ప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోసారి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమతి అని ప్రతి హిందూ ఐదుగురు పిల్లల్ని కనాలని వ్యాఖ్యానించారు. హిందూ జనాభాను పెంచి దేశంలో హిందుత్వాని కాపాడాలని అన్నారు. ఇద్దరు పిల్లలు తండ్రికి, మరో ఇద్దరు పిల్లలు తల్లికి, మిగిలిన ఒక్కరు ఈ దేశం కోసమని పేర్కొన్నారు. దేశంలో అత్యాచారాలను నివారించడం శ్రీరాముడి వల్ల కూడా కాదని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలియాలో బుధవారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ పిల్లలు దేవుడిచ్చిన బహుమతి. ఒక్కో హిందూ జంట ఐదుగురు పిల్లల్ని కనాలి. భారత దేశం బలంగా ఉండాలంటే, హిందువులు బలంగా ఉండాలి. హిందువులు బలహీనంగా మారితే, దేశం కూడా బలహీనంగా మారుతుంది. హిందువులు జనాభాను నియంత్రిస్తే దేశంలో మైనార్టీగా మారే అవకాశం ఉంది. హిందూవులు మెజార్టీగా ఉండాలి. తీవ్రవాదులుగా కాదు’ అని అన్నారు. సురేంద్ర సింగ్ ఇతర పార్టీ నేతలనే కాక సొంత పార్టీ నేతలను కూడా పలు సందర్భల్లో విమర్శించిన విషయం తెలిసిందే. కైరానా, నూర్పూర్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోవడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇస్లాంకు, హిందుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని పలు వ్యాఖ్యలు చేశారు. -
కన్నీటి ధారల మధ్య ఖననం
కంగ్టి: తడ్కల్ తల్లడిల్లింది. వరద మృతులకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం పిల్లివాగులో తల్లితో సహా ఐదుగురు చిన్నారులు జల సమాధి అయిన విషయం విదితమే. శనివారం రాత్రి మృతులకు బాన్సువాడలోని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి ఆదివారం ఉదయం శవాలను స్వగ్రామమైన తడ్కల్‌కు తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన జంగం రాజు కుటుంబాన్ని విద్యుత్ శాఖ డిప్యూటీ ఈ ఈ శ్రీనివాస్‌రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఖన నం నిమిత్తం రూ. 5వేలు అందజేశారు. తహసీల్దార్ రాజయ్య, ఎస్ఐ నానునాయక్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. పిల్లల శవాలను చేతులపైనే మోసి.. ఐదుగురు పిల్లలు ఏడేళ్లలోపు వయస్సు వారే కావడంతో బంధువులు ఖననం నిర్వహించే స్థలానికి చేతులపైనే అంతిమయాత్ర నిర్వహించారు. వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఒకే గోతిలో ఆరుగురి ఖననం పిల్లలు ప్రియా(7), జ్యోతి(6), జ్ఞాన హంసిక(3), జ్ఞాన సమిత(3)(కవలలు), దీంపాంక్ష(13 నెలలు)తో పాటు తల్లి జంగం రాజమణిని ఒకే గోతిలో ఉంచి ఖననం చేశారు. కాగా, రాజమణితో పాటు ఐదుగురు చిన్నారుల మృ తదేహాలను ఆదివారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చూసి చలించిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఆయన వచ్చి చూశారు. ఇంత కష్టం ఎవరికీ రావద్దని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.