రాజమండ్రిలో ఫైన్ ఆర్ట్స్ కళాశాల
కొంతమూరు(రాజమండ్రిరూరల్): రాజమండ్రిలో ఫైన్ఆర్ట్స్ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తానని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కొంతమూరులోని మోసానిక్‌లాడ్జిలో ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మోసానిక్‌లాడ్జి గోదావరి-89 సంయుక్తంగా శనివారం ప్రారంభించిన మూడు రోజుల చిత్రకళా శిబిరాన్ని రాజప్ప సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారుల ప్రతిభను చాటేందుకు ఇలాంటి శిబిరాలు దోహదపడతాయని చెప్పారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్లబుచ్చియ్యచౌదరి మాట్లాడుతూ దామెర్ల రామారావు ఆర్టు గ్యాలరీని అభివృద్ధి చేయడంతోపాటు, తెలుగు విశ్వవిద్యాలయంలో ఫైన్‌ఆర్ట్సు కోర్సు ప్రవేశపెడతామన్నారు. కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, ఆర్ట్స్ అసోసియేషన్ గిల్డ్ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ పి.ఆర్.రాజు, డాక్టర్ బి.ఎ.రెడ్డి, మోసానిక్‌లాడ్జి చైర్మన్ మద్దూరి శివానందకుమార్ శిల్పి రాజ్‌కుమార్ వడయార్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న చిత్రాలు
శిబిరంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు చిత్రాలను గీశారు. శిల్పులు విగ్రహాలను తయారుచేశారు. ఇటీవల భారతరత్నకు ఎంపికైన హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు మదన్మోహన్ మాలవీయ విగ్రహాన్ని వడయార్ తనయుడు తయారు చేశారు. ఇది ఆకట్టుకుంది. ఈ శిబిరంలో రూపుదిద్దిన విగ్రహాలు, చిత్రాలను ఈనెల 29 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాజమండ్రిలోని దామెర్లరామారావు ఆర్ట్‌గ్యాలరీలో ప్రదర్శించనున్నట్టు డాక్టర్ బీఏ రెడ్డి తెలిపారు.