breaking news
Federations
-
పారదర్శకత పాటిస్తే...
న్యూఢిల్లీ: దేశంలో క్రీడా రంగ ప్రగతికి నిధులు ఇచ్చేందుకు కార్పొరేట్ రంగం సిద్ధంగానే ఉందని, వాటిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లు హామీ ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ‘నిధుల కోత గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఇది మా పరిధిలోనిదే. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇచ్చేందుకు సిద్ధం. కానీ... సమాఖ్యలు సొంతంగా నిలదొక్కుకోవాలన్నదే మా ఆలోచన. లీగ్ల ద్వారా రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్ సమాఖ్యలు డబ్బు సమీకరిస్తున్నాయి. అయినా వీటికి కేంద్రం సాయం చేస్తోంది కదా?’ అని చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత ‘జాతీయ క్రీడాభివృద్ధి నియమావళి’ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చేదిగా ఉంటుందని మంత్రి వివరించారు. సెప్టెంబర్లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్ను అనుమతించడాన్ని కాలమే నిర్ణయిస్తుందని రాజ్యవర్ధన్ అన్నారు. కామన్వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్ని పతకాలు గెలవగలరన్న సంఖ్యను చెప్పేందుకు ఇష్టపడని మంత్రి... సన్నాహాలకు చక్కటి వసతులు సమకూర్చుతున్నామని, దేశ ప్రతినిధులుగా వారు క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించాలని ఆకాంక్షించారు. -
ఫెడరేషన్ల ద్వారా నేరుగా రుణ సబ్సిడీ
కాకినాడ సిటీ : ఫెడరేషన్ల ద్వారా నేరుగా లబ్ధిదారులకు రుణ సబ్సిడీ అందించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని కుమ్మరి, శాలివాహన సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ కె.నాగేంద్ర అన్నారు. మంగళవారం కలెక్టరేట్ డ్వామా సమావేశపు హాలులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుమ్మరి, శాలివాహనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ వెనుకబడిన తరగతులలో కులవృత్తులు చేసుకునే అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకుంటోందన్నారు. ఆ మేరకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఫెడరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటివరకు 11 మంది సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. గ్రామాలలో కుమ్మరి, శాలివాహన కుటుంబాలు తక్కువగా ఉండడంతో సంఘాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఐదుగురు సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించామని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి మాట్లాడుతూ 2015–16 లో 46 గ్రూపులకు సబ్సిడీ రుణం రూ.మూడుకోట్ల నాలుగు లక్షలు ఆర్థిక సహాయం అందించామన్నారు. 2016–17 సంవత్సరానికి రూ.5 కోట్ల 10 లక్షలు రుణ లక్ష్యమన్నారు. 11 సంఘాలకు రుణ మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి హరిప్రసాద్ సంఘాల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై వివరించారు. కుమ్మరి, శాలివాహన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.