breaking news
Fan speed
-
‘పరిషత్’లో ఫ్యాను స్పీడు
రెండో విడతలోనూ మెజారిటీ జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు అవకాశాలు గెలుపుకోసం ప్రలోభాలను రెట్టింపు చేసిన టీడీపీ సాక్షి, తిరుపతి: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆరో తేదీన మదనపల్లె డివిజన్ పరిధిలో తొలివిడతలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ జోరు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండోవిడత ఎన్నికల్లోనూ ఆ పార్టీ అదే జోరు ప్రదర్శించనున్నట్టు రాజకీయ పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం, కార్వేటినగరంలో టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నా, వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క చంద్రగిరిలో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో వడమాలపేట మండలంలో మాత్రం పోటాపోటీగా ఉంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సులువుగా గెలుస్తుందనే అభిప్రాయం ఉంది. హస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఒకటిరెండు మండలాలు మినహాయిస్తే మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలపవనాలు వీస్తున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలోనూ టీడీపీ సంప్రదాయ ఓటర్లు ఉన్న మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓ మోస్తరు పోటీ ఉంది. మెజారిటీ జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. తొలివిడత జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇందులో రెండు చోట్ల గెలిచే అవకాశం ఉంది. పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు గెలుచుకోనున్నారు. రెట్టింపు మొత్తంలో ‘దేశం’ ప్రలోభాలు తొలివిడత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండో విడతలోనూ కొనసాగించింది. తొలివిడత ఎన్నికల ఓటింగ్ సరళి ప్రతికూలంగా ఉన్నట్టు అంచనాకు రావడంతో రెండో విడతలో రెట్టింపు మొత్తంలో డబ్బు పంపిణీ చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ఎత్తులు వేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో గురువారం ఒక్కరోజు రెండు చోట్ల మద్యం పంపిణీ చేస్తుండగా పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అదేవిధంగా పుత్తూరు రూరల్ మండలంలోనూ ఐదుగురు టీడీపీ కార్యకర్తలు మద్యం పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. పూతలపట్టు నియోజకవర్గంలో యువకులకు ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో భారీ విందులు ఏర్పాటు చేశారు. పూతలపట్టు, ఐరాల మండలాల్లో ఓటర్లకు ఒక్కొక్కరికి *500 నుంచి *2000 వరకు డబ్బు పంపిణీ చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని కామచిన్నయ్యపల్లె, రామకృష్ణాపురం ఎంపీటీసీ సెగ్మెంట్లలో మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేశారు. చంద్రగిరి -2 ఎంపీటీసీ సెగ్మెంట్లో వెండి దీపపు స్తంభాలు ఇంటింటికి చేరవేశారు. -
పురపోరులో ‘ఫ్యాన్’ స్పీడు
షర్మిల యాత్రతో పట్టణాల్లో పట్టు విజయవాడకే పరిమితమైన బాబు గర్జన జిల్లాలో ప్రచారంలో తెలుగుదేశం వెనుకబాటు టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : పురపాలకులను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు ఎనిమిది మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. జయాపజయాలపై అప్పుడే సర్వేలు, బెట్టింగులు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణల మాట ఎలా ఉన్నా నేతల పర్యటనలు సైతం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మూడురోజులపాటు మెరుపు వేగంతో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం విజయవాడలో మహిళాగర్జనకు పరిమితమయ్యారు. ఇంకా కాంగ్రెస్, మిగిలిన పార్టీలు కనీసం పురప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘ఫ్యాన్’ గాలి... తన ప్రచార యాత్రతో కేడర్లో మరింత ఉత్సాహం కలిగించిన షర్మిల పలు మున్సిపాలిటీల్లో ఓటర్లను ఆకట్టుకుని ఫ్యాన్ గాలి స్పీడు పెంచారు. జిల్లాలోని ఉయ్యూరు, పెడన, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో షర్మిల ప్రచారానికి విశేష స్పందన లభించింది. చంద్రబాబు మహిళా గర్జన సాకుతో షర్మిల యాత్రకు బందోబస్తు ఇవ్వలేమని విజయవాడ పోలీసులు చేతులెత్తేశారు. దీంతో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున షర్మిల ప్రచారానికి అవాంతరం వచ్చింది. అయినా మున్సిపల్ ప్రచారంతోనే షర్మిల ఆగిపోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసేలా పామర్రు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాలతో పాటు విజయవాడ రూరల్ ప్రాంతంలోను నిర్వహించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో జిల్లాలో జరగనున్న వరుస ఎన్నికలపై ఆమె ప్రచార ప్రభావం వైఎస్సార్సీపీకి మరింత బలం పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో షర్మిల యాత్ర కారణంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. చంద్రబాబు చిర్రుబుర్రులు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వెనుకబడ్డ చంద్రబాబు మహిళా గర్జన కోసం జిల్లాకు వచ్చి పార్టీ నేతలపై చిర్రుబుర్రులాడారు. మహిళా గర్జనకు జన సమీకరణ బాగాలేదని జిల్లా నేతలను తిట్టిపోసిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే షర్మిల యాత్రతో కలవరపడుతున్న తెలుగు తమ్ముళ్లను బాబు పట్టించుకోకపోవడంతో వారు కినుక వహించారు. సొంత పార్టీలో ఏళ్ల తరబడి సేవలందించినవారిని వదిలి కొత్తవారి కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు తీరుతో ఆ పార్టీలోనే సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడో జరిగే సార్వత్రిక ఎన్నికలపై హడావుడి చేయడంతో చాలా పట్టణాల్లో సైకిల్ పరుగుపెట్టలేకపోతోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీల్లోను కుమ్మక్కు కుట్ర.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ టీడీపీతో కుమ్మక్కు కుట్రలు సాగిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మరోమారు నిస్సిగ్గుగా కలిసిమెలిసి ప్రచారం చేశారు. గతంలో సహకార ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు సాగించిన సంగతి తెల్సిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికలు వచ్చేనాటికి జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యే దుస్థితి దాపురించింది. దీంతో ఆ పార్టీ నేతలు మరోమారు టీడీపీతో కుమ్మక్కై పురపోరులో పాల్గొంటున్నారు. తమకు కొన్ని మున్సిపల్ వార్డులు ఇచ్చినా చాలు అని బేరసారాలు జరిపిన కాంగ్రెస్ చాలాచోట్ల బాహాటంగానే టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం నిర్వహించడం కొసమెరుపు. ఏది ఏమైనా కుమ్మక్కు కుట్రలను నిశితంగా గమనిస్తున్న ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించే సమయం వచ్చింది.