breaking news
factionists
-
ఫ్యాక్షన్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
చాపాడు : గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా పోలీసు శాఖ ఓఎస్డీ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఆదివారం ఫ్యాక్ష నిర్మూలనపై ప్రొద్దుటూరు పోలీసుశాఖ సబ్ డివిజన్ పోలీసులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో కొన్నేళ్లుగా ఉన్న ఆధిపత్య, వర్గపోరులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్షన్ రూపుమాపేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, దాని వలన ఎదురయ్యే సమస్యలు, కష్ట, నష్టాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఫ్యాక్షన్ గొడవల వలన పిల్లల చదువుతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయన్నారు. ప్రజలు ఎలాంటి గొడవలకు దిగకుండా ప్రశాంత జీవనం గడిపేలా ఉండాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ఎలాంటి గొడవలు, కక్షలు, కార్పణ్యాలు ఉన్నా వాటి అణచి వేసేందుకు పోలీసులు ఉన్నారనే భరోసాను ప్రజల్లో నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని వన్ టౌన్ సీఐ, రూరల్ ఇన్చార్జి సీఐ పి.రామలింగయ్య, టూ టౌన్ సీఐ మల్లికార్జునగుప్త, త్రీ టౌన్ సీఐ జయనాయక్, చాపాడు ఎస్ఐ నరేంద్రకుమార్, ప్రొద్దుటూరు, చాపాడు, రాజుపాళెం మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఫ్యాక్షనిస్టుల పాత ఆయుధాలు నిర్వీర్యం
కర్నూలు: కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో ఫ్యాక్షనిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న 1,575 తుపాకులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1976 నుంచి 2009 వరకు పలు కేసుల్లో ఎస్బీబీఎల్ గన్స్ 260, ఎస్బీఎంఎల్ గన్స్ 256, బీబీఎల్ గన్స్ 78, పిస్టల్స్ 522, రివాల్వర్లు 364, రైఫిల్స్ 93, స్టెన్ గన్స్, తపంచ, ఎయిర్ గన్స్, ఎయిర్ పిస్టల్స్.. మొత్తం 1,575 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయుధాల సీజ్ 1998లో ఎక్కువ జరిగిందని వివరించారు. పై అధికారుల అనుమతితో పాత ఆయుధాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి పూర్తిగా నాశనం చేశామని, తర్వాత కాల్చి ఇక్కడే గుంతలో పూడ్చి పెట్టినట్లు చెప్పారు. మరో 12 పాత ఆయుధాలను నిర్వీర్యం కమిటీ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ ప్రదర్శన నిమిత్తం ఉంచామన్నారు. -
ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం
జూపాడుబంగ్లా: ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపుతామని.. రౌడీషీటర్లు, ఫ్యాక్షనిస్టులు వారి కార్యకలాపాలకు స్వస్తి చెప్పకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. గురువారం మండల జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొన్ని కేసులకు సంబంధించి రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. వీటిని పునఃదర్యాప్తు చేసేందుకు సీఐ, డీఎస్పీలను ఆదేశించామన్నారు. గ్రామాల్లో బెల్టు, నాటుసారా విక్రయాలు సాగుతున్నట్లు తన దృష్టికి వస్తే ఆయా పోలీసుస్టేషన్ల ఎస్ఐలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,400 మంది రౌడీషీటర్లను గుర్తించడంతో పాటు.. ఆయా స్టేషన్ల ఎస్ఐలకు వారి సమాచారం అందజేసి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. వీరిలో మార్పు తీసుకొచ్చేందుకు వారానికో రోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాక్షన్ కారణంగా కర్నూలు జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఫ్యాక్షన్ కనుమరుగైన గ్రామాలను కేటగిరీల వారీగా విభజించి అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఐరన్‌ఓర్, ఇసుక అక్రమ తరలింపులపై మైనింగ్ అధికారులతో కలసి దాడులు చేస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో నగరంలోని చాలా మార్పు వస్తోందన్నారు. రాత్రిళ్లు ఈ కార్యక్రమం వల్ల ప్రమాదాలను నివారించడంతో పాటు పాత నేరస్తుల కార్యకలాపాలు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అనంతరం పోలీసు క్వార్టర్స్‌ను పరిశీలించి స్థానికంగా నివాసం ఉండని పోలీసుల వివరాలను తెలుసుకున్నారు. నివాసం ఉంటున్న చెన్నయ్యకు అవార్డు ప్రకటించి.. స్థానికంగా ఉండని సిబ్బందిని మందలించారు. మరోసారి తనిఖీకి వచ్చేలోపు సిబ్బంది అంతా క్వార్టర్స్‌లోనే నివాసం ఉండాలని ఆదేశించారు. పోలీసు హెడ్ క్టార్టర్స్కు బదిలీ అయిన ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డిని శాలువా కప్పి అభినందించారు. ఎస్పీ వెంట నందికొట్కూరు సీఐ నరసింహమూర్తి, ఎస్ఐ గోపినాథ్ ఉన్నారు. -
ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు
తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ఆయన గురువారమిక్కడ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి చంద్రబాబే కారణమని చెవిరెడ్డి విమర్శించారు. ఫ్యాక్షనిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చింది ఆయననేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులు అయిన పోతుల సురేష్, చమన్, కందికుంట ప్రసాద్‌లకు పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారని చెవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు ఎర్ర చందనం స్మగర్లు అని, స్మగ్లర్లకు, ఫ్యాక్షనిస్టులకు టికెట్లు ఇచ్చిన బాబు ఇప్పుడు నీతులు చెప్పటం సిగ్గుచేటు అని ఆయన ఎద్దేవా చేశారు. -
సీఎం ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నడు
ఎన్జీవోస్కాలనీ, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. సీమాంధ్రులకు తెలంగాణను పాలించే హక్కులేదన్నారు. ముల్కీ వారోత్సవాల్లో భాగంగా హన్మకొండలోని కాళోజీ సెంటర్లో టీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మహాదీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఏనాడూ హింసకు పాల్పడలేదన్నారు. తమపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఏడో తేదీన ఏపీఎన్జీవోస్ జరుపుతున్న సభ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడి చేయడమేనన్నారు. మద్రాసు నుంచి తరిమికొట్టినట్టే హైదరాబాద్ నుంచి తరమికొట్టే రోజులు తీసుకురావద్దని సూచించారు. తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిస్తే తన చేతిలో ఏమీ లేదని... అంతా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రం చేతుల్లో ఉందని చట్టసభలోనే చెప్పారని గుర్తు చేశారు. తీరా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణలో లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం న్యాయమైందని మాట్లాడుతున్నారని, తెలంగాణలో చేసేది అధర్మ యుద్ధమా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో... అయనకే తెలియడం లేదని విమర్శించారు. అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నిరోజులైనా సీమాంధ్ర ప్రాంతం వారు.. వారి స్వస్థలంకు వెళ్లాల్సిందేనన్నారు. సాగరహారంకు అనుమతివ్వాలని 30 మంది ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లామని, రేపు రాత్రి ఉందనగా అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. దీక్షలో తక్కళ్లపల్లి రవీందర్రావు, మర్రి యాదవరెడ్డి, నున్నా అప్పారావు, సదానందం, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, పాపిరెడ్డి, సీతారాం నాయక్, శ్రీనివాస్‌రావు, బొట్ల బిక్షపతి, పరిటాల సుబ్బారావు, కోల రాజేశ్‌కుమార్, ఎ.జగన్మోహన్రావు, ఈగ వెంకటేశ్వర్లు, రాంకిషన్, వీరాచారి, రత్నాకర్‌రెడ్డి, శ్యాంసుందర్, దాస్యనాయక్, షేక్ హుస్సేన్, ఆర్ శ్రీనివాస్, పి.విజయలక్ష్మి, బి.రాము, ధరంసింగ్, కేవీ.నరేందర్, కె.సామ్యూల్, కంతి రమేష్ పాల్గొన్నారు. ఇక్కడి ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటలేరు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్టేడియంలో క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ జీఓ ఉన్నా... దాన్ని కాలరాస్తూ ఏపీఎన్జీవోల సభకు ఎలా అనుమతి ఇస్తారు. - దేవీప్రసాద్, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాబు, కిరణ్ అడ్డుకుంటున్నరు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నరు. సీమాం ధ్రులకు తెలంగాణను పాలించే హక్కు లేదు. సీమాంధ్రుల కుట్రలను తిప్పి కొడతాం. తెలంగాణ ప్రజలకు శాంతి దీక్షలు తెలుసు..సమరాలు తెలుసు. -పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నరు రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుని నెల రోజులు గడుస్తున్నా... కేంద్రం ముందుకు పోవడం లేదు. దీంతో ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉంది. యూపీఏ ప్రభుత్వం ఇవ్వకున్నా, ఆ తరువాత అధికారంలోకి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తుంది. ఇప్పటికే తెలంగాణపై నరేంద్ర మోడీచే హైదరాబాద్‌లో సభ నిర్వహించాం. త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించాలి. - నరహరి వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి టీడీపీ గద్దెలు కూలుతయ్... తెలంగాణలో టీడీపీ గద్దెలు కూలుతయ్. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ నమ్మబలికి చంద్రబాబు తెలంగాణకు మోసం చేశారు. బాబు చేపట్టిన సమైక్య బస్సు యాత్ర, నిర్ణయంపై చెంచాగిరి చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏం సమాధానం చెబుతరు. తెలంగాణను దోచుకున్న వారికి అనుమతిచ్చిండ్రు. మేము హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తామంటే అనుమతియ్యలె. పైగా అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తున్నా సహనంతో ఉంటున్నాం. శాంతియుతంగా, గాంధేయ మార్గంలో వెళ్తున్నం. ఏపీఎన్జీవోలు సభ జరుపుకుంటే స్టేడియంలో ఉన్న తెలంగాణ తేల్లు, పాములు, కుక్కలు కరుస్తాయి. - దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే కల్లోలం సృష్టించాలని చూస్తున్నరు ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించాలని సీమాంధ్రుల నేతృత్వంలో ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వారికి ఇచ్చిన అనుమతి రద్దుచేయాలి. తెలంగాణ ప్రక్రియ వేగవంతమవుతున్న క్రమంలో సమైక్యవాదం అంటూ సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు బుసలు కొడుతున్నరు. కూతురి వివాహానికి సినీ నటుడు బాలకృష్ణ తన సోదరుడు హరికృష్ణనే పిలువలేదు. ు కుటుంబమే కలసి ఉండనప్పుడు భయపెట్టి బలవంతంగా ఉండాలంటే ఎలా కలిసి ఉంటాం. పోలీసులు అత్యుత్సాహం చూపి అనుమతిచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు, రౌడీషీట్లను ఎత్తేయాలి. ఏడో తేదీన జరిగే శాంతి ర్యాలీకి రెండు రోజుల ముందుగానే చేరుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులను వేదించిన అధికారులను, పోలీసులను రాష్ట్రం ఏర్పడ్డాక వదిలిపెట్టం. - శ్రీనివాస్‌గౌడ్ , తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర పాలితం చేస్తే ఊరుకోం హైదరాబాద్‌ను కేంద్ర పాలితం చేస్తే ఊరుకునేది లేదు. హైదరాబాద్ సహా 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలిచి ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇప్పించిండు. టీఎన్జీవోస్ దీక్షకు 10 రోజుల కిందట అనుమతి కోరితే ఇవ్వలేదు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని కుట్రలు చేస్తున్నరు. - కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి