breaking news
explosives recovered
-
అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఆదివారం ఆయనను కోర్టు ముందు హాజరు పర్చి, కస్టడీకి డిమాండ్ చేయనున్నామని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. 12 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత 286, 465, 473, 506 (2), 120 బి ఐపిసి, మరియు 4 (ఎ) (బి) (ఐ) పేలుడు పదార్థాల చట్టం 1908 కింద వాజేను అరెస్టు చేశామని వెల్లడించారు.(అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు) ఫిబ్రవరి 25న అంబానీ నివాసం యాంటిలియా వద్ద జిలిటెన్ స్టిక్స్తో ఉన్న వాహనం కలకలం రేపింది. ఈ కేసులో ఆటో విడిభాగాల వ్యాపారి వాహన యజమాని మాన్సుఖ్ హిరేన్ ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో థానేలో మృతి చెందారు. దీంతో హిరేన్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ కూడా వాజేపాత్రపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో వాజేను క్రైమ్ బ్రాంచ్ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. (వెలుగులోకి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది) -
ఆరుగురు మావోయిస్టుల అరెస్టు
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఆరుగురు మావోయిస్టులను అరెస్టు చేసి, భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కూడిన ఓ ప్రత్యేక బృందం భీంబంద్ అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అక్కడున్న ఆరుగురు మావోయిస్టులను అరెస్టు చేసి ఆయుధాలు, 200 బుల్లెట్లు, 50 డిటొనేటర్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ సుధాంశు కుమార్ తెలిపారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. గతనెలలో కూడా పొరుగున ఉన్న జముయ్ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన సోదాలలో 70 హేండ్ గ్రెనేడ్లు, 25 మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు జిల్లాలు మావోయిస్టులకు గట్టి పట్టున్న జిల్లాలు.