breaking news
Explosion Cause
-
టపాసుల తయారీలో పేలుడు
సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నేల టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించి భార్యా భర్తలతోపాటు మరో మహిళ మృతి చెందారు. చిన్నారి స్వల్పంగా గాయపడింది. ఈ సంఘటన చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఎన్టీఆర్ కాలనీలో గాలేటి నాగార్జున (32), భార్య ఆదిలక్ష్మి (28), నాలుగేళ్ల కుమార్తె శృతి, తల్లి పద్మతో కలసి నివాసం ఉంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగించే ఇతను దీపావళి సమయాల్లో రహస్యంగా నేల టపాసులు తయారు చేసి దుకాణదారులకు విక్రయిస్తాడు. ఈ విషయం చుట్టపక్కల వారికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ శబ్దంతో నాగార్జునకు చెందిన సిమెంటు రేకుల పైకప్పు కుప్పకూలింది. ఇంటి పైకప్పు రేకు శకలాలు కాలనీలో రెండు లైన్లు అవతల పడ్డాయి. ఈ సంఘటనలో నాగార్జున, భార్య ఆదిలక్ష్మి, నేల టపాసులు తయారీలో పాల్గొనేందుకు వచ్చిన అదే కాలనీకి చెందిన చెల్లి దివ్య(28) అక్కడికక్కడే మృతి చెందారు. దివ్య మృతదేహం ఛిద్రమైంది. చెల్లి దివ్య కాలు భాగం సమీపంలో ఉన్న పార్కులో ఎగిరి ఫర్లాంగు దూరంలో పడింది. తొలుత ఇంట్లోనే ఉన్న నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుమార్తె నాలుగేళ్ల శృతి కూడా గాయాలపాలైంది. పేలుడు శబ్దానికి బయటకు వచ్చిన స్థానికులు ఇంటి శిథిలాల నుంచి నాగార్జునను, శృతిని బయటకు తీసి పేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగార్జున పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అనంతరం మంగళవారం అర్ధరాత్రి 11.30 గంటలకు నాగార్జున మృతి చెందాడు. ప్రమాద సమయంలో వృద్ధాప్య పెన్షన్ తెచ్చుకొనేందుకు బయటకు వెళ్లిన నాగార్జున తల్లి పద్మ ప్రాణాలతో బయట పడింది. మరో వైపు కూలికి వచ్చి ఈ ప్రమాదంలో మృతి చెందిన చెల్లి దివ్య భర్త రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తాడు. ఆమెకు తొమ్మిదేళ్ల మిన్ను, ఎనిమిదేళ్ల హన్య అనే కుమార్తెలు ఉన్నారు. నాగార్జునతోపాటు ఆయన తల్లి పద్మ చెప్పిన మాటల ప్రకారం తొలత అంతా గ్యాస్ సిలిండర్ పేలిందనుకున్నారు. అయితే పేలుడు ఆనవాళ్లు తప్పించి ఎలాంటి మంటలు చెలరేగకపోవటంతో పోలీసు విచారణలో బాణసంచా సామగ్రి కారణంగా పేలుడు జరిగినట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణం నాగార్జున ఇంట్లో సూరే కారం, భాస్వరం ఆనవాళ్లు లభించాయి. నాగార్జునకు గతంలో బాణసంచా తయారీ కంపెనీలో పని చేసిన అనుభవం ఉందని పోలీసులు నిర్ధారించారు. సూరేకారం మిక్సీలో వేయడంతో పేలుళ్లు సంభవించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇంటితోపాటు సమీపంలోని కుమ్మరకాలనీలో ఓ ఇంటిలో నేల టపాసులు తయారు చేయిస్తున్నారు. కుమ్మరకాలనీలో బాణసంచా తయారీ సామగ్రిని అర్బన్ సీఐ వీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. మృతులు సాధారణ వ్యక్తులు కావటంతో వీరి వెనకాల ఎవరున్నారనేది తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని నరసరావుపేట డీఎస్పీ ఎం వీరారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి వీ శ్రీనివాసులురెడ్డి, అర్బన్ సీఐ వీ సూర్యనారాయణ, స్థానిక అగ్నిమాపక అధికారి కే సునీల్‌కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నేతల పరామర్శ ఎమ్మెల్యే విడదల రజని బాధిత కుటుంబాలను పరామర్శించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నోట్7 పేలుళ్ల కారణాలేమిటో తేల్చుతాం..
గెలాక్సీ నోట్7 ఫోన్ బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఓ వైపు ఉత్పత్తిని, మరోవైపు అమ్మకాలను రెండింటినీ శాశ్వతంగా నిలిపివేసిన శాంసంగ్, ఈ ఘటనలకు కారణమేమిటో త్వరలోనే తేల్చుతుందట. తమ ఫోన్లను వాడొద్దంటూ కఠిన హెచ్చరికలు కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు, ఫోన్ మాట్లాడినప్పుడు పేలుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దాదాపు 25 లక్షలకుపైగా ఫోన్లను కంపెనీ రీకాల్ చేసింది. రీకాల్ చేసిన ఫోన్లను రీప్లేస్‌మెంట్‌తో కొత్త ఫోన్లను విడుదలచేసింది. రీప్లేస్ చేసిన మోడల్స్ నుంచి కూడా పొగలు రావడంతో కంపెనీ మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. తమ ఫోన్లు వెనక్కి పంపించేయడంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో కనుగొనడానికి కంపెనీ ముప్పు తిప్పులు పడుతుందట. ఈ కారణంతోనే ఇన్నిరోజులు కారణమేమిటో కూడా వెల్లడించడానికి శాంసంగ్ తీవ్ర సతమతమైందని తెలుస్తోంది. కానీ చివరగా ఈ పేలుళ్లకు అసలు కారణమేమిటో త్వరలోనే తేల్చుతామని శాంసంగ్ ప్రకటించింది. దీనిపై విచారణ కొనసాగుతుందని, వచ్చే వారాల్లో తమ ముందుకు పేలుళ్ల కారణాలు విడుదలచేస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. మొదటిసారి పేలుళ్లు సంభవించినప్పుడే కంపెనీకి చెందిన ఇంజనీర్లు కారణాలేమిటో కనుగొనడంలో తీవ్రంగా విఫలమైనట్టు పలు రిపోర్టులు వెల్లడించాయి. వివిధ టెస్టులు నిర్వహించినప్పటికీ ఏ కారణంతో ఇవి పేలుతున్నాయో మూల కారణాన్ని కనుగొనలేకపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.