breaking news
Ex-serviceman
-
ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.. సైబర్ ఉచ్చులో పడ్డాడు..
సాక్షి, విశాఖపట్నం: ఓ మాజీ సైనికోద్యోగి తన ప్రాంత సమస్యపై పెట్టిన ఫేస్బుక్ పోస్టు అతడిని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేలా చేసింది. విశాఖలోని పాత రేసపువానిపాలెంకు చెందిన మాజీ సైనికోద్యోగి బి. శ్రీనివాసరెడ్డి సీతంపేట, రాజేంద్రనగర్‌లోని రూ.20 కోట్ల విలువైన 1,843 గజాల జీవీఎంసీ ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 3న మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాళ్లు.. శ్రీనివాసరెడ్డి సమస్యను ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 7న శ్రీనివాసరెడ్డికి ఓ వాట్సప్ కాల్ వచి్చంది. దానికి మాజీ మంత్రి దేవినేని ఉమా ఫొటో డీపీగా ఉంది. ఫోన్ చేసిన అగంతకుడు తాను దేవినేని ఉమను మాట్లాడుతున్నానని, పార్కు స్థలం సమస్యను రష్యా పర్యటనలో ఉన్న లోకేశ్ తన దృష్టికి తెచ్చారని, దాన్ని పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని చెప్పాడు. బాధితుడికి అనుమానం రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నటించాడు. అంతేకాకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తదితరులతో తాను వాట్సాప్‌లో చాట్ చేసినట్లుగా ఫేక్ స్క్రీన్ షాట్లని సృష్టించి బాధితుడికి పంపాడు. నేరుగా జీవీఎంసీ కమిషనర్‌తో మాట్లాడి పార్కు సమస్యతో పాటు, బాధితుడికి ఉన్న ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) సమస్యను కూడా పరిష్కరిస్తానని మభ్యపెట్టాడు. అనుకున్న పనులు పూర్తి కావాలంటే జీవీఎంసీ కమిషనర్‌కు ముందుగా కొంత ‘ఫార్మాలిటీ అమౌంట్’ ఇవ్వాలని షరతు పెట్టాడు. దీన్ని నమ్మిన బాధితుడు 7న సైబర్ నేరగాడు పంపిన ‘రాథోడ్ సంతోష్’ అనే పేరుతో ఉన్న యూపీఐ క్యూ ఆర్ కోడ్‌కు ఫోన్ పే ద్వారా రూ.80 వేలు పంపించాడు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, వాట్సాప్ డీపీ కూడా తొలగించడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. -
చిన్నారి పనిమనిషిపై మాజీ సైనికుడి అఘాయిత్యం
తమ ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల పనిమనిషిపై 67 ఏళ్ల మాజీ సైనికుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణం నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో జరిగింది. బెంజిమెన్ అనే నిందితుడు ఆర్మీలో వంటవాడిగా పనిచేసి రిటైరయ్యాడు. అతడి ఇంట్లో బాధితురాలు పనిమనిషిగా చేస్తోంది. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఈమెపై బెంజిమెన్ రెండుసార్లు అత్యాచారం చేశాడు. అయితే, బాధితురాలు కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతి అని తేలింది. ఏంటని అడిగితే ఆమె అసలు విషయం చెప్పింది. తనను తాడుతో కట్టిపారేసి తనపై బెంజిమెన్ అత్యాచారం చేశాడని బాధితురాలు తన తల్లికి, పోలీసులకు తెలిపింది. తల్లి చేసిన ఫిర్యాదు మేరకు నాయుడుపేట పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. అతడి కోసం గాలింపు జరుపుతున్నారు.


