breaking news
evil powers
-
దెయ్యం భయం.. ఊరు ఖాళీ!
సాక్షి, వేలేరుపాడు: ఆ ఊరి పొలిమేరల్లో ఓ పెద్ద బండరాయి.. దాని కింద ఓ సొరంగం.. అందులో ఉడుము రూపంలో ఎర్రమారి దెయ్యం.. నిత్యం బయట సంచరిస్తుంది.. కాలక్రమేణా ఆ సొరంగం మట్టితో పూడుకుపోయింది. ఇంకేం.. ఆ దెయ్యానికి కోపం వచ్చింది.. గ్రామస్తులను బలితీసుకోవడం మొదలుపెట్టింది.. అందుకే ఆ గ్రామాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్నా ఇంకా ఇటువంటి మూఢాచారాలు జన జీవనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయనడానికి పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో మారుమూల గిరిజన గ్రామమైన కొర్రాజులగూడెం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇళ్లను సైతం పడగొట్టారు గ్రామంలో మొత్తం 40 గిరిజన కుటుంబాలుండేవి. పెంకుటిళ్ల కాలనీలతో పాటు, మూడు మంచినీటి బోర్లు, లక్షలాది రూపాయలు వెచ్చించి రహదారి కూడా నిర్మించారు. తొమ్మిదేళ్ల కిందట పక్కా పాఠశాల భవనాన్ని కూడా నిర్మించారు. గతేడాది మరో అదనపు పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ ఊరి పొలిమేరల్లో ఉన్న ఓ పెద్ద బండరాయి కింద ఉన్న సొరంగం రెండున్నరేళ్ల కిందట మట్టితో పూడిపోయింది. అదే ఏడాది గ్రామంలో వివిధ వ్యాధులతో కారం లక్ష్మయ్య, పరిశక లక్ష్మయ్య, బందం తమ్మయ్య, మిడియం రాములు మృతి చెందారు. మళ్లీ ఆరు నెలలకు మడివి చిన్నయ్య, కారం చిన్నక్క, సోడే రాజమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. ఇంకేముంది దీనికి ఎర్రమారి దెయ్యం ఆగ్రహమే కారణమని భయపడిన గ్రామస్తులు ఊరుని ఖాళీచేసి వెళ్లిపోయారు. గ్రామంలోని 30 పెంకుటిళ్లను సైతం పడగొట్టి.. కిలోమీటర్ దూరంలోని తారురోడ్డు ప్రాంతంలో పూరిగుడిసెలు నిర్మించుకున్నారు. అందుకే బలితీసుకుంటోంది.. ‘మా గ్రామంలో దెయ్యం ఉన్న సొరంగం మట్టితో పూడిపోవడంతో అది ఆగ్రహించి మా ఊరివాళ్లను బలితీసుకుంది’ అని ఆ గ్రామ పెద్దకాపులు తెల్లం సాయిబు, సోడే ముత్యాలు, కారం గంగులు ‘సాక్షి’తో చెప్పారు. అందువల్లనే ఊరు ఖాళీ చేశామని, ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందన్నారు. గతంలో ఊరు అక్కడున్నప్పుడు 46 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చదువుకునేవారు. గ్రామస్తులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న ప్రాంతానికి అరకిలో మీటర్ దూరంలో ఉన్న ఈ పాఠశాలకు విద్యార్థులు వెళ్లకపోవడంతో ప్రభుత్వం మూసేసింది. దీంతో కొర్రాజులగూడేనికి చెందిన 18 మంది విద్యార్థులు కాలినడకన కిలోమీటరు దూరంలో ఉన్న చాగరపల్లి పాఠశాలకు వెళ్తున్నారు. బతుకుజీవుడా అంటూ బయటపడ్డాం.. ఆ దెయ్యం వల్ల మా వాళ్లను కోల్పోయాం. ఇంకా అక్కడే ఉంటే మమ్మలికూడా ఆ అది మింగేసేదే. అందుకే బతకుజీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాం. వేరే చోట కొత్త ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. – కణితి శ్రీరాములు కొర్రాజులగుడెం గ్రామస్తుడు నన్నూ భయపెట్టారు.. ఈ పాఠశాలలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేయడానికి ఇక్కడకొచ్చాను. ‘మీరు పాఠశాలకు ఎలా వెళుతున్నారు.. అక్కడ దెయ్యం ఉంది’ అంటూ నన్ను భయపెట్టారు. మొదట్లో కొంత భయపడ్డాను. తర్వాత నెమ్మదిగా భయం వీడి పాఠశాలకెళ్లాను. తర్వాత పాఠశాలను ప్రభుత్వమే మూసేసింది. ఇక్కడి విద్యార్థులను కిలోమీటరు దూరంలోని చాగరపల్లి పాఠశాలలో విలీనం చేశారు. ప్రస్తుతం చాగరపల్లి పాఠశాలలో పర్మినెంట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. కొర్రాజులగూడెం విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. – గుజ్జా శిరీష, అకడమిక్ ఇన్స్ట్రక్టర్ -
దుష్టశక్తులు పీడిస్తున్నాయంటూ.. చంపేసింది
జైపూర్: ఓ వ్యక్తి మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకున్నాడు. దుష్టశక్తులు పీడిస్తున్నాయంటూ ఓ మహిళ (మంత్రగత్తె) ఇనుపకడ్డీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. రాజస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కిషన్ లాల్ (50) అనే వ్యక్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి ఆయన్ను చికిత్స కోసం లక్ష్మిదేవి అనే మహిళ దగ్గరకు తీసుకెళ్లారు. కిషన్ లాల్‌ను దుష్టశక్తులు పీడిస్తున్నాయని ఆమె చెప్పింది. విరుగుడు పేరుతో కాల్చిన ఇనుప కడ్డీతో వాతలు పెట్టింది. తీవ్రంగా గాయపడిన కిషన్ లాల్ పరిస్థితి విషమించింది. ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదు.