breaking news
Entrepreneur Nithyananda Reddy
-
వనం.. ఖాకీమయం
కాల్పుల ఘటనతో పోలీస్ అలర్ట్ కేబీఆర్ పార్కు వద్ద భారీ బందోబస్తు రక్షక్, స్పెషల్ వాహనాలలో గస్తీ అడుగడుగునా పోలీసులే... సడలని ధీమా...పార్కుకు తగ్గని రద్దీ బంజారాహిల్స్: కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజు...కేబీఆర్ పార్కులో సీన్ మారింది. నిన్నటిదాకా వందలకొద్ది వాకర్లు మాత్రమే నడిచే వాక్‌వే కనిపించేది. కానీ గురువారం అందుకు భిన్నంగా అడుగడుగునా ఖాకీలు కనిపించారు. బుధవారం ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు ఏకే-47తో కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి భద్రతపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్వ యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కలుగజేసుకోవాల్సి వచ్చిం ది. పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాల్‌గా తీసుకున్నారు. నిన్నమొన్నటిదాకా ఒక్క హోంగార్డు కూడా తిరగని ఈ పార్కు వద్ద గురువారం తెల్లవారుజామున నాలుగు గంట ల నుంచే భారీగా పోలీసులను మోహరించారు. హోంగార్డు స్థాయి నుంచి అధికారి వరకు పార్కు చుట్టూ రౌండ్లేశారు. సాయుధ బలగాల మోహరించాయి. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త పోలీసు వాహనాలు సుమారు 12 వరకు పార్కు చుట్టూ రౌండ్లు కొట్టాయి. వీటికి తోడు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా రక్షక్ వాహనాలను రప్పించారు. వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ నాగరాజు, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐలు పార్కు చుట్టూ నిఘా ఉంచారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. పోలీసులకు తగిన సూచనలు జారీ చేశారు. మొత్తానికి కేబీఆర్ పార్కు పోలీసు దిగ్బంధంలో ఉండిపోయింది. నిఘా మధ్య సామాన్యులు, వీఐపీలు, వీవీఐపీలు వాకింగ్ చేయాల్సి వచ్చింది. -
భయం..భయం
బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పుల ఘటనపై వాకర్లను భయాందోళనకు గురిచేసింది. పార్కులో సుమారు రెండువేల మంది వాకింగ్ చేస్తున్న సమయంలో ఇది జరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. పార్కు బయట పోలీసు బందోబస్తు లేకపోవడం వల్లనే వాకర్లకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీవీఐపీలు ఈ పార్కులో వాకింగ్ చేస్తుంటారు. కాల్పులు జరిగిన సమయంలో పలువురు ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, ఆభరణాల వ్యాపారులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్కు లోపల ఉన్నారు. దీనికి తోడు పలువురు సినీ ప్రముఖులు కూడా వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏ మాత్రం భద్రత లేదని...కనీసం మెటల్ డిటెక్టర్లు కూడా ఏర్పాటు చేసిన పాపానపోలేదని పార్కు నిర్వాహకులపై వాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడే పోలీసులు, అధికారులు హడావుడి చేస్తారు తప్పితే భద్రతను గాలికి వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. కేబీఆర్ పార్కు చుట్టూ పలు ప్రాం తాలను ఎంచుకొని నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ దిశలో చర్యలు తీసుకోలేదు. అంతేకాదు పార్కును అటవీ శాఖ నిర్వహిస్తుండగా పార్కు బయట ప్రాం తాన్ని హెచ్ఎండీఏ ఆధీనంలో ఉంచుకుంది. పార్కు బయట రోడ్డును పోలీసులు నియంత్రిస్తున్నారు. ఈ మూడు శాఖల మధ్య ఏ మాత్రం సమన్వయం లేదు. పార్కులోపల పోలీసులను నిఘాలో ఉంచుతామని పలుమార్లు బంజారాహిల్స్ పోలీసులు సూచించినా నిర్వాహకులు మాత్రం అందుకు అనుమతించలేదు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగవని గ్యారెం టీ లేదంటూ వాకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిఘూ పెంచాలి.. కేబీఆర్ పార్కు వద్ద భద్రత పెంచాలి. ఈ వ్యవహారంపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. వేలాది మంది వాకర్లు నడిచే పార్కు వద్ద ఏకే 47 గన్‌తో ఒక ఆగంతకుడు కాల్పులు జరిపాడంటే భద్రత ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. - కారుమూరి వెంకట నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే భద్రత లేకుండా పోయింది.. పార్కు బయట అవుట్‌పోస్టు ఉండేది. ఇటీవల దాన్ని తొల గిం చారు. దీంతో ఇక్కడ పోలీసులు లేకుండా పోయారు. ఇటీవల ఇక్కడ కార్లలో దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. పర్సులు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు తస్కరించిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మొబైల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అవుట్ పోస్టును పునరుద్దరించాలి. - జయవీర్‌రెడ్డి, కేబీఆర్ పార్కు సెక్రటరీ భయమేస్తోంది.. నిత్యానందరెడ్డిపై కాల్పుల వ్యవహారం మాలో తీవ్ర భయాన్ని రేకెత్తించింది. ఇక్కడ పోలీసు నిఘా ఉండి ఉంటే ఆగంతకుడు దొరికేవాడు. ఉదయం పూట ఈ సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. అందులోనూ ఏకే 47తో ఆగంతకుడు కేబీఆర్ పార్కు వద్ద సంచరించిన విషయం తలుచుకుంటేనే భయమేస్తుంది. - సీఎస్‌రెడ్డి, వాకర్ -
అవాక్.. సిటీ షాక్
కేబీఆర్ పార్క్‌లో భద్రత ప్రశ్నార్థకం నిత్యానందరెడ్డిపై దాడితో ఉలిక్కిపడిన జనం కాల్పుల సంఘటనతో వెల్లడైన డొల్లతనం సినీ ఫక్కీలో దుండగుడి దురాగతం భయంతో వాకర్స్ పరుగులు సంఘటనపై నిశ్చేష్టులైన ప్రముఖులు నిత్యం అనేక మంది ప్రముఖుల సందర్శన అయినా చలనంలేని పోలీసు శాఖ నగరం ఇంకా పూర్తిగా నిద్ర నుంచి మేల్కొనలేదు. సూర్యుడు అప్పుడే మంచు బిందువులను చీల్చుకొని బయటకు వస్తున్నాడు. ప్రశాంతతకు మారుపేరైన కేబీఆర్ పార్క్‌లో ఉద్యోగులు... వ్యాపారులు... వివిధ రంగాల ప్రముఖులు... వాకింగ్ చేస్తున్నారు. ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని విచ్ఛిన్నం చేస్తూ... ధన్...ధన్ మంటూ తుపాకీ గర్జన. పార్క్‌లో వాకింగ్ చేస్తున్న సుమారు 2,500 మందికి ఏం జరిగిందో అర్థం కాలేదు...ఉగ్రవాదులెవరో దాడులకు తెగబడ్డారేమోనని....ఆందోళనతో తలో దిక్కుకు పరుగులు తీశారు. అందరిలోనూ టెన్షన్. ఇంతలో సమీపంలోని ఓ కారు వద్ద ఏదో కలకలం. తేరుకున్న కొందరు ధైర్యం చేసి...అక్కడికి చేరుకున్నారు. పగిలిన కారు అద్దాలు...ఇతర భాగాలు చూసి భీతిల్లిపోయారు. అందులో మాటాడలేని స్థితిలో ఓ వ్యక్తి. ఆయనే ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డి. కాల్పులు జరిగింది ఆయనపైనే. అచ్చం మాఫియా సినిమాలను తలపించే రీతిలో...జన సంచారం ఉన్న ప్రదేశంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన వార్త క్షణాల్లో నగరమంతటా పాకింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉన్నవారిని భీతావహుల్ని చేసింది. ఇదేం భద్రత..? ► పార్క్ ప్రధాన గేటు వద్ద సోదాలు చేసే సెక్యూరిటీ సిబ్బంది లేరు. ► గేటు వద్ద మెటల్ డిటెక్టర్ జాడ లేదు. మెటల్ డిటెక్టర్ ఏర్పాటు ► చేసుకోవాలని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల అనంతరం స్థానిక పోలీసులు ఈ పార్క్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా ఇంతవరకూ స్పందన లేదు. ► పార్క్ ముందు సీసీ కెమెరాలు లేవు. ► పార్క్ వద్ద పోలీసు గస్తీ లేదు. 20 రోజుల క్రితం ఇక్కడి పోలీసు కంట్రోల్ రూంను తొలగించారు. ► నేరస్తుల కదలికలను గుర్తించడానికి ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఇంటర్సెక్టర్ వాహనం అడ్రస్సే లేదు. సందర్శకులకు ఏం జరిగినా పట్టించుకునే వారేలేరు. గత సంఘటనలు.. కేబీఆర్ పార్క్ వద్ద గతంలో కొన్ని నేరాలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది పార్క్ వెనుక గేటులో నుంచి ప్రవేశించిన ఆటో డ్రైవర్లు ఓ సెక్స్ వర్కర్‌ను దారుణంగా హత్య చేశారు. 8 నెలల క్రితం వాకింగ్ చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి భార్య మెడలో నుంచిఆరు తులాల బంగారు గొలుసు చోరీకి గురైంది. 2 నెలల క్రితం పార్క్‌లోని గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా... అడ్డు వచ్చిన మహిళపై గొడ్డలితో దాడి చేసింది. బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్... నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు వాకింగ్‌కు ఎంచుకున్న ప్రదేశం. నిత్యం అనేక మంది అక్కడికి వెళ్తుంటారు. అలాంటి చోట భద్రత లేకపోవడం...మన వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతోంది. బుధవారం ఉదయాన్నే ఫ్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిగిన తీరు అక్కడి భద్రతా వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. దాదాపు జనం మధ్యలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నివ్వెర పరుస్తోంది. సినిమా సన్నివేశాన్ని తలపించేలా ఓ ప్రముఖుడిపై దుండగుడు కాల్పులకు తెగబడడం విస్తుగొల్పుతోంది. నిత్యం ఉదయం 4251 మంది, సాయంత్రం 2803 మంది వాకర్లు ఇక్కడికి వస్తుంటారు. ఇందులో ప్రముఖుల సంఖ్య 300 పైనే. వీరిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ హోంమంత్రి మైసురారెడ్డి, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ధర్మాన ప్రపాదరావు, జానారెడ్డి, లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీలు, రుద్రరాజు పద్మరాజు, భానుప్రకాష్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, డి.రామానాయుడు, గణేష్ బండ్ల, హీరో బాలకృష్ణ, మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, కె. విజయరామారావు, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ, చింతల రామచంద్రారెడ్డి, ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్, అరుణా బహుగుణ, హైకోర్ట్ జస్టిస్ చల్లా కోదండరామ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 35 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 16 మంది మాజీ మంత్రులు, 24 మంది ప్రముఖ ఆభరణాల వ్యాపారులు, 28 మంది బడా పారిశ్రామికవేత్తలు, 42 మంది వ్యాపారులు వస్తుంటారు. ఈ ఘటనకు 10 నిమిషాల ముందే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లారని తెలిసింది. ఇంతమంది వస్తున్న ఈ పార్కుకు పోలీసు బందోబస్తు లేదంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తుపాకీ లెసైన్సులకు కేరాఫ్ సంపన్నులు నివాసం ఉండేజూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అత్యధికంగా తుపాకుల లెసైన్స్‌లు ఉంటాయి. గతంలో ఈప్రాంతంలోసరదాగా జరిపిన కాల్పుల దగ్గరి నుంచి పాయింట్ రేంజ్లో గురిపెట్టి కాల్పులకు తెగబడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తుపాకుల మోత కొత్త కాకపోయినా... ఏకె-47తో కాల్పులకు తెగబడిన ఘటన స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో తుపాకీ పేలుళ్ల సంఘటన లు ఇవే... ► గతంలో బంజారాహిల్స్‌లోని గ్రీన్‌మాస్క్ వద్ద రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఓ రియల్టర్‌పై కాల్పులు జరిగాయి. ► జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ సమీపంలోని తన ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలను ఓ వైద్యుడు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో కాల్చారు. ► జూబ్లీహిల్స్‌లో సినీనటుడు బాలకష్ణ ఇంట్లో 2004 జూన్ 3ననిర్మాత బెల్లకొండ సురేష్, సత్యనారాయణ చౌదరిలపై కాల్పులు జరిగాయి. ► రాష్ర్త వ్యాప్తంగా సంచలనం సష్టించిన ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరిపై అతని అనుచరుడు భానుకిరణ్ 2011 జనవరి 2న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నవోదయ కాలనీలో రివాల్వర్‌తో హతమార్చాడు. ► జూబ్లీహిల్స్ రోడ్ నెం.57లోని నందగిరిహిల్స్ సమీపంలో మాఫియా డాన్ అజీజ్‌రెడ్డిని ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చి చంపారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు ► కేబీఆర్ పార్కు వద్ద కాల్పుల విషయాన్ని ఇటు ప్రభుత్వం... అటు పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలీసు శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి... దర్యాప్తు వేగవంతం చేసింది. అన్నను కాపాడిన తమ్ముడు బంజారాహిల్స్: కేబీఆర్ పార్క్ వద్ద సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ప్రముఖ పారిశ్రామికవేత్త కంభం నిత్యానందరెడ్డిని ఆయన తమ్ముడు ప్రసాద్‌రెడ్డి మృత్యువు నుంచి కాపాడారు. ఆ సమయంలో ప్రసాద్ రెడ్డి రాకపోయి ఉంటే నిత్యానంద రెడ్డి పరిస్థితిని ఊహించలేమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారులో కూర్చున్న నిత్యానందరెడ్డిపై అగంతకుడు తుపాకీ గురిపెట్టి... వాహనాన్ని ముందుకు పోనివ్వాలని హెచ్చరిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అప్పుడే వాకింగ్ ముగించుకొని బయటకు వచ్చిన ఆయన తమ్ముడు ప్రసాద్‌రెడ్డి దీన్ని గమనించారు. కారులో ఏదో గొడవ జరుగుతుందని భావించిన ప్రసాద్‌రెడ్డి పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్లేసరికిఅన్న ప్రాణాపాయంలో ఉన్నారు. దీంతో వెంటనే ఆయన కారులోకి ఎక్కాడు. వెనుక నుంచి అగంతకుడిని గట్టిగా వెనక్కి విరిచిపట్టుకున్నారు. అప్రమత్తమైన నిత్యానందరెడ్డి తనవైపు గురిపెట్టి ఉన్న ఏకే 47ను పైకిలేపారు. దీంతో బుల్లెట్లు కారు ముందు అద్దం నుంచి బయటకు దూసుకుపోయాయి. ప్రసాద్‌రెడ్డి రాకపోయి ఉంటే ఆ బుల్లెట్లు నిత్యానందరెడ్డి మెడలో దూసుకుపోయి ఉండేవని పోలీసుల విచారణలోనూ వెల్లడైంది.