గేల్ సునామీతో ఇంగ్లండ్ చిత్తు
ముంబై: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పరుగుల సునామీ సృష్టించడంతో ఇంగ్లాండ్ విసిరిన 183 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 18.1 ఓవర్లలోనే చేధించింది. గేల్ వరుస సిక్స్‌లతో చెలరేగుతుంటే ఇంగ్లండ్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. గేల్‌కు సామ్యూల్స్(27 బంతుల్లో 37 పరుగులు) చక్కని సహకారాన్ని అందించాడు. ఈ క్రమంలో గేల్ కేవలం 47 బంతుల్లో (11 సిక్స్ లు, 5 ఫోర్లు) సెంచరీ సాధించడం విశేషం.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ బ్యాట్స్బెన్ రూట్ (48 పరుగులు), జాస్ బట్లర్(30 పరుగులు), టేలర్(30 పరుగులు)తో పాటు కెప్టెన్ మోర్గాన్ (27 పరుగులు) రాణించారు. విండీస్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, డేన్ బ్రేవో రెండేసి వికెట్లు తీయగా బెన్ ఒక వికెట్ తీశాడు.