breaking news
employment index
-
World Economic Forum: వచ్చే ఐదేళ్లలో నికరంగా... 1.4 కోట్ల కొలువులకు కోత
జెనీవా: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల సృష్టిలో భారీ తగ్గుదల నమోదవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫో రం (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనుండగా ఏకంగా 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని పేర్కొంది. నికరంగా 1.4 కోట్ల ఉద్యోగాలకు కోత పడుతుందని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పేరిట ఆదివారం విడుదల చేసిన ద్వై వార్షిక నివేదికలో వివరించింది. ప్రస్తుతం మొత్తం ప్రపంచ ఉద్యోగితలో ఇది 2 శాతం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగుల వలస చోటుచేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో ఇది 22 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 45 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, 27 భారీ పారిశ్రామిక క్లస్టర్లు, 800 దిగ్గజ కంపెనీల్లోని దాదాపు 67.3 కోట్ల ఉద్యోగాలపై డబ్ల్యూఈఎఫ్ విస్తృతంగా సర్వే జరిపింది. విశేషాలు... ► వచ్చే ఐదేళ్లలో సప్లై చైన్స్, రవాణా, మీడియా, వినోద, క్రీడా రంగాలకు ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉంటాయి. ► ప్రపంచవ్యాప్తంగా నూతన ఉద్యోగాల సృష్టిలో చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలదే కీలక పాత్ర. ► 75 శాతం కంపెనీలు, సంస్థలు, కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలను అందిపుచ్చుకుంటాయి. ► ఫలితంగా ఏకంగా 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు పూర్తిగా కాలదోషం పట్టనుంది. ► సమర్థ పనితీరును కొనసాగించాలంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో కనీసం ఆరుగురికి శిక్షణ అవసరమవుతుంది. ► దాంతో ఏకంగా 45 శాతం వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై హెచ్చు నిధులు వెచ్చిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వేగం గత అంచనాల కంటే తగ్గింది. ప్రస్తుతం కేవలం 34 శాతం టాస్కులు ఆటోమేషన్తో నడుస్తున్నాయి. ఇది 2020తో పోలిస్తే కేవలం 1 శాతమే ఎక్కువ. కంపెనీలు కూడా ఆటోమేషన్ అంచనాలను కుదించుకున్నాయి. తొలుత 2025 నాటికి 47 శాతం టాస్కులను ఆటోమేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా దాన్ని 2027 నాటికి కేవలం 42 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ► కృత్రిమ మేధ రాకతో బ్యాంక్ క్యాషియర్లు, క్లర్కులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి 2.6 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ► ఏఐ, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఫిన్‌టెక్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు బాగా పెరుగుతాయి. ► స్వచ్ఛ ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, సహజ వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మేనేజర్లు, విండ్ టర్బైన్ టెక్నీషియన్లు, సోలార్ కన్సల్టెంట్లు, ఎకాలజిస్టులు, పర్యావరణ స్పెషలిస్టుల వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ రంగంలో భారత్‌తో సహా టాప్ 10 దేశాలు పర్యావరణ లక్ష్యాలు చేరుకోవాలంటే కనీసం 1.2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలి. భారత్‌లో సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగ సృష్టి ► కరోనా అనంతరం భారత్‌లో విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలతో పోలిస్తే సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ ఆధారిత రంగాలకు ఉద్యోగుల వలస అత్యధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ► పర్యావరణ, సామాజిక, పాలన రంగాల్లో ఉపాధి వృద్ధి ఊపందుకుంటుందని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత కొత్త టెక్నాలజీలకు 59 శాతం, డిజిటల్ యాక్సెస్‌కు 55 శాతం, వాతావరణ మార్పులు, పెట్టుబడుల రంగాలకు 53 శాతం ఓటేశారు. ► అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకునేందుకు తమ యాజమాన్యమే అవకాశం కల్పించడం మేలని సర్వేలో పాల్గొన్న భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 97 శాతం అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వపరంగా జరగాలన్నవారు 18 శాతమే. ► ఉపాధి సృష్టిపై డేటా అనలిటిక్స్ పెను ప్రభావం చూపుతుందని 62 శాతం కంపెనీలు నమ్ముతున్నాయి. తర్వాతి స్థానాన్ని ఎన్క్రిప్షన్–సైబర్ సెక్యూరిటీ (53 శాతం), డిజిటల్ ప్లాట్‌ఫాంలు, అప్లికేషన్లు (51), ఇ–కామర్స్ (46 శాతం)కు ఇచ్చాయి. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల వలస ఏఐ, మెషీన్ లెర్నింగ్ 38% డేటా అనలిస్టులు, సైంటిస్టులు 33% డేటా ఎంట్రీ క్లర్కులు 32% ఫ్యాక్టరీ కార్మికులు 18% ఆపరేషన్స్ మేనేజర్స్ 14% అకౌంటెంట్లు, ఆడిటర్లు 5% -
కొత్త కొలువుల కళకళ...
న్యూఢిల్లీ: ఈ ఏడాది జాబ్ మార్కెట్ ఆశావహంగా కన్పిస్తోంది. ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలు జనవరిలో వరుసగా నాలుగో నెల కూడా పెరగడం ఇందుకు నిదర్శనం. దేశంలో ఆన్లైన్ జాబ్ డిమాండుకు ఓ ప్రామాణికమైన మాన్స్టర్.కామ్ ఉద్యోగ సూచీ జనవరిలో 7 పాయింట్లు (5.18 శాతం) వృద్ధిచెంది 142 పాయింట్లకు చేరింది. వరుసగా ఆరు సంవత్సరాలు దిగువముఖంలో ఉన్న రిక్రూట్మెంట్ సూచీ గతేడాది 11 శాతం పెరగడం గమనార్హం. ఐటీ (సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్), రిటైల్ రంగాల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని మాన్స్టర్.కామ్ ఎండీ సంజయ్ మోడీ తెలిపారు. ఉద్యోగ సూచీ గత అక్టోబర్ నుంచి క్రమంగా పెరుగుతోందని చెప్పారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, హెచ్ఆర్ కన్సల్టెంట్ల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నట్లు వివరించారు. ఐటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక సౌకర్యాలు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలు జాబ్ మార్కెట్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ జోరు.. మాన్స్టర్.కామ్ సూచీ పర్యవేక్షణలోని 13 నగరాలకు గాను 11 సిటీల్లో ఆన్లైన్ జాబ్ డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో దీర్ఘకాలిక అభివృద్ధి రేటు గతేడాది రెండంకెల స్థాయిలో ఉందని మాన్స్టర్.కామ్ నివేదిక పేర్కొంది. బరోడా, కోయంబత్తూరు నగరాలు మాత్రమే తిరోగమనంలో ఉన్నాయని తెలిపింది.