‘ఈటెల’కు ఎదురు ‘దెబ్బ’
- ఆయన ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం
- శంకుస్థాపన చేసినరోజే గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య
కమలాపూర్ : మండలంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుధవారం ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కమలాపూర్ పెద్ద చెరువు మత్తడిపై రూ.4 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి, శనిగరంలో రూ. కోటితో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రెండు జిల్లాలను కలిపే నడికుడ వాగుపై రూ.3.40 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
అదే రోజు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మత్తడి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంతో పాటు శనిగరంలోని శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ ధ్వంసమైన శిలాఫలకాలను పరిశీలించారు. ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి సొంత మండలంలో ఆయన ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం కావడం చర్చనీయాంశమవుతోంది.