breaking news
East and West Godavari districts
-
Odisha Train Accident: బాంబు పేలిన శబ్దం వచ్చింది
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ఘోర ప్రమాదం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఓ కుదుపు కుదిపేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రాకపోకలు చేసేవారు ఇక్కడి నుంచి ఎక్కువే కావడంతో పలువురు దిగ్బ్రమ చెందారు. శనివారం తెల్లవారేసరికి మృతుల సంఖ్య తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. ఈ ఘోర కలితో కదిలిపోయారు. కోరమాండల్‌కు రాజమహేంద్రవరం స్టేషన్లో హాల్టు ఉంది. ఇక్కడి నుంచే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు భువనేశ్వర్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూంటారు. ఈ రైలులో వెళ్లిన తమ వారెవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా, సురక్షితంగా ఉన్నారో లేదోననే ఆందోళన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పడింది. తమ బంధువులకు ఫోన్లు చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. సురక్షితంగా ఉన్నారన్న సమాచారంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను బాధితుల బంధువులెవరూ ఆశ్రయించలేదు. తూర్పు గోదావరి కలెక్టర్ కె.మాధవీలత ఇచ్చిన సమాచారం ప్రకారం.. కోరమండల్లో రాజమహేంద్రవరం వచ్చేందుకు రిజర్వేషన్ చేయించుకున్న వారు : 31 సురక్షితంగా ఉన్న వారు : 24 ఫోన్లు పని చేయక ఆచూకీ తెలియాల్సిన వారు : 7 యశ్వంత్‌పూర్ – హౌరా రైలులో వెళ్తున్న వారు : 3 (అందరూ సురక్షితం) ఉమ్మడి ‘తూర్పు’ వాసులు సేఫ్ ► తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. రాజమహేంద్రవరానికి బాధితుడు మురళీకృష్ణ విశాఖపట్నం చేరుకున్నారు. మరో ఇద్దరు ప్రయాణికులు అనూప్‌కుమార్, అనామికా కుమారి కూడా రాజమహేంద్రవరం వచ్చేశారు. ► రాజమహేంద్రవరం సీతంపేటకు చెందిన దంపతులు హరిబాబు, అన్నపూర్ణ బంధువుల ఇంట శుభకార్యానికి భువనేశ్వర్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారిద్దరూ అక్కడ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అక్కడకు రాకముందే ఈ రైలు ప్రమాదానికి గురవడంతో వారు మరో మార్గంలో రాజమహేంద్రవరం బయలుదేరారు. ► కొవ్వూరుకు చెందిన పాలెంపాటి అప్పారావుకు ఈ రైలు ప్రమాదంతో సంబంధం లేదు. అతడు కోరమండల్ ఎక్కేలోపే ప్రమాదం జరిగిపోయింది. దీంతో అతను వేరే రైలులో రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు చేరుకున్నాడు. ► కాకినాడకు చెందిన మరో వ్యక్తి కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. రాజమహేంద్రవరానికి రిజర్వేషన్ చేయించుకుని మొబైల్ నంబర్ పని చేయక ఆచూకీ తెలియని ప్రయాణికులు రాజవర్ధన్, ఆరాధ్య కుమారి, డి.ఇందిరా కుమారి, డి.లోకేష్, బి.పంజా, సుశాంత్, అభిషిక్త్ రైళ్ల రద్దుతో రద్దీ ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు శనివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ రద్దు చేశారు. దీంతో రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు ఏ రైలు వస్తే అందులో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. దీంతో రెండు గంటల పాటు రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు పూర్తి స్థాయిలో టిక్కెట్ డబ్బులు వాపసు ఇచ్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్టేషన్ మేనేజర్ గంగాప్రసాద్, సీటీఐ చంద్రమౌళి పర్యవేక్షించారు. సమగ్ర దర్యాప్తు జరపాలి ఈ రైలు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషనుకు శనివారం చేరుకున్న ఆయన అధికారులతో మాట్లాడారు. ఇక్కడి నుంచి ఎంతమంది కోరమాండల్ రైలుకు రిజర్వేషన్ చేసుకున్నారు, ఎంతమంది వివరాలు తెలిశాయి, ఆచూకీ తెలియని వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో స్టేషన్ మేనేజర్ ఎం.గంగాప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. రైల్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న దశలో ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యా లేక మానవ తప్పిదమా అనేది రైల్వే శాఖ సమగ్ర దర్యాప్తులో తేలుతుందన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో కూడా 98667 35454తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశానని చెప్పారు. కార్యక్రమంలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ మౌళీచంద్ర, డిప్యూటీ టికెట్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ ఆకుల, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, సిటీ యూత్ ప్రెసిడెంట్ పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హెల్ప్‌డెస్క్/కంట్రోల్ రూములు రైలు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో జిల్లా వాసులు ఎవరైనా ఉంటే ఈ నంబర్లలో సంప్రదించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓలు, వలంటీర్ల ద్వారా ఆయా జిల్లాలకు చెందిన వారి సమాచారం సేకరించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను కలెక్టర్లు ఆదేశించారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్: 0883 – 2420541, 2420543 సామర్లకోట రైల్వే స్టేషన్: 73826 29990 తూర్పు గోదావరి కలెక్టరేట్: 89779 35609 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్: 08856 – 293104, 293198 కాకినాడ జిల్లా కలెక్టరేట్: 1800–425–3077 కాకినాడ జిల్లా పోలీస్ కంట్రోల్ రూము: 94906 18506, 94949 33233 రద్దయిన రైళ్లు విజయవాడ – రాజమహేంద్రవరం – విజయవాడ (07459/07460) రాజమహేంద్రవరం – విశాఖపట్నం – రాజమహేంద్రవరం (07466/07467) కాకినాడ – విశాఖపట్నం – కాకినాడ (17267/17268) కాకినాడ – విజయవాడ – కాకినాడ (17258/17257) గుంటూరు – విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17239/17240) విశాఖపట్నం – విజయవాడ –విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701/22702) బాంబు పేలిన శబ్దం వచ్చింది మాది బిహార్. రాజోలు కామాక్షి కంపెనీలో పనిచేస్తున్నాను. ఇక్కడకు వచ్చేందుకు షాలిమార్‌లో కోరమండల్ ఎక్కాను. చీకటి పడుతూండగా ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చింది. బోగీ పల్టీలు కొట్టింది. ఏం జరిగిందోనని భయపడ్డాను. బయటకు వచ్చి చూస్తే రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన బోగీలు చూసి టెన్షన్ పడ్డాను. తెగి పడిన కాళ్లు, చేతులు, మొండెం భాగాలను చూస్తే కడుపు తరుక్కుపోయింది. – రాజేష్‌రామ్, రైలు ప్రమాద బాధితుడు దేవుడే కాపాడాడు నా కుమార్తెను తీసుకుని బెంగాల్‌లోని అసన్సోల్ వెళ్లాను. షాలిమార్ నుంచి రాజమహేంద్రవరం తిరిగి వచ్చేందుకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. పెద్దగా శబ్దం రావడంతో ఏమైందోనని ఆందోళన కలిగింది. బోగీలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. ఇంక బతకమేమో అనుకున్నాం. దేవుడే కాపాడాడు. ప్రమాదం నుంచి బయటపడ్డాం. మరో ట్రైన్ ఎక్కి రాజమహేంద్రవరం పయనమయ్యా. – యానాపు మురళీకృష్ణ -
గోదావరిలో సీసీ కెమెరాలు
పుష్కరాల భద్రతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లలో సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పాత్ర పోషించనుంది. ఘాట్ల వద్ద ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక సీసీ కెమెరాలు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తున్న భక్తుల్ని గుర్తించి అప్రమత్తం చేస్తాయి. దీనికి సంబంధించి అధునాతన సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని దాదాపు 258 ఘాట్లలో పుష్కరాలు జరగనున్నాయి. వీటిలో మొత్తం 250 వరకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు ‘4 జీ’ టెక్నాలజీ ద్వారా వీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని కంట్రోల్ రూమ్‌లతో పాటు రాజమండ్రిలో ఏర్పాటు చేసే మాస్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (ఎంసీసీసీ) అనుసంధానించారు. ఎంసీసీసీలో ఉండే కంప్యూటర్లలోని తెరపై ఘాట్లలో దృశ్యాలు ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. స్నానాలు చేసే భక్తులు ఎవరైనా ప్రమాదంలోపడితే అప్పటికే నిక్షిప్తమైన సమాచారం ద్వారా అది కంట్రోల్‌రూంకు తెలుస్తుంది. అక్కడి సిబ్బంది వెంటనే గస్తీ పోలీసులను అప్రమత్తం చేసి ప్రమాదాలను నివారిస్తారు. -
సర్కారుదే నిర్లక్ష్యం
♦ పుష్కరాలకు పది రోజుల ముందు హడావుడి ♦ ఆలస్యంగా కళ్లు తెరిచిన సర్కారు ♦ టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులతోనే జాప్యం ♦ ఆలస్యంగా ఫిబ్రవరి నుంచి అనుమతులు ♦ అవసరం లేని పనులూ చేపట్టిన యంత్రాంగం ♦ అసలు పనులకు బదులు ‘కొసరు’కు ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు అధికార యంత్రాంగం 11 నెలల ముందుగా పనులు ప్రారంభించి నెల రోజుల ముందుగానే పూర్తి చేసింది. ఇప్పుడు పట్టుమని పది రోజులు కూడా లేని సమయంలో పుష్కరాల ఏర్పాట్ల పనులు పూర్తి కాకపోవడానికి కారణం ఎవరు? ముమ్మాటికి ప్రభుత్వ పెద్దలదేనని అధికార యంత్రాంగం చెబుతోంది. ఆగస్టులోనే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పేరుతో కమిటీలంటూ హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు ఆ తరువాత జిల్లాల నుంచి వచ్చిన పనుల ప్రతిపాదనలను నెలలు తరబడి పక్కన పెట్టారు. సెప్టెంబర్‌లోనే ప్రతిపాదనలు వచ్చినా అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేశారు. పనులు చేయండి.. తరువాత అనుమతులిస్తామని టెండర్లను ఆహ్వానిస్తే ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు పుష్కరాలతో సంబంధం లేని పనులనూ అధికార టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పేరుతో పుష్కరాల పనులతో కలిపేశారు. అసలు పనులు పక్కకు.. ప్రధానంగా పుష్కర స్నానాలు రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, ధవళేశ్వరంలలో ఆచరిస్తారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన స్నానాలఘాట్‌లు, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ పనులతో పాటు ఆలయాలకు వెళ్లే రహదారుల నిర్మాణం చేపట్టాలి. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులూ జోడు కావడంతో అసలు పనులకు బదులు ఎమ్మెల్యేల సిఫార్సులతో మంజూరైన పనులకు జిల్లా అధికార యంత్రాంగం ప్రాధాన్యత ఇచ్చింది. ఏదో విధంగా పుష్కరాల్లో పనులు పూర్తి చేస్తే బిల్లులు పెట్టి డబ్బులు దండుకోవచ్చనే ఓ ఎమ్మెల్యే కక్కుర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. రాజమండ్రిలోని కోటిలింగాల్లో ప్రధాన పుష్కరఘాట్ల నిర్మాణ పనులను కేవలం 20 రోజుల క్రితమే ప్రారంభించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.240 కోట్ల విలువైన పుష్కర పనులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంజూరు ఇచ్చారు. కేవలం మూడు నెలల్లో ఇన్ని పనులు చేపట్టడం ఎలా సాధ్యమని జిల్లా అధికార యంత్రాంగం ప్రశ్నిస్తోంది. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట వరకు గల రహదారి నుంచే స్నానాల కోసం భక్తులు రాకపోకలు సాగిస్తారు. రూ.3కోట్ల వ్యయంతో ఆలస్యంగా చేపట్టిన ఈ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీపూర్తి కాలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 265 స్నానఘాట్ల నిర్మించాల్సి ఉండగా.. ఇందులో ఏ ఒక్కటీ పూర్తి కాలేదు. కృత్రిమ మరుగుదొడ్లను ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి ద్రాక్షారామం వర కు గల 30 కి.మీ. రహదారి అంతా ఇప్పటికీ గుంతలతో నిండి ఉంది. పుష్కర పనులకు, టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు పనులకు కలిపి మొత్తం 2,000కు పైగా పనులకు రూ.1,500 కోట్లకు అనుమతులు ఫిబ్రవరిలో మంజూరు చేశారు. అనుమతుల మంజూరులో నెలకొన్న జాప్యంతో పనులు చేపట్టడంలోనూ మరింత ఆలస్యం జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలే అనుమతులివ్వడంలో జాప్యం చేసి ఇప్పుడు అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ముందుగానే ఆదేశాలు ఇస్తే పూర్తయ్యేవి పట్టుమని పది రోజుల్లో పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించిన రూ.960 కోట్ల పనులు మినహా మిగతావి చేపట్టొద్దంటూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాలు ముందుగానే ఇచ్చి ఉంటే ఇప్పటికే పనులు పూర్తయ్యేవని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మంత్రులతో, అధికారులతో కమిటీలు వేస్తూ ప్రచారం కోసం పాకులాడటం తప్ప పనుల మీద శ్రద్ధ చూపలేదని అధికారులే పేర్కొంటున్నారు. నాసిరకంగా పనులు చేశారని, పుష్కరాల నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే ప్రణాళికను దెబ్బతీశారంటూ అధికారులపై ముఖ్యమంత్రి మండిపడటం గమనార్హం.