breaking news
ear infection
-
ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా?
'కొంతమందిని చూస్తే ఎప్పుడూ ఏ తాళం చెవో, పెన్ను రీఫిలో, పొడవుగా చుట్టిన కాగితాన్నో, ఏవీ దొరక్కపోతే చేతివేళ్లతోనో చెవిలో సంగీతం పాడిస్తుంటారు. ఈ చికాకంతా ఎందుకని చాలామంది స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేస్తుంటారు. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.' ఇంతకీ చెవి ఎలా శుభ్రం చేయాలో చూద్దాం... కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్‌ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది. అంతేకాదు, చెవిలో పెట్టిన బడ్ కర్ణభేరికి తగలవచ్చు. ఇది మరింత ప్రమాదకారి. దీనివల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు. బయటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది. శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. చెవిలోని నాళం పొడిబారకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మరి ఇయర్ వాక్స్‌ని ఏం చేయాలి? దాని జోలికి వెళ్లకుండా ఉండడమే సరి. వాక్స్ తీయడం కోసం చెవి లోపల ఇయర్ బడ్ మాత్రమే కాదు. ఇంకేమీ పెట్టక్కరలేదు. ఎందుకంటే, చెవి తనను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది. ఒకవేళ చెవిలో శబ్దాలు రావడం, నొప్పి లాంటి సమస్యలు కనిపించినా, వినికిడిలో తేడా అనిపించినా వెంటనే ఈఎన్టీ నిపుణుని కలవండి. ఇవి చదవండి: 'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా? -
గూబ గుయ్!
సాక్షి, సిటీబ్యూరో: పరిమితికి మించిన ధ్వని కాలుష్యంతో గ్రేటర్‌వాసుల గూబ గుయ్‌మంటోంది. మహానగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలున్న సున్నిత ప్రాంతాల్లోనూ శబ్ద కాలుష్యం మోతమోగుతోంది. నగరంలోని పలు సున్నిత ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో నిర్దేశిత ప్రమాణాలకంటే అధిక ధ్వని కాలుష్యం వెలువడుతోందని పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. నగరంలోని అబిడ్స్, పంజగుట్ట, జీడిమెట్ల, జూపార్క్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, మైండ్‌స్పేస్, ఎంజే మార్కెట్, అమీర్‌పేట్, కేబీఆర్పార్క్, బహదూర్‌పురా తదితర ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబుల్స్‌గా నమోదవుతోందని పీసీబీ తాజా నివేదిక స్పష్టంచేసింది. పీసీబీ ప్రమాణాల మేరకు ఆయా ప్రాంతాల్లో శబ్దాలు 50 నుంచి 60 డెసిబుల్స్‌కు మించరాదు. కానీ పరిమితికి మించి శబ్దాలు వెలువడుతుండడంతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కారణాలివే.. ♦ నగరంలో శబ్ద కాలుష్యానికి ప్రధానంగా రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్ క్రాకర్స్ కాల్చడం, లౌడ్ స్పీకర్లు, డీజే హోరు తదితర కారణాలు. ♦ ప్రధానంగా భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా రేయింబవళ్లు హారన్ల మోత మోగిస్తుండడంతో సిటీజన్లు శబ్ద కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ♦ గ్రేటర్లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు. వీటిలో 15 ఏళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు 15 లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి. ♦ గ్రేటర్లో యూత్ ప్రత్యేక గుర్తింపు కోసం అధిక శబ్దాలు వెలువడే మోడిఫైడ్ హారన్లను వినియోగించడం కూడా శ్రుతి మించుతుండడంతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ♦ గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 100 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లున్నాయి. వీటి వద్ద అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మోగుతోంది. ♦ నివాస ప్రాంతాలకు ఆనుకొని ఫంక్షన్ హాళ్లు, క్లబ్బులు, పబ్బులు నెలకొనడంతో వీటి వద్ద డీజేల హోరు.. బ్యాండ్ బాజాల మోతతో గూబ గుయ్‌మంటోంది. ♦ గ్రేటర్లో నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో బోరు బావుల తవ్వకం.. లోడర్లు.. డంపర్లు వంటి కాంక్రీట్ మిక్సింగ్ యంత్రాల వినియోగం పెరిగింది. వీటి నుంచి అధిక శబ్దాలు వెలువడుతున్నాయి. శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం.. గ్రేటర్ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు.. ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేకపోవడంతో రోగులు అధిక ధ్వనులు విని గగుర్పాటుకు గురవుతున్నారు. మహానగరం పరిధిలోని సుమారు ఐదువేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇవి కూడా దాదాపు ప్రధాన రహదారులు, ముఖ్య వీధులు, కాలనీల్లోనే ఉన్నవే. వీటిల్లోనూ శబ్ద గ్రాహకాలున్న పాఠశాలలు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉండడం గమనార్హం. కాలుష్యంతో నష్టాలు ఇలా.. ♦ వినికిడి అవధిని దాటి అధికంగా వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్ద కాలుష్యం అవధిని మించి నమోదయితే అక్కడి నివాసితులకు చెవిలో రింగు రింగుమంటూ శబ్దాలు వినిపిస్తాయి. ♦ దీర్ఘకాలం ఈ శబ్దాలను విన్నవారికి శాశ్వత వినికిడి లోపం సంభవిస్తుంది. నిద్రలేమి, అలసట, హృదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పని మీద ఆసక్తిని కోల్పోతారు. ♦ నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వారిలో వినికిడి శక్తి కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ పెంపుడు శునకాలు, పిల్లులు లాంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరి బద్దలయ్యే ప్రమాదం ఉంటుంది. ♦ 90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల కర్ణభేరిలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వృద్ధులకూ శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ♦ అత్యధిక ధ్వనులు విన్నపుడు చిన్నపిల్లల మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. ఇలా కాపాడుకోవాలి.. ♦ ప్రధానంగా పాఠశాలలు, ఆస్పత్రులను అధిక శబ్దాలను నిరోధించే జిప్సం బోర్డులు, ఫైబర్‌గ్లాస్ ఇన్సులేషన్స్తో గోడలను కప్పివేస్తే అధిక శబ్దాలు లోనికి చేరకుండా ఉంటాయి. ♦ అధిక శబ్దాలు వెలువడే ప్రాంతాల్లోని భవనాలకు విధిగా శబ్ద గ్రాహకాలు ఏర్పాటు చేయాలి. ♦ ప్రతి ఆస్పత్రి,పాఠశాల ఆవరణలో గ్రీన్‌బెల్ట్‌ను అధికంగా ఏర్పాటుచేయాలి. అధిక శబ్దాలను గ్రహించేందుకు హరిత వాతావరణం దోహదం చేస్తుందని గుర్తించాలి. గ్రీన్బిల్డింగ్ల నిర్మాణాలను ప్రోత్సహించాలి. ♦ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేధిక ప్రకారం ఏ వ్యక్తి అయిన ఎనిమిది గంటల పాటు 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ♦ అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి. ♦ ట్రాఫిక్ రద్దీలో బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి. -
సల్మాన్‌కు ఇన్ఫెక్షన్.. షూటింగుకు డుమ్మా!
కండల వీరుడు సల్మాన్‌ఖాన్ గత రెండు రోజులుగా చెవి ఇన్ఫెక్షన్, సైనసైటిస్‌తో బాధపడుతున్నాడట. ప్రస్తుతం 'బజరంగీ భాయీజాన్' సినిమా షూటింగు కోసం కాశ్మీర్లో ఉన్న సల్లూభాయ్.. గత రెండు రోజులుగా షూటింగుకు కూడా వెళ్లడం లేదట. సల్మాన్ ఖాన్ బాగా ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాడని సినిమాకు సంబంధించిన ప్రతినిధులు చెప్పారు. కాశ్మీర్లో ఈ సినిమా షూటింగు షెడ్యూలు 40 రోజులు ఉంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేశ్‌తో కలిసి సల్మాన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.