breaking news
e-Pos machines
-
Digital Payments: క్యాష్తో పనిలేకుండా.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం
సాక్షి, విశాఖపట్నం: మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. క్యాష్తో పనిలేదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేయొచ్చు. ఆర్టీసీ యాజమాన్యం యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట ఇటీవల డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇన్నాళ్లూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణించే వారు టిక్కెట్టు కోసం నగదును చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ల ద్వారా చెల్లించే వెసులుబాటునూ కల్పించింది. దీనికి ప్రయాణికుల నుంచి కూడా ఇప్పుడిప్పుడే మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజలు వివిధ కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలకు నగదు రహిత డిజిటల్ చెల్లింపులకే ఎక్కువగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం దేశంలోనే తొలిసారిగా ప్రయాణికులు బస్సుల్లో టిక్కెట్ సొమ్ము చెల్లించేందుకు యూపీఐ (డిజిటల్ చెల్లింపుల) విధానాన్ని ప్రవేశపెట్టింది. విశాఖపట్నం జిల్లాలో దీనిని గత నెల ఏడో తేదీ నుంచి అమలు చేస్తున్నారు. టిక్కెట్టు మొత్తాన్ని క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి స్వైపింగ్, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లించవచ్చన్న మాట! ప్రయాణికుల ఆసక్తి ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులకు ప్రయాణికులు ఇప్పు డిప్పుడే ఆకర్షితులవుతున్నారు. తొలుత బస్సుల్లో డ్రైవర్లు/కండక్టర్లు డిజిట ల్ చెల్లింపుల సదుపాయం ఉందన్న విషయాన్ని ప్రయాణికులకు వివరి స్తున్నారు. అవకాశం, ఆసక్తి ఉన్న వారు చెల్లిస్తున్నారు. లేనివారు ఎప్పటిలాగే నగదు ఇచ్చి టిక్కెట్టు తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు జరుపుతున్న వారి సంఖ్య 10 శాతం ఉందని, క్రమంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 97 బస్సుల్లో అమలు.. విశాఖ జిల్లాలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)కు 704 ఆర్టీసీ బస్సులు న్నాయి. తొలుత దూరప్రాంతాలకు నడిచే 97 ఎక్స్‌ప్రెస్, ఆపై (డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, గరుడ, అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ తదితర) సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చారు. 580కి పైగా ఉన్న సిటీ బస్సుల్లో దశల వారీగా డిజిటల్ సేవలను ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ చెల్లింపులు జరిపే ఈ–పోస్ యంత్రం మరిన్ని ప్రయోజనాలు.. ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులే కాదు.. మున్ముందు మరిన్ని సదుపా యాలు పొందే వీలుంది. ఇప్పటివరకు బస్సు కదిలే సమయానికి రిజర్వేషన్ చార్టును కట్ చేసి డ్రైవర్/కండక్టర్‌కు ఇస్తున్నారు. దీంతో ఆ తర్వాత ఆ బస్సులో రిజర్వేషన్ ద్వారా సీటు పొందే వీలుండదు. ఇక మీదట చార్టు క్లోజ్ అయ్యే పనుండదు. ఈ–పోస్ యంత్రాల్లో అమర్చిన సాంకేతికతతో బస్సు నడుస్తుండగా ఖాళీ సీట్లను ముందు స్టేజిల్లో ఎక్కే వారు తెలుసుకుని రిజర్వేషన్ చేసుకోవచ్చు. లేదా ఏటీబీ (ఆథరైజ్డ్ టిక్కెట్ బుకింగ్) ఏజెంట్లు, బస్సులో కండక్టర్/డ్రైవర్ కేటాయించవచ్చు. డిజిటల్ చెల్లింపుల విధానంతో ప్రయాణికులు, కండక్టర్లను ఎప్పట్నుంచో వేధిస్తున్న చిల్లర సమస్యకు పరిష్కారం లభించినట్టయింది. టిమ్స్ స్థానంలో ఈ–పోస్ మిషన్లు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల జారీకి టిమ్స్ యంత్రాలను వినియో గిస్తున్నారు. ఇకపై వాటి స్థానంలో డిజిటల్ చెల్లింపులకు వీలుగా ఈ–పోస్ మిషన్లను సమకూరుస్తున్నారు. ఇలా విశాఖ జిల్లాకు ఇప్పటివరకు 180 ఈ–పోస్ మిషన్లు వచ్చాయి. వీటి వినియోగంపై డ్రైవర్లు, కండక్టర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. ప్రయాణికుల్లో ఆసక్తి.. డిజిటల్ పేమెంట్ సదుపాయం గురించి ప్రయాణికులకు చెబుతున్నాం. దీంతో వారూ ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. అవకాశం ఉన్న వాళ్లు దీన్ని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత టిమ్స్కంటే ఈ–పోస్లతోనే టిక్కెటింగ్ సులువుగా ఉంది. కొన్నిసార్లు నెట్ కనెక్ట్ కాక యూపీఐ, కార్డు పేమెంట్లు జరగడం లేదు. మున్ముందు ఆ సమస్య తలెత్తదని భావిస్తున్నాం. – ఆర్.టి.నాథం, ఆర్టీసీ డ్రైవర్, విశాఖపట్నం. ఎంతో సౌలభ్యంగా ఉంది.. ఇప్పుడు చాలామంది తమ అవసరాలకు డిజిటల్ పేమెంట్లే జరుపుతు న్నారు. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుల విధానం ఎంతో సౌలభ్యంగా ఉంది. నగదు చెల్లించి టిక్కెట్టు తీసుకోవడంతో తరచూ చిల్లర సమస్య తలెత్తుతోంది. ఇకపై చిల్లర సమస్యకు చెక్ పడుతుంది. సాంకేతిక సమస్యలను అధిగమిస్తే మరింత ఆదరణ పెరుగుతుంది. – పి.రమేష్‌నాయుడు, ప్రయాణికుడు, శ్రీకాకుళం. దశల వారీగా అన్ని బస్సుల్లో.. ప్రస్తుతం జిల్లాలో 97 బస్సుల్లో డిజిటల్ చెల్లింపులకు వీలుగా ఈ–పోస్ మిషన్లను ప్రవేశపెట్టాం. వీటికి ప్రయాణికుల నుంచి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. దశల వారీగా సిటీ బస్సులు సహా అన్ని బస్సుల్లోనూ అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే వీటి వినియోగంపై డ్రైవర్/కండక్టర్లకు శిక్షణ ఇచ్చాం. ఈ–పోస్ యంత్రాల్లో టిక్కెట్ల జారీలో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా అవి తాత్కాలికమే. –ఎ.అప్పలరాజు, జిల్లా ప్రజారవాణా అధికారి, విశాఖపట్నం -
ఈ-పోస్.. ఓ ఫార్సు
పోర్టబులిటీతో తంటాలు ఉదయం పూట సర్వర్ బీజీ గంటల తరబడి కార్డుదారుల పడిగాపులు కూలీల బాధలు వర్ణణాతీతం గాంధీనగర్ : పౌరసరఫరాల శాఖలో ఏర్పాటు చేసిన ఈ-పోస్ యంత్రాలు కార్డుదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. విద్యుత్ లేకపోయినా, సర్వర్ బిజీగా ఉన్నా, వేలిముద్రలు నమోదుకాకున్నా గంటలతరబడి సరకుల పంపిణీ నిలిచిపోయి కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపులు పనిచేయాలి. అయితే కార్డుదారుల్లో కూలీలే ఎక్కువమంది కావడంతో ఉదయాన్నే షాపులకు వెళ్తున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముందుగా వేలి ముద్రలు సేకరించి, సరకులు పంపిణీచేస్తారు. అయితే వేలి ముద్రల గుర్తింపులోనే ఎక్కువ జాప్యం జరుగుతోంది. వేలిముద్రలు పడకపోతే ఎదురుచూపులు తప్పడంలేదు. పోర్టబులిటీతో తంటాలు దశాబ్దాల కాలంగా కార్డుదారులు తమకు కేటాయించిన షాపుల్లో సరకులు తీసుకెళ్లారు. ఈ-పోస్ విధానంలో కార్డుదారు తనకు సమీపంలోని ఏ రేషన్‌షాపు నుంచైనా సరకులు పొందేలా పోర్టబులిటీ సౌకర్యం కల్పించారు. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. రేషన్‌షాపులకు కార్డుల సంఖ్య ఆధారంగా సరకులు కేటాయిస్తున్నారు. పోర్టబులిటీని ఉపయోగించుకుని ఇతర దుకాణాల పరిధిలోని లబ్ధిదారులు ముందుగా ఎవరైనా సరకులు తీసుకెళ్తే ఆ మేరకు స్టాకు తగ్గిపోతుంది. తర్వాత వచ్చే కార్డుదారులు ఇతర దుకాణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా వెళ్లేందుకు ఇష్టపడని లబ్ధిదారులు డీలర్లతో వాదనకు దిగుతున్నారు. శివారు గ్రామాల ప్రజల బాధలు వర్ణణాతీతం శివారు ప్రాంతా గ్రామాల ఈ-పోస్ విధానానికి ముందు నాలుగైదు కుటుంబాల నుంచి ఒకరో ఇద్దరో వాహనంపై వెళ్లి అందరి సరకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒకరు కచ్చితంగా వెళ్లాల్సి వస్తోంది. అవినీతి నిరోధించాల్సిన మాట వాస్తవమే అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా ఈ విధానం ప్రవేశ పెట్టడం వల్ల రోజూ కూలి చేసుకునే కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వీరులపాడు మండలం రంగాపురం కార్డుదారులు సరకుల కోసం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుజ్జూరు గ్రామానికి వెళ్లాలి. అటవీప్రాంతంలోని తిమ్మాపురం వాసులు 6కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురం వెళ్లాలి. జయంతి బీసీ కాలనీ వాసులు రేషన్‌దుకాణానికి వెళ్లాలంటే 2కిలోమీటర్ల నడవాల్సిందే. చాట్రాయి మండలం పిట్టల వారిగూడెం కార్డుదారులు కిలోమీటర్ దూరంలో ఉన్న నరసింహారావుపాలెం వెళ్లాల్సి వస్తోంది. ఇదే మండలం జగన్నాథపురం వాసులు సోమవారం 2.5కిలోమీటర్లు, కరుణాపురం వాసులు సూరంపాలెం 2కిలోమీటర్లు వెళ్లక తప్పదు. జి.కొండూరు మండలం సాల్మన్‌రాజు నగర్ వాసులు 1.5కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గిరాలపాడు గ్రామానికి వెళ్లాలి. ఇవిగో సమస్యలు జూలై నెలలో విజయవాడలోని ఓదుకాణానికి చెందిన కార్డుదారులు పోర్టబులిటీ ఉపయోగించుకుని మరో దుకాణంలో సరకులు పొందారు. సదరు షాపు పరిధిలోని కార్డుదారులు వెళ్లేసరికే స్టాకు నిండుకుంది. వేరే దుకాణానికి వెళ్లాలని డీలర్ సూచించడంతో కార్డుదారులు గొడవకు దిగారు. పోనీ స్టాకు ఇవ్వాలని డీలర్ కోరితే అధికారులు ఇవ్వడంలేదు. అద్దె ఇళ్లలో నివసించేవారు తరచూ ఇల్లు మారుతుండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. సిగ్నల్ లేదని తిప్పుతున్నారు ఒకటో తారీకు నుంచి నాలుగురోజులుగా తీరుగుతున్నా రేషన్ దొరకలేదు. వేలిముద్రలు సరిగా పడడంలేదని, సర్వర్ పనిచేయడంలేదని, సిగ్నల్ అందడంలేదని డీలర్ రోజూ తిప్పించుకుంటున్నాడు. కొన్ని సమయాల్లో కరెంటు పోతే ఎదురుచూడక తప్పడంలేదు. ఈ మిషన్లు పెట్టినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నాం. పనులు మానుకోవాల్సి వస్తోంది. - ధనలక్ష్మి, గృహిణి