breaking news
E Damodar
-
మాజీ సీఎంలకు మినహాయింపు లేదు
సాక్షి, అమరావతి: విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీల్లో మాజీ ముఖ్యమంత్రులకు మినహాయింపులేదని, చంద్రబాబును తనిఖీ చేయడంపై వాస్తవాలు తెలుసుకోకుండా రాద్ధాంతం సరికాదని ఐపీఎస్ అధికారి, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఐజీ ఇ.దామోదర్ చెప్పారు. ఈ విషయమై ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను మూడున్నరేళ్లు ఏవియేషన్ వీఐపీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసిన అనుభవంతో ఏవియేషన్ సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) చికాగో కన్వెన్షన్‌లోని 17వ అనుబంధం ప్రకారం సభ్యదేశాలు అన్నీ నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఐరాస సభ్య దేశమైన భారత్‌లో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. స్వతంత్ర సంస్థ అయిన స్టాండర్డ్స్ అండ్ రికమండెడ్ ప్రాక్టీసెస్ (ఎస్ఏఆర్పీఎస్) నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలకు 36/2005 సర్క్యులర్ కూడా జారీ అయిందని గుర్తు చేశారు. దీనిలో మాజీ ముఖ్యమంత్రులకు, జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన వారికీ కూడా విమానాశ్రయాల్లోకి ప్రవేశించే ముందు తనిఖీల నుంచి మినహాయింపు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఆమె కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసి మాజీ ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన తనిఖీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినా ఫలితం లేదని చెప్పారు. బీసీఏఎస్ తరహాలోనే నిబంధనలు పాటించే అమెరికాలోని ట్రాన్స్‌పోర్టు సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) నిబంధనల మేరకు అక్కడి విమానాశ్రయంలో గతంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంను తనిఖీ చేశారని వివరించారు. అమెరికాలోని టీఎస్ఏ నిబంధనల ప్రకారం కేబినెట్ సెక్రటరీ అయినా, అమెరికాకు చెందిన అత్యున్నత మిలట్రీ అధికారులైనా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదని చెప్పారు. అలాగే మన దేశంలోని ఏ విమానాశ్రయంలోనైనా నిబంధనల ప్రకారం సోదాలు జరుగుతాయన్నారు. విమానాల సొంత యజమానులు అయినా, ప్రైవేటు ఆపరేటర్లు అయినా లోపలికి వెళ్లే ప్రతీసారి సీఐఎస్ఎఫ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేస్తారన్నారు. నిబంధనల ప్రకారం సోదాలు చేసిన గన్నవరం విమానాశ్రయంలోని సిబ్బందిని అభినందించాల్సిందిపోయి దాన్ని రాద్ధాంతం చేయడం అవగాహనలేమే అవుతుందన్నారు. మీడియా సైతం వాస్తవాలను గమనించి ప్రచారం చేయాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలు సరికాదని ఐజీ దామోదర్ సూచించారు. -
సారా మాఫియాకు అడ్డాగా రాజమండ్రి
రాజమండ్రి క్రైం : రాజమండ్రి సారా మాఫియాకు అడ్డాగా ఉందని, పుష్కరాల నాటికి ఈ ప్రాంతంలో సారాను నిర్మూలిస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ జనరల్ ఇ.దామోదర్ అన్నారు. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను రోజూ 13 జిల్లాల వార్తలూ చదువుతానని, ఎక్కువగా రాజమండ్రిలో సారా వ్యాపారం గురించే వార్తలు వస్తున్నాయని, ఎక్కడాలేనంతగా ఈ నగరంలో భారీగా సారా వ్యాపారం జరుగుతోందని అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. రాజమండ్రిపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఇక్కడ మాఫియా ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. నిత్యం దాడులు చేసి కేసులు పెడుతున్నా.. దీనిని అరికట్టలేకపోతున్నామని, అదుపులోకి తీసుకున్నవారిపై సక్రమంగా కేసులు పెట్టకపోవడమే దీనికి కారణమని, ఇందులో తమశాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. తమ సిబ్బంది మామూళ్లకు కక్కుర్తిపడి బడా తయారీదారులను వదిలేస్తున్నట్టు కూడా తమ వద్ద సమాచారం ఉందన్నారు. 500 మందితో 20 బృందాలు ఈ నెల 3న జిల్లాకు వచ్చిన తాను మూడు రోజుల పాటు పర్యవేక్షించి.. ఈ ప్రాంతంలో సారా ఎక్కడ నుంచి వస్తుంది... ఏ విధానంలో అమ్మకందారులకు చేరుతోందన్న అంశాలను పరిశీలించినట్టు చెప్పారు. దీనికోసం అంకితభావంతో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆదివారం తెల్లవారు జామున రాజమండ్రి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో దాడులు చేశామని, దీని కోసం పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ జిల్లాల ఎక్సైజ్ సిబ్బందిని రప్పించామని పేర్కొన్నారు. అలాగే పోలీసు, ఇంటిలిజెన్స్ సహకారం కూడా తీసుకున్నట్టు వివరించారు. మొత్తం 500 మందితో 25 మంది చొప్పు 20 బృందాలుగా విడిపోయి డివిజన్ పరిధిలోని 25 ప్రధాన ప్రాంతాల్లో దాడులు చేసినట్టు వెల్లడించారు. 30 మందిని అరెస్టు చేసి, 9 వాహనాలు, 552 లీటర్ల నాటు సారా, 70 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామని, 5,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని తెలిపారు. 40 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. ఇందుకు తమ సిబ్బందే కారణమని, తాము దాడులకు వస్తున్నట్టు తమ సిబ్బంది మాఫియా లీడర్లకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, వారి ఫోన్ నంబర్ల డేటా ఆధారంగా సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరించారు. రాజమండ్రిలో గతంలో సారా మాఫియా కోటిలింగాలపేటలో ఇద్దరు కానిస్టేబుళ్లను చంపిన కేసు నీరు గారిపోవడానికి, అలాగే ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్‌పై ఒక మహిళ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేందుకు కూడా తమ శాఖలోని సిబ్బందే సహకరించారని గుర్తుచేశారు. పుష్కరమ్ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్ పుష్కరాల నాటికి సారాను సమూలంగా నిర్మూలించేందుకు ‘పుష్కరమ్ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్’ను సిద్ధం చేస్తున్నట్టు దామోదర్ తెలిపారు. ఈ గ్రూప్‌లో ఎవరు ఉండాలనే విషయంపై జాబితా తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. సారా నిర్మూలించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించినట్టు వివరించారు. చైన్ లింక్డ్ కేసులు సారా కేసుల నమోదులో ఇకపై భిన్నంగా వ్యవహరించనున్నట్టు వివరించారు. గ్రామాల్లో విక్రయదారులు, వారికి రవాణా చేసేవారు, తయారీదారులు, ముడిసరకు విక్రయించే వారందరిపైనా లింక్ కేసులు నమోదు చేస్తామన్నారు. కేసుల నమోదులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. కేసులు ఎలా పెట్టాలో తమ సిబ్బందికి హైదరాబాద్‌లో రెండు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇక సారా మహమ్మారి గురించి అవగాహన కల్పించడంతోపాటు రిహాబిటేషన్ ప్యాకేజీలు ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. అనంతరం తనకు సహకరించిన జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, లా అండ్ ఆర్డర్ మధ్య మండల డీఎస్పీ జె. కులశేఖర్‌ను అభినందించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.అనిల్‌కుమార్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.