పన్ను ఎగవేతల నిరోధంలో ముందడుగు
డీటీఏసీ సవరణ ఒప్పందంపై భారత్-మారిషస్ సంతకాలు
న్యూఢిల్లీ: ద్వంద్వ పన్ను నివారణా ఒప్పందం (డీటీఏసీ) సవరణ ఒప్పందంపై భారత్-మారిషస్ సంతకాలు చేశాయి. మారిషస్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ భారత్ రెసిడెంట్ కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా పొందే క్యాపిటల్ గెయిన్‌పై పన్ను విధించే అవకాశం భారత్‌కే లభిస్తుండడం ఈ ఒప్పందంలో ప్రధానాంశం. 2017 ఏప్రిల్ 1 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం 2019 మార్చి వరకూ వర్తించే రేటులో 50 శాతం క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధిస్తారు. అటు తర్వాత పూర్తి స్థాయి కేపిటల్ గెయిన్ ట్యాక్స్ అమలవుతుంది. మారిషస్ కేంద్రంగా దేశంలో పెట్టుబడులు పెట్టే ఇతర దేశాల కంపెనీలు, ఇన్వెస్టర్లకు కాకుండా...
మారిషస్ కంపెనీలకు మాత్రమే డీటీఏసీ ప్రయోజనాలు లభించేలా సవరిత చట్టం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వివరించింది. 1983 ఒప్పందంలోని లొసుగుల వల్ల పలు భారత కంపెనీలు సైతం దేశీయంగా పన్నులను ఎగవేయడానికి మారిషస్‌ను ఎంచుకుంటున్నారని, మారిషస్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి... ‘ఫారిన్ ఇన్వెస్ట్మెంట్’ రూపంలో ‘ఫండ్స్ రౌండ్ ట్రిప్పింగ్’కు పాల్పడుతున్నాయని విమర్శలు ఉన్నాయి.
ఇప్పటివరకూ మారిషస్‌లో రిజిస్టర్‌అయిన కంపెనీలు భారత్‌లో ఆస్తుల అమ్మకంపై క్యాపిటల్ గెయిన్స్‌పై మారిషస్‌లోనే పన్నులు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ ఈ పన్ను దాదాపు జీరో శాతంగా ఉంది. షార్ట్‌టర్మ్ కేపిటల్ గెయిన్స్ విషయంలో మాత్రం 10 శాతం పన్ను భారత్‌లో చెల్లిస్తే సరిపోతుంది. పన్ను ఎగవేయడానికి వీలుగా ఇన్వెస్టర్లు ఇక్కడ పథక రచన చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను అంశాల్లో తాజా ఒప్పందం ఒక స్పష్టత తీసుకువస్తుందని ప్రభుత్వం పేర్కొంది.