breaking news
Drip Facility
-
పట్టు రైతులందరికీ డ్రిప్
మడకశిర : పట్టురైతులందరికీ దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పించాలని తమ శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ కమిషనర్ వి.ఉషారాణి తెలిపారు. అది కూడా ఏపీఎంఐపీ నియమనిబంధనల ప్రకారం కాకుండా పట్టుపరిశ్రమ శాఖ నియమనిబంధనల ప్రకారం మంజూ రు చేస్తామని తెలిపారు. గురువారం మడకశిరలోని శ్రీయాదవ కల్యాణమంటపంలో కేంద్ర పట్టుమండలి, రాష్ట్ర పట్టుపరిశ్రమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టురైతు సమ్మేళనాన్ని కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్‌తోపాటు హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు. కమిషనర్ ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు అవుతోందన్నారు. ఇంత వరకు అందులో 10వేల ఎకరాలకు మాత్రమే డ్రిప్ సౌకర్యం ఉందన్నారు. మిగిలిన 20వేల ఎకరాలకు రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకాస్ట్ రేషం షెడ్ల నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం తమ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిపారు. పట్టు రైతులకు అనుకూలంగా ఉంటే లోకాస్ట్ షెడ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పట్టు రైతుల అభివృద్ధికి ప్రస్తుతం రూ.2కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో పట్టు రైతుల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలను చేపడతామన్నారు. డ్రిప్ సౌకర్యానికి వందశాతం సబ్సిడీ ఇస్తే ఈ కార్యక్రమం విజయవంతం కాదన్నారు. ఏ పథకమైనా రైతుల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతుందని తెలిపారు. పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తే ధర కూడా ఆశించిన స్థాయిలో లభిస్తుందన్నారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో తక్కువ నీటితో మల్బరీ సాగు చేస్తే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందన్నారు. చదువుకున్న రైతులు వ్యవసాయం వైపు దృష్టిపెడితే నష్టాలు తగ్గడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర పట్టుమండలి డెరైక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పట్టు రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని పట్టుగూళ్ల ఉత్పత్తిలో అధిక దిగుబడి సాధించాలని కోరారు. హిందూపురం ఎమ్పీ నిమ్మల క్రిష్టప్ప మాట్లాడుతూ ప్రోత్సహిస్తే మన దేశంలో చైనా, జపాన్ల కన్నా పట్టుపరిశ్రమ మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి పెరిగినా పట్టుగూళ్ల నాణ్యత మెరుగుపడాలన్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ మన దేశంలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం విధానం తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన జపాన్ దేశస్తులు కూడా వస్తుండటం మనకు గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే ఈరన్న మాట్లాడుతూ పట్టు రైతులకు ప్రస్తుతం అందిస్తున్న సబ్సిడీని మరింత పెంచాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్రపట్టుమండలి జాయింట్ డెరైక్టర్ సత్యనారాయణరాజు, పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డెరైక్టర్ అరుణకుమారి, స్థానిక అసిస్టెంట్ డెరైక్టర్ శషాంక్రెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ శాస్త్రవేత్తలు, కేంద్ర పట్టుమండలి, పట్టుపరిశ్రమశాఖ అధికారులు, జపాన్ బృందం, నియోజకవర్గంలోని పట్టు రైతులు పాల్గొన్నారు. -
మామిడికి ఇదే అదను
సాగుకు ప్రోత్సాహం మామిడి సాగులో ఒక్కో మొక్కకు రోజుకు 50 పైసల చొప్పున నెలకు రూ.15 ఇస్తారు. ఎకరంలోని 70 మొక్కలకు నెలకు రూ.1,050 చొప్పున మూడేళ్ల పాటు సంవత్సరానికి రూ.12,600 అందజేస్తారు. ఆ తరువాత తోట కాపునకు వచ్చి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని సీటీఏ తెలిపారు. చెట్లు పెరిగినా కొద్ది కాత అధికమై ఆదాయం పెరుగుతుందన్నారు. ఎవరు అర్హులు..? జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్, ఇందిరజలప్రభ పథకాల కింద పండ్ల తోటలను సాగు చేయాలనుకునే వారికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి. పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండాలి. 5 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. మెట్ట భూముల్లో, నీటి వసతి గల బోర్ల వద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. ఉపాధి హామీ,ఉద్యానవన శాఖ నుంచి ఎటువంటిలబ్ధిపొందని వారు మాత్రమే అర్హులు. తోటలు పెట్టే ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీపై, ఇతరులకు తొంభై శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం అందిస్తారు. నేల తయారీ... నీరు నిలవని సారవంతమైన నేలలు మామిడికి సాగుకు అనుకూలం. చౌడు నేలలు పనికిరావు. భూమిని రెండు మూడు సార్లు బాగా కలియదున్నాలి. మొక్కలు నాటడానికి 3,4 వారాల ముందే మూడు ఫీట్ల లోతు, వెడల్పుతో 7.5మీటర్ల విడిది ఉండేలా గుంతలను తవ్వాలి. మొక్కలు నాటేముందు ఒక్కో గుంతలో 50 కేజీల ఎండిన పశువుల ఎరువు, చెదలు పట్టకుండా 2 కేజీల సింగిల్ సూపర్ పాస్పేట్, 100 గ్రాముల పారిడీల్పొడిని మట్టిలో కలిపి మొక్కను పాతుకోవాలి. ఎకరాకు 70 మొక్కలను నాటాలి. ఈ రకాలు మేలు జిల్లాలో ఎక్కువగా మల్లిక రకం మొక్కలను సాగుచేస్తున్నారు. అక్కడక్కడ బేనిషాన్, ఖాదిరి, దసిరి రకాల తోటలు కూడా నాటుతున్నారు. మేలైన రకాల కోసం ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదిస్తే మేలు. సూక్ష్మపోషక లోపాల నివారణకు మొక్కల ఎదుగు దశలో సూక్ష్మపోషక లోపాల నివారణకు ఏడాదికి 2-3 సార్లు జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో లేదా మొక్కలు కొత్తచిగుళ్లు తొడుగుతున్న దశలో లీటరు నీటిలో 3-5 గ్రాముల మల్టీప్లెక్స్ మందును కలిపి 2-3 సార్లు మొక్కలపై పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యం మొక్కలు నాటిన వెంటనే ఒకటిన్నర పాదువేసి నీరు ఇవ్వాలి. వర్షాలు లేకుంటే 6 నెలల వరకు క్రమం తప్పకుండా 3-4 రోజులకోసారి నీరు పెట్టాలి. 2-3 సంవత్సరాల వరకు మొక్కను భద్రంగా కాపాడాలి. డ్రిప్పు ద్వార నీరు ఇచ్చినప్పుడు కాలాన్ని బట్టి రోజుకు 8-13 లీటర్ల మేర నీరందేలా చూడాలి. కత్తిరింపులు మొక్కలు నాటిన మొదటి సంవత్సరం మొక్క కాండం మీద 50 సెంటీమీటర్ల వరకు ఎటువ ంటి కొమ్మలు రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలి. మొక్క 60-90 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ప్రధాన కాండం చివరను కత్తిరించి 2-3 బలమైన కొమ్మలను ఎంచుకుని పెరగనివ్వాలి. మిగిలిన వాటిని కత్తిరించాలి. పక్క కొమ్మలు 80-90 సెంటీమీటర్లు పెరిగాక రెండోసారి కత్తిరించి రెండో దశలోనూ బలంగా ఉన్న రెండుమూడు కొమ్మలను ఉంచాలి. మూడో దశలోనూ కొమ్మలను కత్తిరించి చెట్లు గొడుగు ఆకారంలో పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అంతర పంటలతో అదనపు ఆదాయం మామిడిలో అంతర పంటలను సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. తీగ జాతికి చెందిన కాకర, బీర, సోర, దోస, ఉల్లి, బీన్స్, క్యాజేజీతోపాటు పప్పు దినుసులైన పెసర, మినుమును అంతర పంటలు గా సాగు చేసుకోవచ్చు. శమ్నాపూర్‌కు చెందిన మహిళా రైతు భాగమ్మ తనకున్న మూడెకరాల్లో మామిడి తోట సాగు చేసింది. దీనిలో అంతర పంట లుగా కాకర, దోస, బీర పండిస్తోంది. దీని కోసం రూ.20వేల పెట్టుబడి అవుతోందని తెలిపింది. ఇవిపోనూ తనకు ఏటా రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని చెప్పింది.