breaking news
Dr. Lakshman
-
రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి!
♦ మూడు నాలుగు రోజుల్లో నియామకం! ♦ తెరపైకి డాక్టర్ లక్ష్మణ్ పేరు ♦ ఆశావహుల్లో రామచందర్‌రావు, లక్ష్మీనారాయణ ♦ నేరుగా నియమించనున్న జాతీయ కమిటీ సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర విభాగానికి కొత్త సారథిని నియమించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. మూడు నాలుగు రోజుల్లో ఈ నియామకం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21లోగా దేశంలోని సగం రాష్ట్రాలకు పైగా అధ్యక్షులను నియమించాలని... అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర పార్టీకి కూడా కొత్త సారథిని పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. నాలుగు నెలల కిందే బీజేపీ రాష్ట్ర విభాగం సంస్థాగత ఎన్నికలు పూర్తికావాల్సి ఉన్నా... వివిధ కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. అయితే తాజాగా జాతీయ స్థాయిలో పార్టీకి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు కోసం.. పార్టీ అధిష్టానం వెంటనే నేరుగా రాష్ట్ర కమిటీకి సారథిని నియమించే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీలో కీలక నేతలు, సీనియర్ల నుంచి అధిష్టానం నేతలు అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మూడు నాలుగు రోజుల్లో నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. తెరపైకి లక్ష్మణ్ పేరు... బీజేపీ రాష్ట్ర సారథిగా డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న లక్ష్మణ్.. చాలా సీనియర్, పార్టీకి విధేయుడు కావడంవల్ల జాతీయ నాయకత్వం ఆయనవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీంతోపాటు రెండు సార్లు వరుసగా అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి ఇతర అవకాశాలు కల్పించడానికి కూడా ఇదే మార్గమని అధిష్టానం భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోం ది. లక్ష్మణ్‌కు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని, కిషన్‌రెడ్డిని శాసనసభాపక్ష నాయకుడిని చేయాలనే ప్రతిపాదనను పరిశీలి స్తున్నట్లు పార్టీ ముఖ్యనేతల ద్వారా తెలిసింది. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి లక్ష్మణ్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ... ప్రస్తుత బాధ్యతల్లోనే కొనసాగుతానని, కొత్త బాధ్యతలను నిర్వర్తించలేనని చెప్పినట్లు సమాచారం. బాధ్యతలను స్వీకరించడానికి లక్ష్మణ్ ముందు కు రాకుంటే.. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు పేరును జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయవాదిగా, వివిధ ఉద్యమాల్లో క్రియాశీల నేతగా, జిల్లాల్లోని క్షేత్రస్థాయి నేతలతో సంబంధాలు కలిగిన కొత్త ముఖంగా రామచందర్‌రావు పార్టీకి ఉపయోగపడతారనేది వారి భావన. రాష్ట్ర పార్టీలో రామచందర్‌రావుకు వ్యతిరేకులెవరూ లేకపోవడం అదనపు అర్హత. పార్టీలోని అన్నివర్గాలను సమన్వయం చేసుకుని పనిచేస్తారనే విశ్వాసం కూడా రాష్ట్రపార్టీలో ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత యెండల లక్ష్మీనారాయణ పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా యెండల అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్టు కీలకనేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నాయకుడిగా యెండల లక్ష్మీనారాయణకు పేరుంది. దీనితోపాటు హైదరాబాదేతర జిల్లాలకు చెందిన నాయకుడికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం కూడా లక్ష్మీనారాయణకు ప్రయోజనకరం అయ్యే అవకాశముంది. వీరితోపాటు నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాజేశ్వర్‌రావు వంటివారు కూడా రాష్ట్ర పార్టీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. -
ఏకమొత్తంగా రుణమాఫీ
- సభలో విపక్ష సభ్యుల పట్టు - రైతులకు భరోసా ఇవ్వాలి - ప్రైవేటు రుణాలను రీషెడ్యూలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని మంగళవారం ఈ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పలు పార్టీల ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రైతు రుణాలను విడతలవారీగా కాకుండా ఒకేసారి మాఫీ చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని డాక్టర్ లక్ష్మణ్ (బీజేపీ) డిమాండ్ చేశారు. ప్రైవేటు రుణాలను కూడా రీషెడ్యూలు చేయాలన్నారు. ‘‘రుణాలను ఒకేసారి మాఫీ చేయడమే గాక మళ్లీ రుణం పొందేందుకు వీలుగా రైతులకు సర్టిఫికెట్లు అందజేయాలి. కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కంపెనీలకు వంత పాడొద్దు. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న అప్పులను బ్యాంకుల ద్వారా చెల్లించేలా చూడాలి. పెంచిన పరిహారాన్ని 2014 జూన్ 2 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటంబాలన్నింటికీ వర్తింపజేయాలి. మున్ముందు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలి తప్ప చనిపోయిన రైతుల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదు’’ అన్నారు. 147 మంది మహిళా రైతులు చనిపోయారు: పాయం రాష్ట్రం వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు కొనసాగితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. 2013 జూలై-2015 ఏప్రిల్ మధ్యే ఏకంగా 1,037 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదికలున్నాయన్నారు. ‘‘తెలంగాణలో గత 22 నెలల్లో సగటున నెలకు 47 మంది చనిపోయారు. 2013 జులై-డిసెంబర్ మధ్య 290 మంది, 2014 జనవరి-డిసెంబర్ మధ్య 660, 2015 జనవరి-ఏప్రిల్ మధ్య 87, ఆ తరువాత నుంచి ఇప్పటివరకు 409 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో మెదక్ జిల్లాలోనే 187 మంది చనిపోయారు. 147 మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. చనిపోయిన అందరు రైతుల కుటుంబాలకూ పరిహారం చెల్లించాలి. ఒకేసారి రుణమాఫీ చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. రుణాలను రీ షెడ్యూలు చేసి రైతులకు ధైర్యం కల్పించే చర్యలు చేపట్టాలి. తొలి విడత రుణమాఫీయే ఇంకా చాలా మంది అందలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి. వారిని ఆదుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.12 వేల కోట్ల రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేశారు. రాష్ట్రంలో ఏకంగా 401 మండలాల్లో కరువు నెలకొంది. వాటిని వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి ఆదుకోవాలి. నియోజకవర్గానికో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి’’ అన్నారు. ఆత్మహత్యలు, కరువు, రుణమాఫీలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవన్నీ సర్కారీ హత్యలే: సున్నం రైతు ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని సున్నం రాజయ్య (సీపీఎం) అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలే ఇందుకు కారణమని దుయ్యబట్టారు. ‘‘ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికులు కౌలు, మహిళా రైతులే. రైతుల ఆత్మహత్యలను చులకనగా, హేళనగా చూడటం వల్ల వారిలో మరింత ఆందోళన నెలకొంది. ఆత్మహత్యల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలి. కరువు మండలాలను ప్రకటించాలి. ప్రత్యామ్నాయ పంటల పథకం అమలు చేయాలి. బాధిత కుటుంబాలన్నింటికీ రూ.6 లక్షలు చెల్లించాలి. కౌలు రైతుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. మార్కెట్, దళారుల దోపిడిని అరికట్టాలి’’ అని డిమాండ్ చేశారు. కమిటీ వేయాలి: రవీంద్రకుమార్ రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీ నివేదికనే అంతిమంగా తీసుకోవద్దని, నిజనిర్ధారణ కమిటీ వేయాలని రవీంద్రకుమార్ (సీపీఐ) అన్నారు. రాష్ట్రంలో కనీస వర్షపాతం లేదు. 55 శాతం పంటలెండాయి. రైతులంతా ఆందోళనలో ఉన్నారు. వారిని ఆదుకోవాలి. వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గించాలి. రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలి. చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందజేయాలి. పంటల బీమాను సర్వే నంబర్ల ఆధారంగా వర్తింపజేయాలి. రబీలో వడగళ్ల వానలతో నష్టపోయిన వారికి ఇంకా పరిహారమివ్వలేదు. వీటన్నిం టిపై అఖిలపక్షం వేయాలి’’ అని కోరారు.