breaking news
Dog Squad
-
పదునైన ఆయుధంతో దాడి.. వ్యక్తిని దారుణంగా..
సాక్షి, మహబూబ్‌నగర్: మహమ్మదాబాద్ జిల్లా గుండేడ్ మండలం మన్సూర్‌పల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మన్సూర్‌పల్లికి చెందిన ఈరమోళ్ల గోవింద్ (45) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూ పని చేసుకునేవాడు. దసరా పండగ నిమిత్తం ఈనెల 23న స్వగ్రామానికి వచ్చాడు. పొలంలో పంటను పందులు పాడు చేస్తుండడంతో రాత్రివేళ కాపలా వెళ్లేవాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి పొలానికి వెళ్లాడు. గురువారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో అతడి పెద్ద కుమారుడు వెంకటేష్ పొలం వద్దకు వెళ్లి తండ్రి కోసం వెతకగా, కొద్ది దూరంలో లుంగీ కనిపించింది. అనుమానం వచ్చి మరి కొద్ది దూరం వెళ్లి చూడగా తండ్రి దారుణ హత్యకు గురై కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గోవిందు తలకు వెనుక వైపు గాయంతో పాటు గదవ కింద గొంతుపై లోతైన గాయం ఉంది. పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి మహబూబ్‌నగర్ డీఎస్పీ మహేష్, టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఏఎస్ఐ అజంఅలీ చేరుకుని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో విచారణ నిర్వహించారు. గోవిందు పొలం నుంచి హత్య జరిగిన ప్రదేశం వరకు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ మన్సూర్‌పల్లి గేట్ వరకు పరుగెతి, అక్కడి నుంచి సల్కర్‌పేట్ దారిలో అంతర్గంగ రోడ్డు వద్దకు వచ్చి ఆగిపోయింది. హత్య చేసిన వారు సల్కర్‌పేట్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ మార్చురీకి తరలించారు. గ్రామంలో విషాదఛాయలు.. గోవిందు హత్యతో మన్సూర్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. మృతుడు అందరితో కలుపుగోలుగా ఉండేవాడని, ఎవరితో విరో ధం లేదని, అలాంటి వాడిని హత్య చేయ డం ఎంతవరకు సమంజసమని పలువురు పేర్కొన్నారు. మృతుడికి భార్య ఈరమోళ్ల సత్యమ్మ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
సాయమే లక్ష్యం: రంగంలోకి భారత్‌కు చెందిన జూలీ.. రోమియో.. హానీ.. రాంబో
సిరియా, టర్కీలో భయంకర ప్రకృతి విలయం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా దాదాపు 24వేలకు పైగా మంది మృత్యువాతపడ్డారు. రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని సహయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఈ క్రమంలో అనే దేశాలకు చెందిన టీమ్స్ సహయక చర్యల్లో పాల్గొన్నాయి. భారత్ కూడా అందరి కంటే ముందే సహాయక చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్మీ యుద్ధ విమానాల్లో అక్కడికి వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారుఉ. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన డాగ్ స్క్వాడ్లు కూడా రంగంలోకి దిగాయి. నలుగురు సభ్యుల డాగ్ స్క్వాడ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటోంది. ఎన్డీఆర్ఎఫ్ స్క్వాడ్‌లోని నాలుగు లాబ్రడార్ శునకాలు ఉన్నాయి. జూలీ, రోమియో, హానీ, రాంబో కుక్కులు తుర్కియే భూకంప బాధితుల్ని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఈ నాలుగు జాగిలాలతో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లాయి. కాగా, స్నిఫింగ్‌లో ఈ డాగ్ స్క్వాడ్ ఎంతో స్పెషల్. రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా వాళ్లు శిక్షణ పొందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఈ డాగ్ స్క్వాడ్ వెంటనే పసిగడుతుంది. మరోవైపు.. విపత్కర వాతావరణంలోనూ ఇండియన్ డాగ్ స్క్వాడ్ బాధితుల్ని గుర్తించడం విశేషం. ఇక, టర్కీలో ఉష్ణోగ్రతలు మైనస్ అయిదు డిగ్రీలకు చేరుకోవడంతో సహాయ చర్యలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భూకంపం కారణంగా టర్కీ ఆ దేశం భౌగోళికంగా అయిదు నుంచి ఆరు మీటర్లు పక్కకి జరిగి ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పొరల్లో ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ (ఫలకాలు) తీవ్రమైన రాపిడి కారణంగానే ఇది సంభవించినట్టు తెలిపారు. సిరియాతో పోల్చి చూస్తే టర్కీలో రెండు ఫలకాల మధ్య ఏర్పడిన ఒత్తిడి వల్ల రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని, ఫలితంగా దేశమే కాస్త జరిగిందని ఇటలీకి చెందిన సెసిమాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డొగ్లోని చెప్పారు. భూ పొరల్లో ఉన్న అనతోలియా ప్లేట్ వాయవ్య దిశగా ఉన్న అరేబికా ప్లేట్ వైపు జరగడంతో ఇలా దేశమే భౌగోళికంగా కదిలే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక టెక్టోనిక్ ప్లేట్ పశ్చిమ వైపు, మరో ప్లేట్ తూర్పు వైపు కదలడంతో భారీ భూకంపం సంభవించిందని ఆయన వివరించారు. వాలీబాల్ ఆట కోసం అడియామాన్‌కు వచ్చిన కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు 39 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. ఫమగుస్తా కాలేజీకి చెందిన ఈ బృందం ఏడంతస్తులున్న ఒక హోటల్లో బస చేశారు. -
శభాష్.. డాగ్ స్క్వాడ్!
మిస్టరీగా మారిన కేసుల్లో నిందితుల ఆచూకీ కనుగొనడంలో పోలీసు జాగిలాల పాత్ర కీలకంగా ఉంటోంది. మనుషులకు సాధ్యం కాని పనిని జాగిలాలు చేస్తూ నేర పరిశోధనలో పోలీసులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. వైఎస్సార్ జిల్లా పోలీసు యంత్రాంగం వీటికి ప్రత్యేక శిక్షణ ఇప్పించడమే గాక.. పోషణ బాధ్యతలను పక్కాగా నిర్వర్తిస్తోంది. కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని డాగ్ స్క్వాడ్ వింగ్ (డీఎస్డబ్లు్య) లేదా (డిస్ట్రిక్ట్ కెనైన్ స్క్వాడ్) జాగిలాలు నేర సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ద్వారా నిందితులకు సంబంధించిన ఆనవాళ్లను పసిగట్టడంలో విశేష ప్రతిభ చాటుతున్నాయి. తద్వారా సంబంధిత పోలీసు అధికారులు తమ విచారణను వేగవంతం చేసి కేసుల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. జాగిలాల ప్రత్యేకతలివే శునకాలకు ఘ్రాణ శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు 10 రెట్లు అధికం. పోలీసు శాఖకు నేర పరిశోధనలో ఇవి కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 8 నెలల పాటు కఠోర శిక్షణ లూసీతో షేక్‌హ్యాండ్ తీసుకుంటున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ (ఫైల్‌ఫోటో) గుంటూరు జిల్లా మంగళగిరి బెటాలియన్‌లోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్లో మూడు లేదా నాలుగు నెలల వయసున్న పప్పిస్కు (పిల్లలు) హ్యాండ్లర్స్(శిక్షకులు) నేర పరిశోధనకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. 8 నెలల పాటు కొనసాగే ఈ శిక్షణ ఇచ్చేందుకు జంతు ప్రేమికులుగా ఉన్న ఏఆర్ పోలీసులను ఎంపిక చేస్తారు.ఈ శిక్షణ కాలంలో రెండు నెలల పాటు కాలకృత్యాలు, ఆహారం, ప్రేమగా చూసుకోవడం, పిలిచిన వెంటనే వచ్చేందుకు ప్రేమానురాగాలను నేర్పిస్తారు. తరువాత రెండు నెలల్లో సాధారణ మర్యాదలైన సిట్, స్టాండ్, కమ్, రోల్, సెల్యూట్లను నేర్పిస్తారు. ఆ తరువాత మరో నాలుగు నెలల పాటు పేలుడు పదార్థాలను గుర్తించేందుకు గన్‌పౌడర్‌ను వాసన చూపించడంతో పాటు, బాక్స్‌లో గన్‌పౌడర్‌ను వేసి దానిని విసిరేసి తీసుకు వచ్చే విధంగా రోజు సాధన చేయిస్తారు. 12 జాతుల వినియోగం ప్రధానంగా 12 జాతులకు చెందిన జాగిలాలను పోలీసు శాఖ తమ నేర పరిశోధన అవసరాలకు వినియోగించుకుంటోంది. జిల్లాలో 10 జాగిలాలు డాగ్‌స్క్వాడ్ వింగ్‌లో ఉన్నాయి. వీటిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఒక్కో డాగ్‌కు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటిలో ఉన్న లాబ్రడార్ జాతికి చెందిన 5 జాగిలాలను పేలుడు పదార్థాలను కనుకొనేందుకు, ట్రాకర్ డాగ్స్‌గా పిలువబడే జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ జాతులకు చెందిన రెండు జాగిలాలను నేరపరిశోధనకు వినియోగిస్తారు. అలాగే మరో 3 జర్మన్‌షెపర్డ్, బెల్జియం మెలనాయిస్, లాబ్రడార్లను ఎర్రచందనం దుంగలను కనుగొనేందుకు వినియోగిస్తారు. అలాగే వీఐపీల భద్రత, అజ్ఞాతంగా వచ్చే బెదిరింపు కాల్స్, పేలుడు పదార్థాలను గుర్తించడం, ఇలా వివిధ సందర్భాల్లో జాగిలాల సేవలను పోలీసు శాఖ వినియోగించుకుంటోంది. ప్రతిభ.. పతకాలు డ్యూటీమీట్‌లో ప్రతిభ చాటిన డాగ్‌తో హ్యాండ్లర్స్ (ఫైల్‌ఫొటో) రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే డ్యూటీమీట్స్, శిక్షణలలో జాగిలాలు ప్రతిభ చాటి అనేక పతకాలను సాధిస్తున్నాయి. పోలీసులకు సవాల్‌గా మారిన పలు కేసులను ఛేదించడంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ కీలకంగా వ్యవహరించి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం అభినందనలు పొందుతున్నాయి. 2017 చండీఘర్‌లో, 2019లో మైసూరులో నిర్వహించిన ఆల్ ఇండియా డ్యూటీమీట్‌లో ట్రాకర్ డాగ్ డాన్న్రెండుసార్లు పాల్గొంది. 2014లో నిర్వహించిన శిక్షణ పోటీల్లో ట్రాకర్ డాగ్ డాన్ ట్రాకింగ్‌లో ప్రథమ బహుమతి సాధించి గోల్డ్‌మెడల్ పొందింది. డాగ్ వాగా ఎక్స్‌ప్లోజివ్‌లో ద్వితీయ బహుమతితో సిల్వర్ మెడల్ పొందింది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నాలుగు డాగ్స్ పాల్గొన్నాయి. ఇందులో ట్రాకర్‌లో డాగ్ డాన్, ఎక్స్‌ప్లోజివ్‌లో జాగిలం వాగ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో పోలీసు జాగిలం లూసీ ప్రతిభ చాటింది. లాబ్రడార్ జాతికి చెందిన లూసీ పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్టగా పేరొందింది. రాష్ట్ర స్థాయిలో పేలుడు పదార్థాల గుర్తింపునకు సంబంధించిన పోటీలో లూసీ సత్తా చాటింది. వైఎస్సార్ జిల్లాలో పోలీస్ డాగ్స్ ఛేదించిన క్లిష్టమైన కేసుల వివరాలిలా.. 2017 సంవత్సరం ఆగస్టు 14న పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువ జంట మిస్సింగ్ కేసు గత ఏడాది మార్చి 14న సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య గత ఏడాది ఆగస్టు 29న పెండ్లిమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య గత ఏడాది నవంబర్ 18న రామాపురం హత్య కేసు ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన చెన్నూరులోని దేవాలయంలో జరిగిన చోరీ ఈ ఏడాది జూన్ 2న కడప నగరం చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీ ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఖాజీపేట ఆలయంలో జరిగిన చోరీ కేసులను ఛేదించి నిందితులను కనుగొనడంలో విశేష ప్రతిభ చాటాయి. నేరపరిశోధనలో డాగ్స్ ఉత్తమ ప్రతిభ జిల్లాలో నేరపరిశోధనలో డాగ్స్ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. పోలీసు డ్యూటీమీట్స్లో ప్రతిభ చాటి బహుమతులు పొందుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. – కేకేఎన్ అన్బురాజన్,జిల్లా ఎస్పీ