breaking news
Doddanna
-
‘ఆటగదరా శివ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆటగదరా శివ జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది సంగీతం : వాసుకి వైభవ్ దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ నిర్మాత : రాక్‌లైన్ వెంకటేష్ ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి హార్ట్ టచింగ్ సినిమాలను తెరకెక్కించిన చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆటగదరా శివ. కన్నడలో ఘనవిజయం సాదించిన రామ రామరే సినిమాకు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్ శంకర్, జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిలు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు మూడేళ్ల విరామం తరువాత చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఆటగదరా శివపై ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా..? కథ; జంగయ్య (దొడ్డన్న) తలారీ. ఊళ్లో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జంగయ్య, ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్లి తలారీ బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలా ఉరిశిక్ష పడ్డ ఖైదీ గాజులమర్రి బాబ్జీ(ఉదయ్ శంకర్)ని ఉరితీసేందుకు రావాల్సిందిగా జంగయ్యకు కబురందుతుంది. జంగయ్య బయలుదేరే సమయానికి బాబ్జీ.. జైల్లో సెంట్రీని గాయపరిచి పారిపోతాడు. బయటకు వచ్చి బాబ్జీ చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి చివరకు జీపులో వెళ్తున్న జంగయ్యనే లిఫ్ట్ అడుగుతాడు. కొద్ది దూరం ప్రయాణం తరువాత పేపర్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరార్ అంటూ వచ్చిన ప్రకటన చూసిన జంగయ్య బాబ్జీని గుర్తుపడతాడు. అయినా ఏం తెలియనట్టే ప్రయాణం కొనసాగిస్తారు. వారి ప్రయాణం చివరకు ఎలా ముగిసింది..? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన అనుభవాలేంటి..? కలిసిన వ్యక్తులు ఎవరు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; కన్నడలో ఘనవిజయం సాధించిన రామ రామరే సినిమాను దాదాపు అదే ఫీల్‌ను క్యారీ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు చంద్రసిద్ధర్థ. కథగా చిన్నపాయింటే అయినా.. కథనంతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాకు కీలకమైన జంగయ్య పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. ఆ పాత్రకు కన్నడ నటుడు దొడ్డన్న ప్రాణం పోశారు. లుక్స్ పరంగానే కాదు నటనతోనూ మెప్పించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో దొడ్డన్న నటన సూపర్బ్. బాబ్జీ పాత్రలో కనిపించిన ఉదయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కకపోయినా.. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ ఫేం హైపర్ ఆదికి లెంగ్తీ రోల్ దక్కింది. తన మార్క్ పంచ్ డైలాగ్స్‌తో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు ఆది.ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పాటు ఆపాత్రలో పరిచయం ఉన్న నటులెవరూ కనిపించలేదు. దర్శకుడు చంద్ర సిద్దార్థ తన గత చిత్రాల మాదిరిగానే మరోసారి మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్‌తో సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఆటగదరా శివ సినిమాకు ప్రధాన బలం మాటలు. ‘ముందు క్షమాపణ అడిగిన వాడే ధైర్యవంతుడు.. క్షమించిన వాడే బలవంతుడు’, ‘మనం ఉన్నప్పుడు లేనోళ్లు, పోయాక ఉంటే ఎంత పోతే ఎంత’, ‘చావు విముక్తి, బతుకు తృప్తి’ లాంటి డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారని ఈ సినిమా మెప్పించటం కాస్త కష్టమే. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ లవిత్ సినిమాటోగ్రఫి. నిర్జన ప్రదేశంలో పెద్దగా సెట్ ప్రాపర్టీస్‌ను వాడకుండా ఆసక్తికర విజువల్స్‌ను క్యాప్చర్ చేశారు. కన్నడ వర్షన్‌కు సంగీతమందించిన వాసుకీ వైభవ్ తెలుగు వర్షన్ కు కూడా మంచి సంగీతాన్నందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌తో పాటు, ఎట్టాగయ్య శివ పాటలకు మంచి రెస్సాన్స్ వస్తోంది. చాలా కాలం తరువాత తెలుగు సినిమాను నిర్మించిన రాక్‌లైన్ లైన్ వెంకటేష్ తమ బ్యానర్ స్థాయికి తగ్గ సినిమాతో ఆకట్టుకున్నారు. ప్లస్ పాయింట్స్ ; కథా కథనం ప్రధాన పాత్రధారుల నటన ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అప్పుడు సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకొస్తున్నా. సరైన కథ తోచక నిరాసక్తతలో ఉండి ఇక సినిమాలు చేయకపోవడమే బెటర్ అనుకుంటున్న టైమ్‌లో తనికెళ్ల భరణిగారు రాసిన ‘ఆటగదరా శివ’ పాట విన్నా. అది టైటిల్‌గా బావుంటుందనిపించింది. ఆ మరుసటిరోజే రాక్‌లైన్ వెంకటేశ్‌గారు ‘ఆటగదరా శివ’ సినిమా గురించి చెప్పారు. నాకూ రోడ్ ఫిల్మ్ చేయాలని కోరిక ఉండటంతో ఒప్పుకున్నా’’ అని దర్శకుడు చంద్రసిద్ధార్థ్ అన్నారు. ఉదయ్ శంకర్ కథానాయకుడిగా దొడ్డన్న, ‘హైపర్’ ఆది, దీప్తి, ‘చలాకీ’ చంటి, ‘చమ్మక్’ చంద్ర, భద్రం నటించిన చిత్రం ‘ఆటగదరా శివ’. ‘ఆ నలుగురు’ ఫేమ్ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో హిట్ అయిన ‘రామ రామ రే’ చిత్రానికి స్పిరిచ్యువల్ యాంగిల్‌ని, ఇంకో లేయర్‌ని కలగలిపి ‘ఆటగదరా శివ’ కథ సిద్ధం చేశా. పెద్ద పెద్ద సినిమాలు చేసే వెంకటేశ్‌గారు ఈ సినిమా తీయడం ధైర్యం చేయడమే. ఇది రాగిముద్దలాంటి సినిమా. అయినా మా నటీనటులు దాన్ని తినిపించేలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘ఆటగదరా శివ’ నిర్మాతగా సంతృప్తినిచ్చింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా కోసం కష్టపడ్డారు. వాసుకి సంగీతం బాగుంది. పులగం చిన్నారాయణ, చైతన్యప్రసాద్ రాసిన పాటలు బాగున్నాయి’’ అని రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. చంద్రసిద్ధార్థ్గారి డైరక్షన్లో చేయడం హ్యాపీ’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ఈ సినిమా కోసం ఆర్నెల్లు గడ్డం పెంచా’’ అన్నారు కన్నడ నటుడు దొడ్డన్న. -
నటుడి అల్లుడు ఇంట్లో 21 కేజీల బంగారం చోరీ
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో భారీ చోరీ చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువచేసే బంగారు బిస్కెట్లు, కడ్డీలను దొంగలు దోచుకెళ్లడం సంచలనం రేపుతోంది. కన్నడ నటుడు దొడ్డణ్ణ అల్లుడు కేసీ.వీరేంద్ర అలియాస్ పప్పి ఇంట్లో దొంగలు పడి 21 కేజీల బంగారు బిస్కెట్లు, కడ్డీలను దోచుకెళ్లారు. ఈ ఘటన చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చెళ్లకెరె పట్టణంలోని పాత టౌన్లో కేసీ.వీరేంద్ర నివాసముంటున్నారు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దుండగులు ఇంటి తాళం బద్దలు చొరబడి లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.6.30 కోట్ల విలువ చేసే 21 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అంతేగాక ఇతడి ఇంటికి వందమీటర్లు దూరంలో ఉన్న కేసీ.వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామి ఇంటినీ వదల్లేదు. ఆ ఇంట్లోనూ చొరబడి లాకర్లో ఉన్న రూ.10.70 లక్షల నగదు అపహరించుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై భాదితులు చెళ్లకెరె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్ధలానికి డాగ్‌స్క్వాడ్, వేలిముద్ర నిపుణులతో పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని తనిఖీ చేసి దుండగుల ఆచూకీకోసం గాలింపు చేపట్టారు. ఎస్పీ శ్రీనాథ్జోషి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానంతో ఇద్దరు పని మనుషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గత కొద్దినెలల కిందట ఐటీ శాఖ దాడుల్లో కేసీ.వీరేంద్ర ఇంటి బాత్ రూమ్ గోడ సీక్రెట్ లాకర్లో దాచిపెట్టిన రూ.6 కోట్లు నగదు లబించిన విషయం తెలిసిందే. తాజా దోపిడీ ఆ కుటుంబానికి బాగా తెలిసినవారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.