రోడ్డెక్కిన విద్యార్థులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తిరువళ్లూరు జిల్లాలోని డీడీ వైద్యకళాశాలలో సుమారు 216 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత ఏడాది ఈ కళాశాలను తనిఖీ చేసిన జాతీయ వైద్య మండలి ప్రాథమిక వసతులు, మౌళిక సదుపాయాలు లేకుండా నిర్వహిస్తున్నారంటూ అనుమతిని రద్దు చేసింది. దీంతో ఈ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరమైంది. తమను ప్రభుత్వ వైద్యకళాశాలలో చేర్చుకోవాలి లేదా డీడీ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలంటూ విద్యార్థులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం స్పందించడంలేదు. దీంతో ఈనెల 19న 50 మంది విద్యార్థులు చెన్నైలోని సచివాలయం ముందుకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అభిరామిస్త్రీ అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గిండీలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న డీడీ వైద్య కళాశాల విద్యార్థులు అకస్మాత్తుగా రోడ్డుపై బైఠాయించారు. ఆరుగురు విద్యార్థులు అక్కడికి సమీపంలోని మెట్రోరైలు వంతెనపైకి ఎక్కి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకుంటే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. గిండీ మెయిన్‌రోడ్డులో విద్యార్థులు రాస్తారోకోకు దిగిన సమాచారాన్ని తెలుసుకున్న వందలాది మంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. అయితే విద్యార్థులు గుంపుగా వెళ్లి మరో చోట బైఠాయించారు. నలుగురు చేతులను కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు దురుసుగా వ్యవహరించలేక పోయారు.
స్తంభించిన ట్రాఫిక్
విద్యార్దుల ఆకస్మిక ఆందోళన, రోడ్డుపై బైఠాయింపు ఫలితంగా గిండి పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ స్తంభించిపోయాయి. గిండీ, గిండీ పారిశ్రామిక వాడ, పోరూరుకు దారితీసే రోడ్డు, కత్తిపార జంక్షన్ బ్రిడ్జీపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో చక్రబంధంలో చిక్కిన చెన్నైగా మారిపోయింది. విమానాశ్రయానికి వెళ్లే రెండు ప్రధాన మార్గాలు వేలాది వాహనాలతో నిండిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు వాహనదారులు విద్యార్థులను శాపనార్థాలు పెట్టగా, ప్రతిగా విద్యార్థులు సైతం ఏడుస్తూ వారిని తిట్టిపోశారు. రోడ్డుపై గంటపాటు ఉండేందుకు మీకు అంతకష్టమా, కళాశాల మూతపడటంతో మేము ఏడాదిగా రోడ్లపై పడ్డాము, మా భవిష్యత్తు అయోమయంగా మారింది.రూ.రూ. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను పునరుద్ధరించగలిగారు. గిండి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సాధారణ పరిస్థితుల్లోకి రావడానికి మరో గంటపట్టింది.