breaking news
Diwali special stor
-
తిరుమలలో దీపావళి ఆస్థానం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తయింది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో భారత సైనికుల ప్రాణాలు తీస్తున్న శత్రువులను, ప్రపంచాన్ని భాధిస్తున్న కరోనా వ్యాధిని సంహరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశరక్షణకు సరిహద్దుల్లో మన సైనికులు చేస్తున్న వీరోచిత పోరాటం అభినందనీయమన్నారు. కరోనా నుంచి ప్రపంచాన్ని స్వామి వారు తప్పకుండా కాపాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతియేటాలాగే ఈ సారి కూడా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్ర బద్దంగా నిర్వహించామని చెప్పారు. తెలుగు ప్రజలకు వైవి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. -
చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి!
జీవితం అంటే... వెలుగు మాత్రమే కాదు.అలా అని చీకటి కూడా కాదు. వెలుగు కనిపించినప్పుడు... చీకటి కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చీకటి ఎదురైనప్పుడు... వెలుగు ఎంతో దూరం లేదనే ఆశారేఖ కళ్లలో మెరిసిపోవాలి. దీపావళీ అనగానే గుర్తుకు వచ్చే అచ్చ తెలుగు పాట ‘విచిత్రబంధం’ సినిమాలో ఆచార్య ఆత్రేయ రాసిన ‘జీవితమే ఒక దీపావళి చీకటి వెలుగుల రంగేళీ’.తరాలకు అతీతంగా ఈ పాట ఇప్పటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పండగ రోజు మాత్రమే కాదు...ఏరోజు విన్నా... దీపావళిని కన్నుల ముందు ఉంచుతుంది ఈ పాట.పండగలో సంతోషం మాత్రమే కాదు...పరమార్థం కూడా ఉంటుంది. ఆ పరమార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈ పాటలో రాశారు ఆత్రేయ ‘చీకటి వెలుగుల రంగేళీ... జీవితమే ఒక దీపావళీ’ ఈ వాక్యంలో ఎంత తాత్వికత దాగుందో! దీపావళి పండుగ అంటే తెలుగువారి వాకిళ్లలో వెలుగు తోరణాల పలకరింపుల పులకరింత అని అనుకోవచ్చు. కాని ఇక్కడ రచయిత పాటని వెలుగుతో ప్రారంభించకుండా చీకటితో ప్రారంభించి తదుపరి వెలుగును జోడించి ఈ రెండూ కలిస్తేనే దీపావళి అని, అదే మన జీవితం అనే నగ్న సత్యాన్ని, లౌకిక లోకంలో ఆశలు వెలిగించే వెలుగుల జిలుగులే ఈ దీపావళి అనే విషయాన్ని చాలా సున్నితంగా స్పష్టంగా ముక్కుసూటిగా వివరించారు. మన పండుగల పరమార్థమే .... అంతుచిక్కని వేదాంత తత్త్వం... ఎంతో చిక్కని లౌకిక తత్త్వం... మరెంతో చక్కని అలౌకిక తత్త్వం... ‘చీకటి వెలుగుల రంగేళీ’ పాట సందర్భశుద్ధి కలిగి, పండుగ పరమార్థమెరిగి ప్రేమానుబంధాల చుట్టూ తిరిగి జీవిత సత్యాన్ని వెలిగించి, ప్రశ్న లేకుండానే జవాబును ఇస్తుంది. కేవలం వెలుగు మాత్రమే గొప్పది కాదు, అసలు వెలుగులు గుర్తించాలంటే చీకటి ఉండాలి. దీపావళి పండుగలో మనకు కనువిందు చేసే వెలుగు చీకటిలో మాత్రమే మన కళ్లకు విశేషమైన అనుభూతిని ఇస్తుంది. అందుకే చీకటి లేనిదే వెలుగు లేదు. కష్టం లేనిదే సుఖం లేదు. లేమి లేనిదే కలిమి లేదు. ఇది జీవిత సత్యమన్న విషయాన్నీ ఎంతో సున్నితంగా, చాలా చక్కగా క్లుప్తంగా రచయిత ఆచార్య ఆత్రేయ తెలియచేశారు.ఇక దీపావళి పండుగను మతాబుగా, చిటపటలు, గుసగుసలుగా, ప్రేమైక జీవన విధానాన్ని చెప్పారు.చివరగా గొప్ప వేదాంత తత్త్వాన్ని మరల ఎంతో పొందికగా సెలవిచ్చారు. చీకటికి సంపూర్ణ రూపం - అమావాస్య చల్లని వెలుతురుకి పరిపూర్ణ దీపం - పున్నమి అమావాస్య రోజు పుట్టిన అమ్మాయికి అదే రోజు వెలుగనే అబ్బాయిని తోడు చేసి పున్నమి నాటికి నాయికానాయకులను జోడీగా చేయడమే పాట ముగింపు. అంటే ఇక్కడ చీకటిలో పుట్టిన అమ్మాయి, పున్నమి రోజున తన జోడీతో ఒకటి అవ్వడము విశేషం. చీకటి నుంచి వెలుగు అనే దీపావళి సంకేతాన్ని అమావాస్య నుంచి పున్నమితో (వెలిగించాడు) ముగించారు రచయిత.సరదాగా, హుషారుగా, చలాకీగా సాగే ఈ పాటలో ఎంతో గొప్ప నిగూఢమైన భావన పొందుపరచారు. ఇక్కడ రచయిత - ఓ టపాసు దాన్ని పేల్చేసినది - సంగీత దర్శకుడు ఆ శబ్దాన్ని మన చెవికి చేర్చినది - గాయనీ గాయకులు. సినిమా సాహిత్యం చాల శక్తిమంతమైనది. క్షణాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలదు. ముఖ్యంగా సాహిత్యం ‘అక్షర పుష్పాయుధం’ ఇది దీపావళి ప్రత్యేకం. అద్భుత సాహిత్యానికి అభిషేకం. - సంభాషణ: డా. వైజయంతి చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనందజ్యోతుల ఆశలు వెలిగించు దీపాలవెల్లి చరణం 1 అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏచక్కన్ని బావకో జవాబులు మాటల్లో వినిపించు చిటపటలు ఏ మనసునో కవ్వించు గుసగుసలు చరణం 2 అల్లుళ్లు వస్తారు అత్తవారిళ్లకు మరదళ్లు చేస్తారు మర్యాదవాళ్లకు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధీ వీధీ తిప్పేరు వీసెడు గుద్దులు గుద్దేరు చరణం :3 అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజదొంగ అవుతుంది చూడు పుట్టినరోజున దొరికాడు తోడు పున్నమినాటికి అవుతాడు జోడు రచన: ఆచార్య ఆత్రేయ సంగతం: కె.వి.మహదేవన్ గానం: పి. సుశీల, ఘంటసాల దర్శకులు : ఆదుర్తి సుబ్బారావు విడుదల : అక్టోబరు 12, 1972 బ్యానర్: అన్నపూర్ణా పిక్చర్స్