ఎన్నికలు పూర్తయ్యాకే ఉద్యోగుల విభజన
ముందే విభజిస్తే ఎన్నికలపై ప్రభావం: సీఈఓ నోట్
విభజన మార్గదర్శకాలు సైతం మే 17వ తేదీ తర్వాతే..
హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉద్యోగుల విభజన చేయరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల విభజన కూడా ఎన్నికలయ్యాకనే చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నోట్ పంపారు. ఉద్యోగుల విభజన.. ఈ నెల 30న తెలంగాణ జిల్లాల్లోను, మే 7న సీమాంధ్ర జిల్లాల్లో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని సీఈఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలయ్యే వరకు ప్రధానంగా రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని తెలిపారు.
ఒకవేళ తీసుకుంటే ఎన్నికలపై ప్రభావం చూపడంతో పాటు ఎన్నికల ప్రక్రియకు కూడా ఆటంకం కలగవచ్చనే అభిప్రాయూన్ని ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసింది. ఉద్యోగుల విభజన ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఇప్పుడు వెలువరించరాదని సీఈఓ స్పష్టం చేశారు. ఎన్నికలు మే 7వ తేదీతో పూర్తి అవుతున్నప్పటికీ ఎన్నికల నియమావళి కౌటింగ్ పూర్తి అయ్యే వరకు అమల్లో ఉంటుంది. అందువల్ల ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఏ నిర్ణయాలైనా మే 17వ తేదీ తరువాతనే తీసుకోవాలని భన్వర్‌లాల్ ఆ నోట్లో పేర్కొన్నారు.
దీంతో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయరాదని నిర్ణరుుంచింది. గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేసిన కమలనాథన్ ఈ విషయంపై చర్చించేందుకు సీఈఓ కార్యాలయానికి వచ్చారు. అరుుతే భన్వర్‌లాల్ భోజన విరామంలో ఉండటంతో పావు గంట వేచి చూసిన అనంతరం వెళ్లిపోయారు. మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎస్ మహంతి ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్‌ను కలసి విభజన పనులకు ఎన్నికల నియమావళి వర్తింపుపై చర్చించారు.