breaking news
districts visit
-
బంగారు తెలంగాణ చేసి తీరుతం: సీఎం కేసీఆర్
దఫ్తర్లు లేవు.. దళారులు లేరు.. గత ప్రభుత్వాల హయాంలో ఏ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా దళారుల చేతులు తడపాల్సి వచ్చేది. రాష్ట్రం వచ్చాక దళారులు, దఫ్తర్లతో పనిలేకుండా పోయింది.. గోకేటోల్లకు, గీకేటోల్లకు పనిలేకుండా పోయింది. రైతుబంధు పథకం డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నం. ఆనందభాష్పాలు వస్తున్నయి ఇప్పుడు రాష్ట్రంలో పంటలను చూస్తుంటే కళ్లలో ఆనందభాష్పాలు వస్తున్నయి. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండాయి. ఇన్నాళ్లూ దేశానికి కిరీటంలా ఉన్న పంజాబ్‌ను మించి మనం పంటలు పండిస్తున్నం. ఆకలి చావులు పోయాయి తెలంగాణలో ఆకలి చావులు పోయాయి. తెల్లరేషన్ కార్డుపై ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. వలసలూ తగ్గాయి. బొంబాయ్, దుబాయ్.. బొగ్గుబాయ్.. అనే నినాదం పోయింది. ఇప్పుడు యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కూలీలు తెలంగాణకు వచ్చి నాట్లు వేస్తున్నారు. పెండ్లికి పోతే పెళ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీయి’ అన్నాడు. ఎందుకురా భయ్? అంటే ‘నువ్వు మళ్లా దొరుకుతవా సర్.. ఫొటో కావాలి’ అన్నాడు. నేను నీకు దొరుకుతనో లేదో కానీ మాస్క్ తీస్తే కరోనాకు దొరుకుతా కదరా భయ్ అన్నా. అలా వాడు గుంజి.. వీడు గుంజి నాక్కూడా వచ్చింది కరోనా. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎవరేమన్నా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసి తీరుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఇప్పటికే రాష్ట్రంలో గుణాత్మక మార్పులు వచ్చాయని.. తాను బతికున్నంత కాలం రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి తీరుతానని చెప్పారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆదివారం సిద్దిపేటకు వెళ్లిన కేసీఆర్.. అక్కడ సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించా రు. తర్వాత కొత్త కలెక్టరేట్లోనే ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా గంటన్నరపాటు ప్రసంగించారు. సమైక్య పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించిన ఆయన.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రం ప్రగతివైపు నడుస్తోందన్నారు. అమెరికా మాదిరిగా రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక అవసరాలు, ఆర్థిక అవసరాలు తీరుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు.. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నం. ప్రగతి ఫలాలు ప్రతి గడపకూ చేర్చేందుకు నూతన కలెక్టరేట్ భవనాలను నిర్మించుకుంటున్నాం. కొత్త కలెక్టరేట్ల నుంచి అధికారులు ప్రజల కన్నీరు తుడిచేలా పనిచేయాలి. గతంలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. చుక్క తాగునీటి కోసం అరిగోస పడ్డాం. సమైక్య పాలనలో చెరువులు తాంబా లాలయ్యాయి. మనిషి చనిపోతే స్నానాలు చేసేందుకు కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. సముద్రంలాంటి రంగనాయక్‌సాగర్ నిర్మించుకున్నాం. కాకతీయ రెడ్డి రాజులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. వారి పేరుతోనే మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పునరుద్ధరించాం. ప్రస్తుతం చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దుమ్ములేచిపోయిన హల్దీవాగు, కూడవెల్లి వాగులు అలుగులు పారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోంది. రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు గతంలో ఏ లెక్కలు కూడా సరిగా ఉండేవి కాదు.. పాలకులు చీకట్లో బాణం వేసేవాళ్లు. ఎన్ని ఎకరాలు సాగవుతుందో, ఏం సాగవుతుందో లెక్కలు కూడా ఉండేవి కావు. రాష్ట్రంలో 1.60 కోట్ల ఎకరాల రెవెన్యూ భూములు ఉన్నాయి. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించినం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 2,601 రైతు వేదికలు నిర్మించాం. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీశ్, ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా పంటల సాగు రాష్ట్రంలో పంటల సాగు భారీగా పెరిగింది. మూడు కోట్ల టన్నుల వడ్లు పండాయి. ఒక్క ఎఫ్‌సీఐకే 1.40 కోట్ల టన్నుల వడ్లు జోకినం. అన్ని పంటలకు కలిపి 26 లక్షల టన్నుల ఎరువులు వినియోగిస్తున్నాం. గోదాముల సామర్థ్యాన్ని 25 లక్షల టన్నులకు పెం చుకున్నాం. పట్టుదలతో పనిచేస్తేనే సాధ్యమైంది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయండి వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు, పెట్టుబడి వ్యయం, పంట కాలం కూడా తగ్గుతయి. ఈ సాగు పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించాలె. ఈ పద్ధతిలో నేను సాగు చేస్తే ఎకరానికి 42 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పత్తి సాగుతో ఎన్నో లాభాలున్నాయి. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తిని కొనేందుకు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల జిన్నింగ్ మిల్లులు ముందుకొస్తున్నాయి. ఆయిల్ పామ్, కంది పంటను సాగు చేస్తే అధిక ధర వస్తుంది. ‘స్థానిక’ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలె స్థానిక సంస్థలకు ప్రతినెలా నిధులు మంజూరు చేస్తున్నం. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలి. ప్రతి గ్రామంలో పచ్చని నర్సరీలు ఏర్పాటు చేశాం. కొత్తగా నాలుగు వెటర్నరీ కళాశాలలు రాష్ట్రంలో కొత్తగా నాలుగు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, నల్లగొండలో ఈ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పారు. దళితుల సంక్షేమం కోసం సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని రూ.వెయ్యి కోట్ల వ్యయంతో అమలు చేస్తామని ప్రకటించారు. ‘తెలంగాణ వర్ధిల్లుగాక.. సిద్దిపేట వర్ధిల్లుగాక..’అంటూ సీఎం కేసీఆర్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఒడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఫారుక్ హుస్సేన్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు. ధరణి కోసం మూడేళ్లు కష్టపడ్డ.. ధరణి పోర్టల్ కోసం మూడేళ్లు కష్టపడ్డ. అధికారులు ఎల్లయ్య భూమి మల్లయ్యకు.. మల్లయ్య భూమి ఎల్లయ్యకు రాసేవాళ్లు. ఇట్ల రైతులను అరిగోస పెట్టేవాళ్లు. 37 కాలమ్స్?తో భూరికార్డులుండేవి. మేం మూడు కాలమ్స్?తో సరళీకృతం చేసినం. అధికారులు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఇవన్ని మారిస్తే ఏదో భూకంపం వస్తదన్నట్టు చేశారు. అన్నింటిని సరిచేసి పరిష్కార మార్గాలు చెప్పిన. ఇప్పుడు సమర్థవంతంగా అమలవుతోంది. పావు గంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేష¯Œ అవుతోంది.. ధరణిలో ఇప్పటివరకు ఆరు లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయినయి. ప్రతిపక్షాలపై ఘాటుగా విమర్శలు సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్? ఘాటుగా విమర్శలు చేశారు. కొందరు సిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎడ్డెమంటే తెడ్డెమనే శక్తులు అన్నిచోట్లా ఉంటాయని వ్యాఖ్యానించారు. ‘‘కాళేశ్వరంపై కొన్ని కుక్కలు మొరిగాయి. మిడ్‌మానేరు నాసిరకం అంటూ థర్డ్ క్లాస్ రాజకీయాలు చేశారు. చిల్లరతనానికి కూడా ఓ హద్దు ఉండాలె. ఇతర రాష్ట్రాల్లో కిలో వడ్లు కూడా కొనలేనివాళ్లు ఇక్కడ పిచ్చికూతలు కూశారు. కాకరకాయగాడు, లేచినోడు, లెవ్వనోడు మాట్లాడితే పట్టించుకోబోం..’’అని పేర్కొన్నారు. ఎవరెన్ని మాట్లాడినా గమ్యం చేరుకునేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకునేది లేదన్నారు. హరీశ్‌రావుపై ప్రశంసల వర్షం సిద్దిపేట పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్‌రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. సిద్దిపేటకు సమర్థవంతంగా పనిచేసే మంత్రి ఉన్నారని.. నియోజకవర్గాన్ని హరీశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. హరీశ్‌రావు లాంటి నాయకులు ఉండటం సిద్దిపేట జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సిద్దిపేట జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాబాయ్కాళ్లు మొక్కిన కేసీఆర్ ఎమ్మెల్యే కార్యాలయం ప్రారంభోత్సవానికి రోడ్డు మార్గం ద్వారా వచ్చిన కేసీఆర్.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రగతి రథం దిగగానే ఆయన కాక (బాబాయ్) బాలకిషన్ రావు కనిపించారు. కేసీఆర్ ఆయనను ఆప్యాయంగా పలకరించి పాదాభివందనం చేశారు. ఆదివారం ఫాదర్స్ డే కావడంతో కేసీఆర్ చిన్నాన్న కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడాన్ని అంతా ఆసక్తిగా చూశారు. కలెక్టర్‌ను స్వయంగా కూర్చోబెట్టి.. కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత చాంబర్‌లోని సీట్లో కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్ స్వయంగా కూర్చోబెట్టారు. ఈ సం దర్భంగా సీఎం కేసీఆర్‌కు కలెక్టర్ పాదాభివందనం చేశారు. కలెక్టర్ సతీమణి కూడా సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు. దీన్ని కొందరు రాద్ధాంతం చేయ డంపై కలెక్టర్ స్పందించారు. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం సం ప్రదాయమని, అందులో భాగంగానే నూతన కలెక్టరేట్లో తనకు బాధ్యతలు అప్పగించిన క్రమంలో సీఎం కేసీఆర్ నుంచి ఆశీస్సులు తీసుకున్నానని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. -
నేటి నుంచి సీఎం జిల్లా పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నుంచి జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల అమలు తీరు, పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం సిద్దిపేట, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాల్లో, సోమవారం వరంగల్ జిల్లాలో సీఎం పర్యటిస్తారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం పర్యటన కొనసాగనుంది. అక్కడ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. 21న వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించడంతోపాటు వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. 22న భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్త గ్రామమైన వాసాలమర్రిని సీఎం సందర్శించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. గ్రామంలో దాదాపు 3 వేల మందికి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయడంతోపాటు గ్రామ సర్పంచ్ ఇంటిని సందర్శించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారు. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ సీఎం పర్యటనలు ఖరారు కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ముంపు ప్రాంతాల్లో రేపటి నుంచి విజయమ్మ పర్యటన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం నుంచి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆదివారం కృష్ణా, సోమవారం పశ్చిమ గోదావరి, మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలకు వెళతారు. బాధితులను పరామర్శించి వారి సమస్యలను వైఎస్ విజయమ్మ స్వయంగా తెలుసుకోనున్నారు. వరద ముంపునకు గురైన శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల వైఎస్ విజయమ్మ పర్యటించిన సంగతి తెలిసిందే. బాధితులు, రైతుల కష్టాలను తెలుసుకుని, వారి ఆదుకోవాల్సిందిగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. 29 మంది మరణించగా, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వర్షాలు, వరదల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.