breaking news
district tours
-
Telangana: నేటి నుంచి పల్లెప్రగతి దశమి
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, పారిశుధ్యం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రధాన ఎజెండాగా.. గురువారం నుంచి మలివిడత పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. గురువారం (జూలై 1) నుంచి 10 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, అటవీ శాఖలు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నాయి. అత్యుత్తమ పౌర సేవలు అందించడం ద్వారా పల్లెలు, పట్టణాల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం లక్ష్యంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వీటికి రూపకల్పన చేశారు. ఈ మేరకు ఆయా శాఖలు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. పది రోజుల కార్యక్రమాల సందర్భంగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు రోజువారీ ప్రగతి నివేదికలను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తారు. చివరిగా పల్లె, పట్టణ స్థాయిల్లో సాధించిన పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పిస్తారు. వార్డుల్లో బృందాలతో.. పట్టణ ప్రగతి నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో కౌన్సిలర్/ కార్పొరేటర్, వార్డు పర్యవేక్షక అధికారి, పారిశుధ్య విభాగం/నీటి సరఫరా విభాగం ఉద్యోగితో వార్డు స్థాయి బృందాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు కౌన్సిలర్/కార్పొరేటర్‌తో కూడిన వార్డు కమిటీ ఆధ్వర్యంలో వార్డు సభను నిర్వహించి ఈ కార్యక్రమం లక్ష్యాలను, ప్రగతి నివేదికను ప్రజలకు వివరిస్తారు. తర్వాత వార్డు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు. వార్డులోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులతో సమావేశాలు నిర్వహించి.. వారి సేవలను సైతం ప్రగతి కార్యక్రమంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు/ చైర్ పర్సన్లు, వార్డు సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. పురపాలికల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు పురపాలక సంస్థల్లో రెండెకరాలకుపైగా స్థలంలో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే స్థలాలు ఎంపిక చేసినచోట టెండర్లు ఖరారు చేసి వర్క్ ఆర్డర్లు ఇస్తారు. మిగతా చోట్ల స్థలాల ఎంపిక పూర్తి చేస్తారు. ఇక మృతదేహాలను శ్మశానాలకు తరలించేందుకు ప్రతి పట్టణంలో కనీసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీజనల్ వ్యాధుల నివారణపై.. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా 10 రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నారు. డ్రైనేజీల్లో పూడికతీత, వర్షపు నీరు/వృథా నీరు నిల్వ ఉండకుండా లోతట్టు ప్రాంతాల పూడ్చివేత, ఆస్పత్రులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు, దోమల నివారణ చర్యలు, మంచినీటి సరఫరా ట్యాంకుల క్లీనింగ్, క్లోరినైజేషన్ వంటివి చేపడతారు. చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలు, పిచ్చిమొక్కల తొలగింపు, ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసి వాటి యజమానుల నుంచి చార్జీలు/పెనాల్టీలు వసూలు చేపడతారు, పబ్లిక్ ప్రదేశాలను శుభ్రం చేస్తారు. పనిచేయని బోరు బావులను పూడ్చివేస్తారు. 10 రోజుల్లో25 జిల్లాల్లో పర్యటనలు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ఇప్పటి వరకు రూ.6,500 కోట్లు విడుదల చేసిందని, తాజాగా రూ. 750 కోట్లు విడుదల చేసిందని, పెండింగ్‌లో బిల్లులేమీ లేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తాను ఉన్నతాధికారులతో కలిసి వచ్చే 10 రోజుల్లో 25 జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా ఆకస్మిక తనిఖీ చేపట్టే అవకాశం ఉందన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం అమలును పరిశీలిస్తారని తెలిపారు. ఒక రోజు పవర్ డే.. పల్లె/పట్టణ ప్రగతిలో ఒకరోజు పవర్ డే నిర్వహించి విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తారు. మీటర్లకు మరమ్మతులు, మోటార్ల కెపాసిటర్ల మార్పు, వంగిన/పాడైన స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చడం, వేలాడే వైర్లను సరిచేయడం, ఎనర్జీ ఆడిట్, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పనులు చేపడతారు. ప్రతి పల్లె/పట్టణానికి ప్రొఫైల్ పల్లె/పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి పల్లె, పట్టణానికి ప్రొఫైల్ తయారు చేయనున్నారు. అందులో మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల శాతం, ఓటర్లు, కుటుంబాల సంఖ్య, వార్డుల సంఖ్య, వార్డు కమిటీలు, ఎస్‌హెచ్‌జీలు/సభ్యులు, ఎస్ఎల్ఎఫ్లు, టీఎల్ఎఫ్లు, పీడబ్ల్యూడీ గ్రూపులు, వీధి వ్యాపారుల సంఖ్య, ఆసరా పెన్షనర్ల వివరాలు, రేషన్ షాపులు, కార్డుల సంఖ్య, శ్మశాన వాటికలు మొదలైన వాటి వివరాలు ఉండనున్నాయి. దళితవాడలపై స్పెషల్ ఫోకస్ దళిత సాధికారతపై సీఎం దృష్టి సారించిన నేపథ్యంలో పట్టణ ప్రగతిలో దళితవాడలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. 10 రోజుల్లో కనీసం 2 రోజులు దళితవాడల్లో పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి కొత్తగా అభివృద్ధి పర్చాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాయి. ‘ప్రగతి’ప్రయోజనాలు ఎన్నో.. రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎన్నో వినూత్న మార్పులు జరిగాయి. ఇంతకుముందు లేని ఎన్నో సదుపాయాలు సమకూరాయి. అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, కల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. పల్లె ప్రగతి నిర్వహణ కోసం మండలానికో ప్రత్యేక అధికారిని నియమించి.. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి ‘ప్రగతి’పనులను ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా గ్రామాలకు నిధులు విడుదల చేస్తోంది. ♦ పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా 12,769 గ్రామాల్లో ప్రజలేభాగస్వాములుగా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 8,20,727 మంది ఉండగా.. అందులో 4,03,758 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ♦ మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు గాను 19,298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 12,755 గ్రామాల్లో నర్సరీ ఏర్పాటు చేశారు. ♦ రాష్ట్ర ఏర్పాటు నాటికి 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే సొంత ట్రాక్టర్లు ఉండగా.. ఇప్పుడు 12,769 పంచాయతీలకు ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయి. 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల పనులు పూర్తయ్యాయి. పల్లె ప్రగతి కార్యక్రమాలివీ.. ♦ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పల్లె ప్రగతి తొలి రోజు గ్రామసభను నిర్వహించి సీఎం కేసీఆర్ సందేశాన్ని, గ్రామ ప్రగతినివేదికను చదివి వినిపిస్తారు. ♦ రెండో రోజు /మూడోరోజు పంచాయతీ నర్సరీ, పల్లె ప్రకృతి వనాల్లో కలుపు తొలగింపు. పల్లె ప్రకృతి వనాల్లో పెద్ద మొక్కలు నాటడం, డ్రైనేజీల్లో పూడిక తీత. వ్యర్థాల తొలగింపు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఓపెన్ ప్లాట్లలోని పిచ్చిమొక్కల తొలగింపు చేపడతారు. ♦ నాలుగోరోజు యువత, మహిళా సంఘాల భాగస్వామ్యంతో శ్రమదానం నిర్వహిస్తారు. పెంట కుప్పలు, పొదలు తొలగిస్తారు. అంతర్గత రోడ్ల వెంట మొక్కలు నాటుతారు. ♦ ఐదోరోజు అంగన్వాడీ కేంద్రాలు, బడులు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్లు వంటి ప్రజాసంస్థల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టి, మొక్కలు నాటుతారు. ♦ ఆరో రోజు అవెన్యూ ప్లాంటేషన్ చేపడతారు. గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటుతారు. మొక్కలకు ట్రీగార్డులు, సపోర్ట్కర్రలు ఏర్పాటు చేస్తారు. ♦ ఏడో రోజు పవర్ డే నిర్వహిస్తారు. ♦ ఎనిమిదో రోజు సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం చుట్టూ రెండు, మూడు వరసల్లో పెద్ద మొక్కలు నాటుతారు. గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ♦ తొమ్మిదో రోజు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త కార్యక్రమాలు నిర్వహిస్తారు. ♦ 10వ రోజు గ్రామసభ నిర్వహించి.. ఈ విడతలో చేపట్టిన పనుల వివరాలు తెలియజేస్తారు. దాతలు, పారిశుధ్య నిర్వహణలో సేవలు అందించిన సిబ్బందిని సత్కరిస్తారు. -
జిల్లాలు తిరగడానికి సీఎం అవ్వాలా ?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలు పర్యటించేందుకే పదవిలోకి వచ్చినట్టు ఉందని ప్రతిపక్షనేత జానారెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనే పనిగా భావిస్తున్నారని ఆయన విమర్శించారు. జానారెడ్డి శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..'హామీలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ (హైదరాబాద్) నుంచి ఇవ్వవచ్చు. అయినా ఆయన (కేసీఆర్) జిల్లాలు పర్యటిస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రబీకి నీళ్లిచ్చే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రబీకి నీళ్లిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. కృష్ణపట్నం విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరు అందించారు. ఇప్పుడెందుకు స్పందించడం లేదు' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.