breaking news
district strike
-
రాష్ట్రాన్ని దారుణంగా విభజించారు
సాక్షి, అనంతపురం : ‘రాష్ట్రాన్ని దారుణంగా విభజించారు. ఈ పాపం ఊరకే పోదు. విభజించిన కాంగ్రెస్‌ను, అందుకు సహకరించిన టీడీపీని భూస్థాపితం చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీల నేతలకు డిపాజిట్లు కూడా దక్కవు’ అంటూ సమైక్యవాదులు నిప్పులు చెరిగారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వైఎస్సార్సీపీ శ్రేణులు, సమైక్యవాదులు చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జన సందడితో కళకళలాడే నగరం, పట్టణాలు వెలవెలబోయాయి. హైదరాబాద్-బెంగళూరు, అనంతపురం-చెన్నై జాతీయ రహదారుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన జరగడం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లింద ని, అందుకు కారణమైన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, స్పీకర్ మీరా కుమార్, బీజేపీ జాతీయ నాయకురాలు సుస్మాస్వరాజ్ దిష్టి బొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. అనంతపురం నగరంలో వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకే పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. -
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు జిల్లా బంద్
వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పిలుపునిచ్చిన సుజయ్‌కృష్ణ రంగారావు, సాంబశివరాజు పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు పాల్గొనాలని విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, విజయనగరం: సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను, ఆవేదనను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభలో అప్రజాస్వామికంగా ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియంతృత్వ పోకడలకు నిరసనగా ఆ పార్టీ వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని, పార్టీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యవాదానికి కట్టుబడిన వారంతా బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. వ్యాపార, కార్మిక, ఉద్యోగ, కర్షక వర్గాలు సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన బిల్లును లోకసభలో ఆమోదించడం దారుణమని పేర్కొన్నారు. విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిపినా, ఎంత మొత్తుకున్నా సోనియాగాంధీ పట్టించుకోలేదన్నారు. రైతుల నోట మట్టికొట్టారని, నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌కు, దానికి సహకరించిన చంద్రబాబుకు, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.