మమతకు పెద్ద షాక్.. బీజేపీలోకి మాజీ రైల్వే మంత్రి!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చాలా గట్టి షాక్ తగిలింది. మమతకు అపర విధేయులనుకున్న సీనియర్ నాయకులు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టి.. అందులో అంశాలపై మమత ఆగ్రహానికి గురై అదేరోజు తన పదవికి రాజీనామా చేసిన రైల్వేశాఖ మాజీమంత్రి దినేష్ త్రివేది సహా నలుగురు మాజీ మంత్రులు కాషాయ జెండాలు కప్పుకోనున్నారు. 16 సంవత్సరాల పాటు తృణమూల్ కాంగ్రెస్లో అగ్ర నాయకుడిగా వెలుగొందిన త్రివేదీ.. ఇప్పుడు కొత్త మాటలు చెబుతున్నారు.
గత వారం గుజరాత్లో నరేంద్రమోదీ అన్న సోమాభాయ్ మోదీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో దినేష్ త్రివేది కూడా కనిపించారు. అంతేకాక.. నరేంద్రమోదీ అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడని ప్రస్తుతించారు. అంతేకాదు, మమతా బెనర్జీ పేరు ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లో ఇగోను వదిలేయాలని, ఆత్మగౌరవం ఉండాలని, అంతేతప్ప పొగరు ఉండకూడదని చెప్పారు. అదేసమయంలో మమత వ్యక్తిగతంగా చాలా మంచివారన్నారు. బెంగాల్ రాజకీయాల్లో మాఫియా ప్రమేయం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. మమత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మంజుల్ కృష్ణ ఠాకూర్ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇక వరుసపెట్టి మరింతమంది చేరడమే తరువాయి అని సమాచారం.