చట్టాలు చేతిలోకి తీసుకోకూడదు
నాగాలాండ్‌లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మూకుమ్మడిగా కొట్టిచంపడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జిలియాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికైనా చట్టాలున్నాయని, ప్రజలు అలా చట్టాలను చేతిలోకి తీసుకొని వ్యవహరించడం ఏమాత్రం సరికాదని అన్నారు. 'ఇది ఒక వర్గానికి సంబంధించిన విషయం కాదు. భద్రతా లోపానికి చెందిన తీవ్ర విషయం. ఎవరికివారిలా తమ చేతుల్లోకి చట్టాలను తీసుకోవడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఘటన మొత్తంపై దర్యాప్తు ప్రారంభించాం. జైలులోకి మూకుమ్మడిగా వచ్చిన వారిని గుర్తించనున్నాం. నేరస్తులపై ఖచ్చితంగా కేసులు పెడతాం' అని ఆయన అన్నారు.
సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఫరీద్‌ఖాన్ (35) అనే వ్యక్తి ఇరవయ్యేళ్ల నాగా యువతిపై గతనెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేసినట్లు కేసునమోదైంది. అనంతరం ఫిబ్రవరి 25న అతన్ని పోలీసులు అరెస్టు కోర్టులో అప్పజెప్పగా అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ప్రజలు నిందితున్ని జైలు నుంచి బయటకు ఈడ్చి కొట్టి చంపారు.