breaking news
Dial Your Collector program
-
‘మీ పనితీరు వెరీ పూర్’
కర్నూలు(అగ్రికల్చర్): ‘మీ పనితీరు ఏ మాత్రం బాగా లేదు. ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. వారం రోజుల్లో మార్పు కనిపించాలి. లేకపోతే ఉపేక్షించేది లేదు’ అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహులుపై కలెక్టర్ సీహెచ్ వియజమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ముగిసిన తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తలపై సమీక్ష నిర్వహించారు. పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నా స్పందన లేకపోవడాన్ని బట్టి మీ పనితీరు స్పష్టమవుతోందన్నారు. గతంలోనే వ్యాధులపై మ్యాపింగ్ చేయమని చెప్పినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ట్యాంకులను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాల్సి ఉందని కలెక్టర్ డీపీఓ శోభ స్వరూపరాణిని ప్రశ్నించారు. 15 రోజులకోసారి శుభ్రం చేయాలని ఆప్రకారమే చేస్తున్నామని సమాధానం ఇవ్వడంతో ఒక్క గ్రామంలోనైనా ఇలా చేస్తున్నట్లు నిరూపిస్తారా అని మండిపడ్డారు. వేంపెంట డీలర్ల అవినీతిపై విచారణ ఎంతవరకు వచ్చిదని డీఎస్ఓను ప్రశ్నించగా గ్రామానికి వెళ్లి విచారణ జరిపానని, డీలర్ అవినీతి నిర్ధారణ కావడంతో చర్యలకు ఆర్డీఓకు సిఫారసు చేశామని వివరించడంతో కలెక్టర్ వెంటనే ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడగా తనకు ఎటువంటి సిఫారసు రాలేదని సమాధానమిచ్చారు. దీంతో కలెక్టర్ డీఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీలరున్ సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, నీటి సమస్యపై పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫోన్ ద్వారా సమస్యలపై వినతులను స్వీకరించారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యల పరిష్కారం అంతంత మాత్రమే ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం వచ్చిన సమస్యలను వచ్చే వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించకపోతే కారణాలను తెలపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో జేసీ కన్నబాబు, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టికి వచ్చిన సమస్యలు పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలోని ఎస్సీ కాలనీలో కొందరు వ్యక్తులు నాటుసారా, మద్యం ఇళ్లలోనే విక్రయిస్తున్నారని, తక్షణమే అడ్డుకోవాలని ఓ వ్యక్తి కోరగా.. ఎక్సైజ్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి అదుపు చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీపం పథకం కింద గ్యాస్ కనె క్షన్లు జూన్, జూలైల్లో మంజూరు అయ్యాయని, అప్పుడు పంచాయతీ ఎన్నికల కారణంగా పంపిణీ చేయలేదని, ఇప్పుడు అడిగితే ఇవ్వడం లేదని ఆళ్లగడ్డకు చెందిన కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ డీఎస్ఓకు తగిన సూచనలు ఇచ్చారు. బేతంచెర్ల మండలం మండ్లవానిపల్లె గ్రామంలో తాగునీటిని ఇతరులు దౌర్జన్యంగా వ్యవసాయానికి వాడుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పంపి విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోని ఊరకుంటను కొందరు ఆక్రమించి వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని, పశువులకు నీరు లేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు విన్నవించగా.. చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.