breaking news
Dharam Veer Singh
-
సహజీవనం ప్రమాదకరమైన జబ్బు
న్యూఢిల్లీ: సహజీవనం ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాన్ని సమాజం నుంచి పూర్తి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సహజీవన విధానానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని కోరారు. లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పాశ్చాత్య దేశాల్లో సహజీవన సంబంధాలు సర్వసాధారణం. కానీ, ఈ చెడ్డ విధానం మన సమాజంలో వ్యాధి మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని పరిణామాలు భయంకరంగా ఉంటున్నాయి. ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్ధావాకర్, అఫ్తాబ్ పూనావాలా లివ్–ఇన్ రిలేషన్ షిప్ ఎంతటి దారుణానికి దారి తీసిందో చూస్తున్నాం’ అని గుర్తుచేశారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించే మనదేశంలో విడాకుల శాతం 1.1 శాతం మాత్రమేనన్నారు. అదే అమెరికాలో విడాకుల శాతం 40 శాతం వరకు ఉంటోందన్నారు. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇలాంటి బంధాల విషయంలో ఇరువైపులా తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించారు. సామాజిక, వ్యక్తిగత విలువలు, కుటుంబాల నేపథ్యాలను బట్టి పెళ్లిళ్లను పెద్దలు కుదర్చటం మన దేశంలో అనాదిగా వస్తోందని గుర్తు చేశారు. ‘వసుధైవ కుటుంబకమ్ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. మిగతా దేశాలతో పోలిస్తే మన సామాజిక వ్యవస్థ భిన్నమైంది. భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ భావనను యావత్తు ప్రపంచమే మెచ్చుకుంది’అని ఆయన తెలిపారు. -
ప్రధానికి 56 అంగుళాల జాకెట్!
జవాన్లపై దురాగతాలకు నిరసనగా పంపిన మాజీ జవాన్ భార్య ఫతేహాబాద్: భారత సైనికులపై దాడుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మాజీ సైనికుడి భార్య ప్రధాని మోదీకి లేఖ రాస్తూ దానితో పాటు మహిళలు ధరించే 56 అంగుళాల జాకెట్‌ను పంపారు. తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని ప్రధాని పలుమార్లు చెప్పడం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే భారత సైనికులపై దాడి చేయడానికి పాక్ జంకుతుందన్న 2014 ఎన్నికల నాటి బీజేపీ హామీనీ ఆ మహిళ ప్రస్తావించారు. తన భార్య సుమన్రాసిన ఆ లేఖను, జాకెట్‌ను మాజీ సైనికుడు ధరమ్వీర్ సింగ్ ఫతేహాబాద్ జిల్లా సైనిక్ బోర్డుకు అందజేశారు. ‘మన సైనికులను కొడుతున్న, రాళ్ల దాడికి గురవుతున్నట్లు చూపుతున్న వీడియోలు వెలుగుచూశాయి. 2014 ఎన్నికల సమయంలో.. .హేమరాజ్ లాగా మరో సైనికుడు శిరచ్ఛేదానికి గురికాడని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మహిళలు తమ పిల్లలు, సోదరులను దేశాన్ని కాపాడటానికి సరిహద్దుల్లోకి పంపుతున్నారు. రాళ్ల దాడికి గురవడానికో, శిరచ్ఛేదనానికో కాదు. ఆ 56 అంగుళాల ఛాతీ ఎక్కడికి పోయింది?’ అని లేఖలో ప్రశ్నించారు. -
పసందైన పండ్ల శుద్ధి యంత్రం!
పండ్లు, కలబంద, ఉసిరి రసం, గుజ్జు, ఎసెన్స్ తయారు చేస్తుంది విత్తనాలు పాడవకుండానే ఈ పనులు చేస్తుంది హర్యానా రైతు అద్భుత ఆవిష్కరణ.. టమాటా రైతులకు ఉపయోగకరం జీవితావసరం ఒక ఆవిష్కరణకు కారణభూతం అవుతుందనడానికి ఈ రైతు శాస్త్రవేత్త జీవితానుభవం ఉదాహరణగా నిలుస్తుంది. ధరమ్వీర్ సింగ్ కాంబోజ్(50) హర్యానాలోని యమునానగర్ నివాసి. అవరోధాలను మనోబలంతో ఎదుర్కొని బహుళ ప్రయోజనకారి అయిన యంత్రాన్ని కనుగొని రైతులోకానికే ఆదర్శంగా నిలిచాడు. పేద రైతు కుటుంబంలో జన్మించిన ధరమ్వీర్ తమకున్న పిండి మిల్లు, బెల్లం వండే బట్టీపనుల్లో తండ్రికి సాయపడేవాడు. పెద్దగా చదువుకోలేదు. పొట్టపోసుకోడానికి కొన్నాళ్లపాటు ఢిల్లీలో రిక్షా తొక్కాడు. కొత్తగా ఏదైనా చేయాలన్న తపన కలిగిన అతను తదనంతరం తమ ప్రాంతంలో మొట్టమొదటగా హైబ్రిడ్ టమాటా సాగు ప్రారంభించి అధిక దిగుబడి సాధించాడు. టేప్‌రికార్డర్ మోటారుతో పిచికారీ యంత్రం తయారు చేశాడు. చెరకు తోటలో అంతర సేద్యానికి ఉపకరించేపరికరాన్ని తానే తయారు చేసుకున్నాడు. నిత్యం కొత్తగా ఏదోఒకటి చేయాలని తపించే ధరమ్వీర్ రైల్వే స్టేషన్లో చెత్త ఊడ్చి, గచ్చు శుభ్రం చేసే యంత్రం తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఆ నేపథ్యంలో కలబంద వంటి ఔషధ మొక్కల సాగు వైపు ధరమ్వీర్ ఆలోచన మళ్లింది. కలబంద నుంచి గుజ్జు తీసే యంత్రం నెలకొల్పే ఆలోచనలో ఉండగా.. ఉద్యాన శాఖ ద్వారా రాజస్థాన్‌లో కలబంద, ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు చూసే అవకాశం దొరికింది. అక్కడి యంత్రాలను ధరమ్వీర్ క్షుణ్ణంగా పరిశీలించాడు. అవన్నీ ఖరీదైనవి కావడంతో ఒక యంత్రాన్ని తానే సొంతంగా తయారు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ పట్టుదలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 2006 ఏప్రిల్‌లో కలబంద గుజ్జు తీసే ఒక చిన్న యంత్రాన్ని తయారు చేశాడు. తర్వాత దాన్నే ఎసెన్స్ తీసే యంత్రంగా మార్చగలిగాడు. మార్పులు చేర్పులతో అనేక ఔషధ మొక్కలు, వ్యవసాయోత్పత్తులను శుద్ధిచేసి వివిధ ఉత్పత్తులు తయారు చేయడం ప్రారంభించాడు. గ్రామీణ ఆవిష్కర్తలకు గుర్తింపునిచ్చే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఆయనను ఎంతో ఉపయుక్తమైన ఆవిష్కరణకు దోహదపడిన రైతు శాస్త్రవేత్తగా గుర్తించింది. యంత్రాన్ని మరింత మెరుగుపరచి, అందంగా తీర్చిదిద్దింది. ప్రయోజనాలెన్నో..: ఆహార, ఔషధ పరిశ్రమల కోసం పండ్లు, కూరగాయల నుంచి గుజ్జు/రసం, చమురు, ఎసెన్స్‌ను తయారు చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. అలాగని భారీ యంత్రం కాదు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. సింగిల్ ఫేజ్ మోటారుతో పనిచేస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణ, ఆటో కటాఫ్ సదుపాయాలున్న పెద్ద ప్రెజర్ కుక్కర్ మాదిరిగా ఉంటుంది. పూలు, ఔషధ మొక్కల నుంచి ఎసెన్స్, రసాలను ఔషధ గుణాలు పోకుండా సంగ్రహించగలదు. అన్నిటికన్నా ముఖ్యంగా.. పండ్లు, కూరగాయలను శుద్ధి చేసేటప్పుడు వాటి విత్తనాలు దెబ్బతినకుండా వేరుచేస్తుంది. రాష్ట్రపతి పురస్కారం ఎన్ఐఎఫ్ సిఫారసు మేరకు 2009లో హర్యానా రాష్ట్ర అవార్డును, 2012లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ జాతీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నాడు ధరమ్వీర్. పేటెంట్ కోసం దరఖాస్తు చేశాడు. ఇప్పటి వరకు 90 యంత్రాలను అమ్మాడు. సొంతంగా కలబంద, ఉసిరి, తులసి తదితర ఔషధ మొక్కలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ.. వాటి నుంచి ఎసెన్స్, రసాలు, పొడులు, తలనూనెలు, స్వీట్లు తదితర ఉత్పత్తులను తయారు చేసి ఏటా రూ.40 లక్షల వ్యాపారం చేస్తున్నాడు. 20 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు. గంటకు 50 కిలోల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన యంత్రం ధర రూ.70 వేలు. గంటకు 150 కిలోల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన యంత్రం ధర రూ. లక్షన్నర. ఔషధ మొక్కలు, మామిడి, టమాటా వంటి పంటలు సాగుచేసే రైతులు ఈ యంత్రం సాయంతో ధరమ్వీర్ మాదిరిగా అధికాదాయం పొందే అవకాశం ఉంది. వివరాలకు: పల్లెసృజన, 122, వాయుపురి, సైనిక్‌పురి పోస్ట్, సికింద్రాబాద్-500094 ఫోన్: 040-27111959. విశ్రాంత బ్రిగేడియర్ గణేశం: 98660 01678