breaking news
Dexamethasone
-
డెక్సామెథాసోన్కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి డెక్సామెథాసోన్ స్టెరాయిడ్‌ను ఉపయోగించేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కేవలం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రమే డెక్సామెథాసోన్ వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధి పరిస్థితుల్లో ఉపయోగించే డెక్సామెథాసోన్‌ను కరోనాతో వెంటిలేర్‌పై ఉన్న వారికి, ఆక్సిజన్ సహాయం కావాల్సిన వారికి ఎక్కువ ధరతో కూడిన మిథైల్‌ప్రిడ్నిసోలోన్‌కు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన మెథాసోన్‌ను ఉపయోగించవచ్చని పేర్కొంది. ఈ డెక్సామెథాసోన్‌పై బ్రిటన్‌లో అనేక క్లినికల్ ట్రయల్స్ జరిగిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టెరాయిడ్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పిలుపునిచ్చింది. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు?) ఇటీవల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఓ బృందం నేతృత్వంలోని పరిశోధకులు కరోనాతో ఆస్పత్రిలో చేరిన 2 వేల మందికి పైగా రోగులకు డెక్సామెథాసోన్ ఇచ్చారు. అయితే వీరిలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్న వారు, ఆక్సిజన్ సహాయం అందిస్తున్న వారి మరణాలను రేటును 35 శాతం తగ్గించింది. తక్కువ ధరకు లభించే స్టెరాయిడ్ గత 60 ఏళ్లుగా మార్కెట్లో లభిస్తోంది. కాగా భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం కొత్తగా 18,552 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, మొత్తం కేసుల సంఖ్య 5,08,953కు చేరింది. కరోనాతో తాజాగా 384 మంది మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు మొత్తం 15,685 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. (కరోనా: రెమ్డిసివిర్ మొదట ఆ అయిదు రాష్ట్రాలకే) -
కరోనాకు ఇందులో ఏది సరైన మందు?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా బాధ పడుతున్న రోగులకు ‘డెక్సామెథాసోన్’ అనే స్టెరాయిడ్ బాగా పని చేస్తోందంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ స్టెరాయిడ్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రస్తుతం కరోనా రోగులపై ఈ స్టెరాయిడ్ ప్రయోగాలు బ్రిటన్‌లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత స్టెరాయిడ్ పరీక్షల ఫలితాలు వెలుగులోకి వచ్చే వరకు కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న ఏకైక మందు ‘హైడ్రాక్సిక్లోరోక్విన్’ మాత్రమే అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మలేరియాకు వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను పెద్ద ఎత్తున అమెరికా, భారత్ నుంచి దిగుమతి చేసుకొంది. అసలు ఈ రెండు ఔషధాల్లో ఏదీ ఉత్తమమైనది? ఏదీ ప్రయోజనకరం? ఎంతమేరకు? కరోనా రోగులపై ‘హైడ్రాక్సిక్లోరోక్విన్’ నూటికి నూరు శాతం విజయవంతం అయినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కరోనాతో తీవ్రంగా బాధ పడుతున్న రోగులపై జరిపిన ప్రయోగాల్లో ఈ మందు ఎలాంటి ప్రభావాన్ని చూపలేక పోయింది. అంటే పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత కరోనాతో స్వల్పంగా బాధ పడుతున్న రోగులపై ప్రయోగాలు జరిపారు. ఆ ప్రయోగాల వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిందిగా అంతకు ముందు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు జూన్ 15న అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయ ట్రయల్స్ నుంచి దీన్ని ఉపసంహరిస్తూ జూన్ 17వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు జారీ చేసింది. డెక్సామెథాసోన్ అంటే ఏమిటీ? స్టెరాయిడ్‌గా పిలిచే ఈ మందు కృత్రిమ హర్మోన్. మనిషిలో కుడివైపు కిడ్నీకి ఎగువ భాగాన టోపీ ఆకారంలో అడ్రినల్ గ్రంధి ఉంటుంది. అనేక రకాల వైరస్‌లను ఎదుర్కొనేందుకు అడ్రినల్ గ్రంధి డెక్సామెథాసోన్ లాంటి సహజ సిద్ధమైన హార్మోన్‌ను విడుదల చేస్తోంది. ఈ గ్రంధి లేకుండా పుట్టే బిడ్డలు అర గంటలో మరణిస్తారు. ఆ హార్మోన్ కొందరిలో తక్కువగా విడుదలవుతుంది. వయస్సు రీత్యా కూడా ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో సహజ సిద్ధంగా వైరస్‌లను ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఇలాంటి అవసరాల్లోనే ఈ కృత్రిమ స్టెరాయిడ్ పుట్టుకొచ్చింది. వైరస్ల ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ స్టెరాయిడ్‌ను వాడుతున్నారు. ట్యాబ్లెట్లు, ఆయింట్మెంట్, నరాల ఇంజెక్షన్ల రూపాల్లో ఈ మందు అందుబాటులో ఉంది. వెన్నుముఖ క్యాన్సర్లకు, కొన్ని రకాల టీబీలకు, మెదడు వాపుకు, ఆస్తమాలను నయం చేయడానికి, కీమో థెరపి చికిత్స వల్ల వాంతులు కాకుండా నివారించేందుకు ఈ స్టెరాయిడ్‌ను విరివిగా వాడుతున్నారు. ఏఆర్డీఎస్ చికిత్స కోసం దీన్ని వాడినప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కరోనా చికిత్సపై ప్రభావం కరోనాపై డెక్సామెథాసోన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం నేడు బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ ఆధ్వర్యంలోని 175 ఆస్పత్రుల్లో ప్రయోగాలు నడుస్తున్నాయి. తాము జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయంటూ ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది. వెంటిలేటర్ల ఉన్న కరోనా రోగులపై ఈ మందును ప్రయోగించగా, మూడింట ఒక వంతు మంది కోలుకున్నారని, అది వెంటిలేటర్‌పై లేకుండా ఉన్న రోగులపై ప్రయోగించగా ఐదింట రెండు వంతుల మంది కోలుకున్నారని తెలిపింది. వాస్తవానికి దీన్ని విజయం కింద పేర్కొనరు. వీటిని మిశ్రమ ఫలితాలుగానే చెబుతారు. ఎన్హెచ్ఎస్ ఆస్పత్రుల పరిశోధనల ఫలితాలు వెలువడితేనే ఓ స్పష్టత లభిస్తుంది. (కరోనా వ్యాక్సిన్‌పై ‘జాతీయవాదం’ తగదు)