తల నరికేసి.. ఆపై విచిత్రంగా..!
లక్నో: మాదకద్రవ్యాల (డ్రగ్స్)కు బానిసగా మారిన ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి చిన్నారి తల నరికేశాడు. అనంతరం బాలుడి శరీర భాగాన్ని తినడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన యూపీలోని పిలిభిత్ జిల్లా అమారియాలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్పీ దేవ్రంజన్ వర్మ కథనం ప్రకారం.. మహ్మద్ యోనిస్ అనే ఏడేళ్ల బాలుడు తన బంధువు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. దాదాపు ఇరవై అయిదు ఏళ్లు ఉన్న యువకుడు నజీమ్ ఏదో మత్తులో ఉన్నాడు.
ఆడుకుంటున్న మోనిస్ ను బంధువు ఇంట్లోకి లాక్కెళ్లిపోయి క్షణాల్లో అతడి తల నరికివేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడి హత్య గురించి తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. బాలుడి మొండెం, తల భాగాలలో కొంత మేరకు శరీర భాగాలు మిస్సయినట్లు గుర్తించారు. నిందితుడు నజీమ్ ఎలాంటి ప్రతిఘటన లేకుండా పోలీసులకు లొంగిపోయాడు.
ఆ సమయంలో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడికి దిగగా, పోలీసులు సురక్షితంగా నిందితుడిని పీఎస్కు తరలించారు. మోనిస్ తండ్రి ఫిర్యాదు మేరకు నజీమ్ మీద కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 302(హత్య), 362 (కిడ్నాప్), 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి శరీర భాగాలను తాను తిన్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. బుధవారం నిందితుడిని పిలిభిత్ కోర్టులో ప్రవేశపెట్టగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తిచేసి తుది నివేదికను, ఛార్జిషీటును కోర్టును కోర్టుకు అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ దేవ్రంజన్ వివరించారు.