breaking news
development of the villages
-
ముగిసిన ‘మన ఊరు-మన ప్రణాళిక’
ఆదిలాబాద్ అర్బన్ : పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘మనఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాలు ముగిశాయి. గ్రామ, వార్డు, మండల, జిల్లా మూడు దశల్లో తయారు చేస్తున్న ఈ ప్రణాళికలో భాగంగా మొదటి దశ అయిన గ్రామాల్లో పూర్తయ్యింది. గ్రామాల్లో ఈనెల 13 నుంచి 18 వరకు ఆరు రోజుల పాటు కొనసాగాయి. ప్రజా అవసరాలు, వసతులు, సహజ వనరులు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సామాజిక అభివృద్ధికి గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు తయారు చేశారు. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారి, సర్పంచ్, గ్రామాధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ ప్రణాళికలకు రూపకల్పన వచ్చింది. ప్రజల సమక్షంలోనే ఆయా అంశాలను చేర్చిన అధికారులు తదుపరి సర్పంచ్ ఆమోదంతో మండలానికి పంపారు. ఈ ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రణాళికపై ప్రజలకు అవగాహన కల్పించే వాల్ పోస్టర్లు కార్యక్రమం ముగింపు సమయంలో జిల్లాకు రావడం కొసమెరుపు. గ్రామ ప్రణాళిక తయారు.. గ్రామ పంచాయతీ అభివృద్ధి అంచనా, వ్యయం, జీపీ ఆదాయం, జీపీ పరిధిలోని ప్రభుత్వ భూమి, సహజ వనరులు, చెరువులు, కుంటలు, కాలువలు, చెక్‌డ్యామ్‌లు, గ్రామ జనాభా, వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలలు, తాగునీరు, పంచాయతీ పరిధిలో ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రణాళిక, స్మశాన వాటికలు, డంపింగ్ యాడ్స్, మౌలిక సదుపాయాలతోపాటు గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన అంశాలన్నీ ఈ ప్రణాళికలో చేర్చారు. ఇదిలా ఉంటే.. కొన్ని పంచాయతీల్లో భూ పంపిణీ కార్యక్రమం కింద తమకు భూ పంపిణీ చేయాలని కొంత ప్రజలు కోరగా, ఆ అంశం ఇందులో లేదని వెనక్కి పంపించినట్లుగా ప్రజలు పేర్కొంటున్నారు. మండల ప్రణాళిక తయారీ ఇలా.. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల మండలాధికారుల సమన్వయంతో మండల స్థాయి ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. మండలంలోని అన్ని గ్రామస్థాయి ప్రణాళికలను క్రోడీకరించి పూర్తి మండల స్థాయి ప్రణాళికను మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదింపజేస్తారు. ఇలా ఆమోదించిన మండల ప్రణాళికను జిల్లా పరిషత్‌కు పంపాల్సి ఉంటుంది. తయారీకి మంత్రి రాక.. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం కింద మండల స్థాయి ప్రణాళికల తయారీ కార్యక్రమాలు ఈనెల 19 నుంచి 23 వరకు మండలాల్లో కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం బెల్లంపల్లి, రెబ్బెన మండలాల్లో నిర్వహించే మండల ప్రణాళికల తయారీకి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న హాజరుకానున్నారు. -
వైఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
ముదిగుబ్బ, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వైఎస్సార్ సీపీ నేత, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. మండలంలోని పులివెందుల రోడ్డు నుంచి నక్కలపల్లి వరకు రూ. 77.25 లక్షల పీఎంజీఎస్‌వై నిధులతో తారురోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే శిలా ఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు పథకంతో అన్ని గ్రామాలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. మండలంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. తమ హయాంలో చిన్నకోట్ల గ్రామానికి రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. మండల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు రూ. 14.50 కోట్ల వ్యయంతో సత్యసాయి తాగునీటి పథకం పనులు పూర్తయ్యాయని, త్వరలో దీన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. నక్కలపల్లికి కూడా సత్యసాయి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తోనే సమైక్యాంధ్రప్రదేశ్ సాధ్యమన్నారు. కార్యక్రమంలో ధర్మవరం మార్కెట్ యార్డు చైర్మన్ రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణరెడ్డి, దొరిగిల్లు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.