breaking news
Dengue victims
-
దోమల ఉత్పత్తి కేంద్రం ‘రామతీర్థం’
► నిరుపయోగంగా ఉన్న క్వారీ గుంతలే దోమల కేంద్రాలు ► అటకెక్కిన దోమలపై దండయాత్ర ► గంబూషియా చేపలను వదిలి చేతులు దులుపుకున్న అధికారులు ► రామతీర్థం, చీమకుర్తి, చుట్టుపక్కల గ్రామాల్లో విషజ్వరాలు, డెంగీ బాధితులు ► చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం చీమకుర్తి రూరల్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామతీర్థం గెలాక్సీ గ్రానైట్‌కే కాదు దోమల ఉత్పత్తికి కూడా పేరుగాంచిందే. ఒకటి రెండురోజులు రామతీర్థంలో నిద్రిస్తే మలేరియా, డెంగీ, లేక ఇతర విషజ్వరాలు రావాల్సిందే. రామతీర్థంలోని ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఎవరైనా ఉంటే రాత్రుళ్లు అక్కడ నిద్రించ వద్దని సంతనూతలపాడు ప్రభుత్వాసుపత్రికి చెందిన ఒక డాక్టర్ స్థానిక వైద్య సిబ్బంది ద్వారా సంతనూతలపాడు వాసులకు తెలియజేయడం చూస్తే దోమల ప్రభావం రామతీర్థం, దాని పరిసరాల్లో ఎంత ఎక్కువుగా ఉందో తేట తెల్లమవుతుంది. గ్రానైట్ గుంతలే టార్గెట్ రామతీర్థంలో దోమలు ఎక్కువుగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడ ఖాళీగా నిరుపయోగంగా ఉన్న గ్రానైట్ గుంతల్లో ఏళ్ల తరబడి నిల్వ ఉన్న నీరే. దోమలు పెరగడానికి ఆ నీరే ప్రధాన వనరుగా మారింది. ఇలాంటి క్వారీలు దాదాపు 50కి పైగా ఉన్నాయి. వాటితో పాటు రామతీర్థం పుణ్యక్షేత్రంలో కోనేరు, ఆలయాలు, సత్రాలకు చెందిన బావులు మరో పది వరకు ఉన్నాయి. వాటిలో ఎప్పుడో కార్యక్రమాల సమయంలో తప్ప భక్తులు ఆ నీటిని వాడే అవకాశం రాదు. అందువలన నీరు నిలకడగా ఉండటం వలన దోమల లార్వాలు పెరిగి దోమలుగా మారడానికి అనుకూలంగా ఉందని మలేరియా డిపార్టుమెంట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విషజ్వరాలు నమోదు దోమల వలన వచ్చిన మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి విషజ్వరాలు చీమకుర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించడానికి అనూకూలంగా మారింది. ఫలితంగా చీమకుర్తి మండలంలో నెలకు 30–40కు పైగా విషజ్వరాలు, మలేరియా, చికున్ గున్యా కేసులు నమోదు అవుతున్నాయి. మండలంలోని దేవరపాలెం, పాటిమీదపాలెం, బండ్లమూడి గ్రామాల్లో వందల సంఖ్యలో స్థానికులు విష జ్వరాలతో మంచానపడిన సంగతి తెలిసిందే. గంబూషియా చేపల ప్రభావం నామమాత్రమే దోమల నివారణకు అధికారులు గంబూషియా చేపలను వదులుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రామతీర్థంలోని ఖాళీగా ఉన్న క్వారీ గుంతలు, మోక్షరామలింగేశ్వరస్వామి, గంగమ్మ ఆలయాలు, సత్రాలు, కోనేరు వద్దనున్న 19 ప్రాంతాలను ఎంపిక చేసి లక్షకు పైగా గంబూషియా చేపలను స్వయంగా డీఎంఓ నాగేంద్రయ్య గుంతల్లో వదిలిపెట్టారు. ఇలా గత ఐదేళ్లలో ఇప్పటికీ నాలుగు సార్లు గంబూషియా చేపలను వదిలిపెట్టారు. గతంలో చేపలతో పాటు ఆయిల్‌బాల్స్, మడ్డి ఆయిల్‌ను నీటి గుంతల్లో చల్లేవారు. అప్పటి చేపలు ఇప్పడూ కూడా ఉన్నాయి. కానీ మలేరియా రోగాలు తగ్గడం లేదు కదా..అదనంగా డెంగీ జ్వరాలు చుట్టుకున్నాయి. దోమల నివారణకు ప్రభుత్వం అట్టహాసంగా ఏడాది క్రితం ప్రారంభించిన దోమలపై దండయాత్ర కార్యక్రమం అటకెక్కింది. గ్రామాల్లో కనీసం నెలకోసారైనా దోమలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఊరంతా జ్వరాలతో మంచాన పడితే ఆ రెండు మూడు రోజులు హడావుడి చేయడం తప్ప గ్రామాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. గంబూషియా చేపలు వదిలాం దోమల నివారణకు రామతీర్థం కేంద్రంలోని క్వారీ గుంతల్లో గంబూషియా చేపలను వదిలాం. దోమల లార్వాలను తినడం వలన దోమలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. – నాగేంద్రయ్య, డీఎంఓ -
డెంగీ పంజా
ఉట్నూర్ : జిల్లా వ్యాప్తంగా 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. మూడు నెలల కాలంలో పెంబి, మందమర్రి, భీమిని, లింగాపూర్, ఇంద్రవెల్లి, కడెం, బెల్లంపల్లి, అడ, లక్ష్మణచాంద, వెలుమలబోబ్బారం, సారంగాపూర్, ఉట్నూర్ పీహెచ్‌సీల పరిధిలోని 23 సబ్‌సెంటర్లు, 56 గ్రామాల్లో వైద్య పరీక్షలు జరిగాయి. 940 మందికి పరీక్షలు నిర్వహించగా 300మందికి పైగా అనుమానాస్పద కేసులు, 45 డెంగీ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. జిల్లాలో సరైన వైద్యం అందక ప్రజలు పొరుగు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోజూ జిల్లా నుంచి పదుల సంఖ్యలో డెంగీ బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కరీంనగర్, నిజామాబాద్, యావత్మాల్ వంటి ప్రాంతాలకు పోతున్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి డెంగీ కేసుల సంఖ్య తక్కువ చేసి చూపిస్తుందనే ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. అధికారులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నా వెలుగులోకి రాని కేసులు వందల సంఖ్యలో ఉంటాయని సంబంధిత అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు డెంగీ సోకిన మామూలు జ్వరంలా భావిస్తూ పీహెచ్‌సీల్లో చికిత్స తీసుకుని ఇంటిముఖం పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండు ప్రాంతాల్లోనే డెంగీ నిర్ధారణ కిట్స్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ కారక దోమల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. డెంగీ వ్యాధిని నిర్ధారణ చెసే పరీక్ష కేంద్రాలు జిల్లాలో కేవలం రిమ్స్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. దీంతో స్థానికంగా వైద్యులు డెంగీ అని నిర్ధారణ చేయడమే ఆలస్యం చికిత్స కోసం కరీంనగర్ వంటి పట్టణాలకు తరలి పోతున్నారు. కాగా, ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి దయనీయంగా మారింది. అడవిబిడ్డలు డెంగీ నిర్దారణ అవుతున్నా రిమ్స్, మంచిర్యాల వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాధి నిర్దారణ చేసుకునేంత స్థోమత లేక పోవడంతో పీహెచ్సీ, గ్రామాల్లోకి వచ్చే ఆర్ఎంపీలతో వైద్యం చేయించుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. గిరిజనుల సౌకర్యం కోసం డెంగీ నిర్దారణ కిట్స్ ఉట్నూర్ కేంద్రంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు కోరుతున్నారు. అధికారులు మాత్రం డెంగీ నిర్దారణ కిట్స్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని పేర్కొంటున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తుండటంతో పట్టించుకునే వారు కానరావడం లేదు. గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు విడుదలైనా సదరు సర్పంచ్‌లు పూర్తిస్థాయిలో పారిశుధ్య నివారణకు ఖర్చుచేయడం లేదు. ఇంకా, పారిశుధ్య నివారణకు సబ్‌సెంటర్లకు వచ్చే అన్‌టైడ్, గ్రామ పంచాయతీలకు వచ్చే శానిటేషన్ నిధుల్లో ఎన్ఆర్హెచ్ఎం భారీ కోత పెట్టడంతో గ్రామాల్లో పారిశుధ్యం, క్లోరినేషన్ పట్టించుకునే వారు లేకుండా పోయారు. దోమల నివారణకు గ్రామాల్లో మొదటి విడతలో భాగంగా దాదాపు రూ.12.50 లక్షలతో ఐఆర్ఎస్ స్ప్రే చేయించామని అధికారులు చెబుతున్నారు. 866 గ్రామ పంచాయతీల్లో రూ.21.06 లక్షల వ్యయంతో 1,056 లీటర్ల బెటైక్ స్ప్రే చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నా మారుమూల ప్రాంతాల్లో కానరావడం లేదు. ఫలితంగా గ్రామాల్లో దోమల వ్యాప్తి వేగంగా విస్తరిస్తూండటంతో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకుని, బాధితులకు సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు పాటిస్తే సరి.. వైరస్ వల్ల సోకే ఈ వ్యాధి ఏడిస్ రకం దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమలు పగలు, రాత్రి కుడుతాయి. చిన్నగా, నల్లగా ఉండే ఈ దోమలపై తెల్లని మచ్చలుంటాయి. ఈ దోమలు మురుగులో జీవించలేవు. ఇళ్లలోని ఖాళీ కుండీలు, నీటితొట్టెలు, తాగేసిన కొబ్బరి బొండాలు, వాడని వాహనాల టైర్లలో నిలిచే నీటిలో మాత్రమే పెరుగుతాయి. ఇళ్లతోపాటు పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా డెంగీ బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు.. డెంగీ జ్వరం, డెంగీ హెమరేజ్, డెంగీ షాక్ సిండ్రోమ్ లక్షణాలు కల్గించే ఈ వ్యాధి హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరంతో మొదలవుతుంది. కాళ్లు కదిలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు వస్తాయి. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన, బరువు వేగంగా తగ్గడం వంటివి వ్యాధి ప్రధాన లక్షణాలు. దీంతో రోగి శరీరంలో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాలు కోల్పోతాడు. సకాలంలో వైద్యుడిని ఆశ్రయించి చికిత్స పొందాలి. వ్యాధి తగ్గే వరకు ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంగీ నివారణ అంటే... దోమలనుంచి రక్షించు కోవడమనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సాధ్యమైనంత వరకు శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులు వాడటం అవసరం. దోమతెరలు వాడాలి. ఇంటి కిటికీలు, తలుపులకు జాలీలు బిగించుకోవాలి. ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలి. నీటి తొట్టెలను వారం రోజులకు ఒక సారి ఖాళీ చేసి, శుభ్రం చేసి మళ్లీ నింపుకోవాలి. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, పనికి రాని వస్తువులు ఇంటితోపాటు పరిసరాల్లో లేకుండా చేసుకోవాలి. ఎయిర్ కూలర్, ఎయిర్ కండీషనరు, ఫ్లవర్‌వాజ్, ఫిష్ అక్వెరియాల్లో తరుచూ నీటిని మార్చాలి. వాటర్ ట్యాంక్‌ల మూతలను వేసి ఉంచాలి. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు చల్లించుకోవాలి. లార్వాలను నివారించడానికి కాల్వల్లో గంబ్యూసియా చేపలను వదలాలి.