కుక్క కాటుకు ‘భారీ’ వ్యాజ్యం
న్యూయార్క్: కుక్క కరిచినందుకు నష్టపరిహారంగా లెక్కపెట్టలేనంత మొత్తాన్ని డిమాండ్ చేస్తూ అమెరికాలో ఒక వ్యక్తి కోర్టుకెక్కారు. అత్యధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ వ్యాజ్యం దాఖలు చేయడంలో ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన అంటోన్ పురుసిమా(62) మాన్‌హట్టన్ నివాసి. ఇటీవల కుక్క కాటుతో గాయపడడంతో మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో నష్టపరిహారం కోసం వ్యాజ్యం దాఖలు చేశాడు. తన ఫిర్యాదులో ఎన్వైసీ ట్రాన్సిట్, స్థానికంగా ఉన్న రెండు ఆసుపత్రులు, కుక్క యజమానిని ప్రతివాదులుగా చేర్చాడు. తనకు తాను లాయర్‌గా కంటే మ్యాథమెటీషియన్గా ఎక్కువగా చెప్పుకోడానికి ఇష్టపడే అంటోన్ తన పౌరహక్కులకు భంగం కలిగాయని, తనపై హత్యాయత్నం జరిగిందని కోర్టుకు దాఖలు చేసిన 22 పేజీల వ్యాజ్యంలో పేర్కొన్నాడు.
అతను ఎంతమొత్తానికి నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాడో తెలుసా... 2 డాలర్ల పక్కన 36 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అంతకు .... దాన్ని రూపాయల్లో మార్చితే రూ. 116,000,000,000,000,000,000,000,000,000,000,000,000 గా చెప్పాలి. లెక్కపెట్టలేనంత మొత్తం కావాలని కోర్టుకెక్కిన ఇతగాడు చివరకు తనకు కలిగిన బాధ, నష్టాన్ని డబ్బులతో పోల్చలేనని చెప్పడం విశేషం. ఇక తన దావాలో సాక్ష్యం కోసం రక్తమోడిన చేతివేలి ఫొటోను కూడా జత చేశాడు. అంతేకాదండోయ్... తన వ్యాజ్యంలో కేవలం కుక్కకాటుకు సంబంధించిన అంశం మాత్రమే కాకుండా, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పుడు చైనా దంపతులు తన ఫొటో తీయడం, కాఫీపై ఎక్కువ డబ్బులు తీసుకున్నందుకు ఎయిర్‌పోర్టులోని ఒక హోటల్‌పై కూడా ఫిర్యాదు చేశాడు.