breaking news
dead bod
-
మరో వివాదంలో పద్మావతి
జైపూర్: పద్మావతి వివాదం మరో మలుపు తీసుకుంది. శుక్రవారం జైపూర్‌లోని ఒక కోటకు వేలాడుతూ కనిపించిన వ్యక్తి మృతదేహం పద్మావతి సినిమాపై తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. నహర్‌గఢ్ కోట ప్రహారీ గోడకు వేలాడుతున్న చేతన్ కుమార్ సైనీ(40) మృతదేహం పక్కన పద్మావతి సినిమా వ్యతిరేకించే వారిని హెచ్చరిస్తూ కొన్ని రాతలు దర్శనమిచ్చాయి. తమను బెదిరించడానికే ఆ రాతలు రాశారని రాజ్‌పుత్ కర్ణిసేన ఆరోపించగా, పద్మావతి సినిమాతో సైనీ మరణానికి ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు చెప్పడం గమనార్హం. సైనీది హత్యా? లేక ఆత్మహత్యా?.. పద్మావతి సినిమాతో ఈ మరణానికి ఏమైనా సంబంధముందా? అన్న అంశాలపై మాత్రం సందిగ్ధం వీడలేదు. ఈ సంఘటనపై జైపూర్ నార్త్ డీసీపీ సత్యేంద్ర సింగ్ సందిస్తూ.. ‘చేతన్ కుమార్ జైపూర్‌లోని శాస్త్రీ నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు. కోట సరిహద్దు గోడకు అతని మృతదేహం వేలాడుతోండగా గుర్తించాం. పక్కన రాళ్లపై కొన్ని రాతలు కనిపించాయి. ఈ సంఘటనకు పద్మావతి ఆందోళనలకు మధ్య సంబంధంపై ఇప్పుడే అంచనాకు రావడం సరికాదు’ అని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. మృతదేహం సమీపంలోని రాళ్లపై ‘ మేం కేవలం దిష్టిబొమ్మల్ని మాత్రమే వేలాడదీయమని పద్మావతి వ్యతిరేకులు తెలుసుకోవాలి. మేం బలవంతులం’ అని రాసి ఉంది. అయితే సైనీ మృతికి, పద్మావతి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరుడు రామ్ రతన్ సైనీ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని, ఈ మరణంపై ఉన్నత స్థాయి విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా రాజ్‌పుత్ కర్ణి సేన దీనిపై స్పందిస్తూ... నిరసన తెలిపే విధానం ఇది కాదని, తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఆ సంస్థ అధ్యక్షుడు మహిపాల్‌సింగ్ మాట్లాడుతూ ‘మా సంస్థను బెదిరించేందుకే రాళ్లపై ఆ రాతలు రాశారు’ అని చెప్పారు. పద్మావతిపై పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు పద్మావతి సినిమాపై పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. పద్మావతిలో చరిత్రను వక్రీకరించారా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సినిమా విడుదలకు ముందు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ‘మీరు సినిమా చూశారా.. సినిమా హాళ్లను తగులబెడుతున్నవారు సినిమా చూశారా? ఆందోళన చేస్తున్నవారిని మరింత ప్రోత్సహించేలా ఈ పిటిషన్లు ఉంటున్నాయి’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్ల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
మృతుని ఆచూకీ కోసం రైల్వేపోలీసులు ఆరా
నెల్లూరు(క్రైమ్) : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో ఆదివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలులోనుంచి జారిపడి తీవ్రగాయాలయ్యాయి. దీంతో రైల్వే సిబ్బంది అతడిని పట్టాలపై నుంచి బయటకు తీసుకొచ్చి వివరాల కోసం ఆరాతీయగా తనది నెల్లూరు అని చెప్పాడు. కొద్దిసేపటికే అతను ప్లాట్‌ఫారంపై మృతిచెందాడు. దీంతో రైల్వేపోలీసులు మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అతని ఆచూకీ కోసం రేణిగుంట రైల్వేపోలీసులు మృతుని ఫొటోను తీసుకుని సోమవారం నెల్లూరుకు చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో జరిగిన విషయం తెలియజేసి మృతుని ఆచూకీ కోసం అన్నీ పోలీసుస్టేషన్లలో సమాచారం అందించారు. వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని వారు సూచించారు.