breaking news
credites
-
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం : కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ గ్రామానికి చెందిన అబ్బటి రాము(28) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాము తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. గతకొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపోవడంతో అప్పులపాలయ్యాడు. గత సంవత్సరం రెండెకరాల భూమిని అమ్మి కొంత మేరకు అప్పులు చెల్లించాడు. ఇంకా సుమారు రూ.10 లక్షల వరకు అప్పులున్నాయి. దీంతో మనస్తాపం చెందిన రాము గురువారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన తండ్రి నర్సయ్య చికిత్స నిమిత్తం మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. రాము చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. అతడికి భార్య సుమ ఉంది. -
పరిహారం కోసం ఎదురుచూపులు
రైతు ఆత్మహత్య చేసుకుని మూడేళ్లు.. పరిహారం కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షణలు ధర్మారం : భూమిని నమ్ముకుని లక్షల పెట్టుబడులు పెడుతున్న రైతులకు అప్పులే మిగులుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ పైరవీలు లేనిదే పని కావడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన రుద్ర లచ్చయ్య–మమత దంపతులు తమకున్న ఎకరం వ్యవసాయ భూమితో పాటు మరో 9ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగుచేశారు. వ్యవసాయానికి వాతావరణం అనుకూలించకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల బాధలు అధికం కావడంతో వాటిని తీర్చేమార్గం కనిపించకపోవడంతో లచ్చయ్య 2013 మార్చి 30న క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతిని అధికారులు రైతు ఆత్మహత్యగా గుర్తించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. నివేదికను పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికి పంపిస్తామని వారు చెప్పారు. పరిహారం అందించగానే అప్పులు చెల్లిస్తానని బాకీదారులతో మమత చెప్పుకొచ్చింది. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో మమత రెవెన్యూ కార్యాలయం బాటపట్టింది. దాదాపు ఆరు నెలలపాటు తిరిగిన మమతకు నివేదికను కలెక్టర్‌కు పంపించామని, అక్కడి నుంచి రావాలనే అధికారులు చెప్పడంతో ఆమె కార్యాలయానికి వెళ్లడం మానేసింది. మరో ఘటనలో చకాచకా.. మండలంలోని బంజేరుపల్లి గ్రామానికి చెందిన నునావత్ రాంజీనాయక్ ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకోగా.. అధికారులు రైతు ఆత్మహత్యగా పరిగణించిన అధికారులు విచారణ జరిపారు. సంబంధిత ఫైల్‌ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీవో, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు యుద్ధప్రాతిపదికన పంపించారు. ప్రభుత్వం ద్వారా నెల క్రితం రూ.5లక్షల పరిహారం ప్రభుత్వం బాధిత కుటుంబానికి అందించింది. అయితే రాంజీనాయక్ కుటుంబానికి రాజకీయ నాయకుడి అండ ఉండడంతో అధికారులతో సంప్రదించి నివేదిక ఫైల్‌ను ప్రభుత్వానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సదరు రైతుకు ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించింది. ఈ విషయం తెలుసుకున్న మమత తిరిగి రెవెన్యూ కార్యాలయానికి రావడం ప్రారంభించింది. దీంతో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఆమెకు సంబంధించిన ఫైల్‌పై ఆరా తీయగా.. అసలు ఆర్డీవో కార్యాలయానికి పంపించలేదని స్పష్టమైంది. దీంతో సదరు ఉద్యోగి చొరవతీసుకుని ఆ ఫైల్‌ను పరిశీలించి పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయానికి పంపించేలా చర్యలు తీసుకున్నారు. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు పంపించినట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ అండలేని మమత ఫైల్ ప్రభుత్వానికి ఎప్పుడు చేరుతుందో వేచిచూడాల్సిందే. భర్త ఆత్మహత్యతో మమత కూలీ పనికిపోతూ తన ఇద్దరు కూతుళ్లు, కొడుకును పోషిస్తోంది. ప్రస్తుతం ఉండడానికి కనీసం ఇళ్లుకూడా లేదని మమత ఆవేదన వ్యక్తంచేస్తోం. ప్రభుత్వం పరిహారం అందిస్తే అప్పుల బాధ నుంచి విముక్తిపొంది పిల్లలను బాగా చదివిస్తానని అంటోంది. -
దుబాయిలో వలసజీవి ఆత్మహత్మ
బోయినపల్లి : బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశం వెళ్లిన వలసజీవికి అక్కడా కష్టాలు తప్పలేదు. సరైన పనిలేక, చాలీచాలని జీతంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎడపెల్లి అంజయ్య(44)కు ఎకరంన్నర భూమి ఉన్నా, సాగునీటి వసతి లేదు. చాలా సంవత్సరాలుగా భూమి బీడుగా ఉంటోంది. భార్యాభర్తలు ఇద్దరు కూలీకి వెళ్లి తమ కుటుంబాన్ని పోషించేవారు. ఎంతచేసినా ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో అంజయ్య రూ.రెండు లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. అక్కడ చాలీచాలని జీతంతో లేబర్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక్కడ అంజయ్య భార్య విజయ కూలీకి వెళ్తూ పిల్లలను చదివిస్తోంది. గతేడాది డిసెంబర్లో అంజయ్య స్వగ్రామానికి వచ్చి పెద్ద కూతరు జ్యోతి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.రెండు లక్షల వరకు అప్పు చేశాడు. రెండో కూతురు మనీష గంగాధరలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు శివాణి తొమ్మిదో తరగతి. ఇద్దరు కూతుళ్లు ఎదుగుతున్నారు... వారి చదువుల ఖర్చు, తదితర అవసరాలు ఎలా తీర్చాలి.. పైగా రూ.4లక్షల దాకా అప్పులున్నాయని మనస్తాపం చెందుతుండేవాడు. అప్పుడప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కూతుళ్లకు పెళ్లి ఎలా చేయాలని భార విజయతో వాపోయేవాడు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన అంజయ్య ఈనెల 19న దుబాయిలోని తన గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడివారు ఫోన్ ద్వారా తెలియజేశారు. నాలుగు రాళ్లు వెనుకేసుకొస్తాడనుకున్న వ్యక్తి అందరినీ వదిలివెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.