అప్యాయంగా పట్టుకుంటే.. ఫటఫటా విరిగాయి!
ముంబై: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకున్నారు. కాలేజీ రోజులను గుర్తుచేసుకోవాల్సింది పోయి అక్కడ కాస్త విచారకర ఘటన చోటుచేసుకుంది. మిత్రుడి దృతరాష్ట్ర కౌగిలితో మరో మిత్రుడికి ఏకంగా పక్కటెముకలు విరిగిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గత శనివారం మహారాష్ట్రలో ఈ విచిత్రం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. డాక్టర్ మధుకర్ గైక్వాడ్, డాక్టర్ అమిత్ బద్వే లు ఔరంగాబాద్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి 1990లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు.
ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ 27 ఏళ్లలో ఒక్కసారి కూడా మధుకర్, అమిత్‌లు కలుసుకోలేదు. సెయింట్ జార్జ్ హాస్పిటల్లో మధుకర్ సూపరింటెండెంట్ గా చేస్తున్నాడు. స్వతహాగా బాడీ బిల్డింగ్‌పై శ్రద్ధచూపించే అమిత్ అహ్మద్‌నగర్‌లో ప్రైవేట్ క్లినిక్ పెట్టి ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో తన బ్యాచ్‌మేట్, మిత్రుడు మధుకర్ అడ్రస్ తెలుసుకుని ఆయన పనిచేసే హాస్పిటల్‌కు అమిత్ వెళ్లాడు. ఫోన్లో మాట్లాడటం తప్పా.. నేరుగా ఎప్పుడూ కలుసుకోకపోవడంతో అమిత్ చాలా ఎగ్జైట్ అయ్యాడు.
హాస్పిటల్‌కు వెళ్లి చాంబర్లో మధుకర్‌ను చూసిన సంతోషంలో ఆయనను గట్టిగా కౌగిలించుకున్నాడు అమిత్. కొన్ని క్షణాల్లోనే ఫట్ మనే శబ్ధం రావడంతో ఆశ్చర్యపోవడం ఇద్దరి వంతైంది. అమిత్ పక్కకు జరిగిన వెంటనే.. మధుకర్ అక్కడే కుప్పకూలిపోయాడు. క్షణాల్లో వార్డుకి తరలించి ఎక్స్ రే తీసిన వైద్యులు షాక్ తిన్నారు. మధుకర్ పక్కటెముకలు విరిగినట్లు చెప్పారు.
దీనిపై మధుకర్ స్పందిస్తూ.. 'అమిత్ బాడీ బిల్డర్. చాలా దృఢంగా ఉంటాడు. నేను కూర్చోలోంచి పూర్తిగా లేచి నిలబడేలోపే నన్ను గట్టిగా కౌగిలించుకోవడంతో బరువంతా పక్కటెములపై పడి ఒత్తిడి పెరగడంతో ఇలా జరిగింది. అదృష్టవశాత్తూ హాస్పిటల్లో ఉండటంతో ప్రమాదం తప్పింది' అని చెప్పాడు. మరో డాక్టర్ అమిత్ ఈ విషయంపై విచారం వ్యక్తంచేశాడు. 'మిత్రుడికి ఇలా జరగుతుందని అనుకోలేదని.. డాక్టర్లు 15 రోజులు రెస్ట్ అవసరమని చెప్పారు. మధుకర్ గైక్వాడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు' అమిత్ తెలిపాడు.