breaking news
Corporate system
-
కార్పొరేట్ విద్యకు కళ్లెం వేయాలి
♦ విపక్ష సభ్యుల సూచన ♦ ఫీజుల నియంత్రణకు చట్టాలు తేవాలి ♦ ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని హితవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యావ్యవస్థను శాసిస్తున్న కార్పొరేట్ వ్యవస్థకు తక్షణం కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. కార్పొరేట్ల కబంధ హస్తాల్లో పూర్తిగా విద్యావ్యవస్థ చిక్కుకుపోయిందని, దాన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, గట్టి చట్టాల ద్వారానే నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ యూనియన్లను తగ్గించాలని సూచించారు. బుధవారం విద్యావిధానంపై చర్చల్లో పలువురు సభ్యులు మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చేపట్టాలి: కె.లక్ష్మణ్ ‘ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య పూర్తిగా కార్పొరేట్ల పద్మవ్యూహంలో చిక్కుకుంది. కఠిన చట్టాలు చేయకుంటే సామాన్యుడికి పూర్తిగా అందకుండా పోతుంది. కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకి కమిటీలను ఏర్పాటు చేసి, ఫీజుల నియంత్రణ చేయాలి’. కార్పొరేట్లను నియంత్రించాలి: ఆర్.కృష్ణయ్య ‘కార్పొరేట్లు విద్యను వ్యాపారంగా మార్చారు. వారిని నియంత్రించాలంటే కచ్చితంగా మాతృభాషలో విద్యాబోధన ఉండేలా చట్టాన్ని తేవాలి. ఒక యాజమాన్యం కింద ఒకే సంస్థ ఉండేలా, అడ్మిషన్లలో నియంత్రణ పెట్టేలా మార్పులు తేవాలి. ఫీజుల రేట్ల మీద సైతం కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని తేవడంతోపాటు, మౌలిక వసతులను కల్పించాలి. ఆలస్యం చేయకుండా రెసిడెన్షియల్, ఎయిడెడ్, మోడల్, కస్తూర్భా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలో 40 ఉపాధ్యాయ యూనియన్లు ఉన్నాయి. వీటిలో ఉపాధ్యాయులంతా యూనియన్ల పేరుతో చదువు చెప్పడం మానేసి తిరుగుతున్నారు. అలా కాకుండా ఒకే యూనియన్ ఉండేలా, దానికి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేలా చూడాలి’. బొందపెట్టే పరిస్థితి తెచ్చుకోకండి: సంపత్ ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు విద్యార్థులు చేయూతనిచ్చిన ఆందోళనలతో ఉస్మానియా యూని వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఎది గింది. అదే పార్టీ ఇపుడు అధికారంలోకి వచ్చి విద్యార్థులను, యూనివర్సిటీని పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు క్షణాల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలు మాత్రం మూడునెలలైనా యూనివర్సిటీకి చేరలేదు. బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, వారు పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లలేక పోతున్నారు. ఇదిలాగే కొనసాగితే.. అదే ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలో అన్‌పార్లమెంటరీ పదం ఉన్నందున, దాన్ని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. పర్యవేక్షణ లేని స్కూళ్లు: మనోహర్‌రెడ్డి పాఠశాలలపై పర్యవేక్షణ లేకుండా పోయిందని, ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు లేకుండాపోయారు. వారి నియామకాలకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. పాఠశాలలను రేషనలైజేషన్ చేయాలి.. విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించేలా 8వ తరగతి నుంచే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులను ప్రవేశ పెట్టాలి. యూనియన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని అవసరమా.. అందరూ ఆలోచించాలి’. -
సమస్యల స్వాగతం
ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా తీర్చిదిద్దుతామని పాలకులు తరచూ చెప్పే మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. బంగారు భవితపై కోటి ఆశలతో బడిబాట పడుతున్న చిన్నారులకు ఏటా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కరువవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ సంవత్సరం కూడా చిన్నారులకు తిప్పలు తప్పేలా లేవు. వేసవి సెలవులు ముగిసి మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో సమస్యలపై ‘న్యూస్‌లైన్ ఫోకస్’. సూళ్లూరుపేట: పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగలడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. మరోవైపు వందలాది పాఠశాలలు వివిధ సమస్యలకు నెలవుగా మారాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 309 ప్రాథమిక, 61 ప్రాథమికోన్నత, 39 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 248 పాఠశాలలకు ప్రహరీలు లేవు. 200 పైచిలుకు పాఠశాలల్లో వంట గదులు నిల్. 212 పాఠశాలలకు మరుగుదొడ్లు కరువయ్యాయి. మొత్తంగా 50 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటి వసతి కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. 223 పాఠశాలలకు వంటగదులు నిర్మించినా ఉపయోగించక శిథిలావస్థకు చేరాయి. ఇక అదనపు గదుల నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతుండడం ప్రధాన సమస్యగా మారింది. 2004లో సూళ్లూరుపేట మండలంలోని ఆరు పాఠశాలలకు అదనపు గదులు మంజూరయ్యాయి. కుదిరి, ఎడబాళెం, మతకామూడి, మన్నేముత్తేరి, జంగాలగుంట, ఆబాక ప్రాథమిక పాఠశాలల ఆవరణలో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే నిధులు చాలకపోవడంతో కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే వదిలేశారు. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తక్కువ మొత్తంతో అంచనాలు రూపొందించడమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు చెట్ల కింద, వరండాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి.