breaking news
Corporate-level healing
-
పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం
కార్యాచరణ రూపొందిస్తున్నాం: మంత్రి లక్ష్మారెడ్డి బీబీనగర్ నిమ్స్‌లో ఓపీ విభాగం ప్రారంభం త్వరలో ఇన్ పేషంట్ విభాగాన్ని ప్రారంభిస్తామని వెల్లడి బీబీనగర్: రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపురంలోని నిమ్స్ యూనివర్సిటీలో ఆదివారం ఔట్ పేషంట్ (ఓపీ) విభాగాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఔట్ పేషెంట్ విభాగంలో అన్ని రకాల ప్రాథమిక వైద్యం అందిస్తామని, అవసరమైన రోగులను అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రెఫర్ చేయనున్నట్లు తెలిపారు. వైద్య రంగాన్ని అభివృద్ధి చేసే విషయమై ప్రత్యేక దృష్టి సారించామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తామని మంత్రి పేర్కొన్నారు. బీబీనగర్ నిమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించి హైదరాబాద్ నిమ్స్ తరహాలో దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌రావు, డిప్యూటీ డెరైక్టర్ కేటీ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రుల ప్రక్షాళన
భద్రాచలం : వ్యాధుల బారిన పడినవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాస్పత్రులను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం రాత్రి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బస చేసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రాంతంలో ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాకు’ అనే దుస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వాల శాపం, వారు చేసిన పాపం వల్ల ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగం అభివృద్ధికి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఏరియా ఆస్పత్రికి రూ.కోటి చొప్పున మంజూరు చేశామన్నారు. వైద్య సేవల వికేంద్రీకరణ దిశగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఏరియా ఆస్పత్రిలో రాత్రి బస చేస్తున్నానని తెలిపారు. ఐదు నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పారు. రిఫరల్ విధానానికి స్వస్తి పలకాలని, 30 శాతం ఉన్న ఆస్పత్రుల సేవలను 50 నుంచి 60 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. వైద్యులు రోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు. ప్రతి పీహెచ్సీ వైద్యుడికి ప్రత్యేక వాహనం కేటాయిస్తామని, ఇందుకోసం నెలకు రూ. 25 వేలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పీహెచ్‌సీల స్థాయి పెంపు... రాష్ట్రంలో అవసరమైన చోట్ల పీహెచ్‌సీల స్థాయిని పెంచేందుకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 31 పీహెచ్‌సీల్లో మౌలిక వసతుల కల్పనకు కోసమని ఒక్కో కేంద్రానికి రూ.40 లక్షలు విడుదల చేస్తున్నామని, రూ.30 కోట్లతో పలు పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. వైద్యులకు కూడా ప్రొటోకాల్ ఉండేలా ఉత్తర్వులు ఇస్తామన్నారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రాచలం ఆసుపత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రం... మలేరియా, డెంగీ జ్వరాల నివారణకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్లేట్లెట్ కౌంట్ యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రాజయ్య తెలిపారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.18.30 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి రూ.10 కోట్లు కేటాయించామన్నారు. మలేరియా, డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదయ్యే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రోగుల నాడిపట్టిన రాజయ్య.. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పలువురు రోగులను మంత్రి రాజయ్య నాడిపట్టి పరీక్షించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. వైద్యశాఖపై సమీక్ష :- పర్యటనలో భాగంగా రాత్రి పది గంటల తరువాత వైద్య శాఖపై ఏరియా ఆసుపత్రిలోనే సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో దివ్య, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భానుప్రకాష్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఆసుపత్రుల జిల్లా సమన్వయ అధికారిణి ఆనందవాణి, సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి, క్లస్టర్ అధికారిణి కోమల తదితరులు ఉన్నారు. మంత్రి రాత్రి బస నేపథ్యంలో కొత్తగూడెం డీఎస్పీ సురేందర్ నేతృత్వంలో భద్రాచలం, పాల్వంచ సీఐలు ఆంజనేయలు, షుకూర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.